బిజెపి రాబోయే తరం భవిష్యత్తు కోసం ఆలోచిస్తుంది

బిజెపి రాబోయే తరం భవిష్యత్తు కోసం ఆలోచిస్తుంది
బీజేపీ వచ్చే ఎన్నికల కోసం కాకుండా, రాబోయే తరం భవిష్యత్తు కోసం ఆలోచిస్తుందని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. తాము ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నామని పేర్కొంటూ, అయోధ్య గడ్డపైనే భవ్య రామమందిరాన్ని నిర్మిస్తామని చెప్పి చేసి చూపించామని గుర్తు చేశారు.  సికింద్రాబాద్‌లో నిర్వహించిన ‘మేధావుల సమ్మేళనం’లో ఆయన “12 ఏళ్ల సుపరిపాలన – అభివృద్ధి – ప్రజా సంక్షేమం” అనే అంశంపై మాట్లాడుతూ  దేశంలోకి వచ్చే అక్రమ చొరబాటుదారులను సరిహద్దుల వెలుపలికి పంపుతామని చెప్పామని, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ ప్రక్రియ వేగంగా జరుగుతోందని చెప్పారు. 
 
పశ్చిమ బెంగాల్‌లో కూడా చొరబాటుదారులను బయటకు పంపే పని వేగవంతమైందని రక్షణ మంత్రి తెలిపారు.   మోదీ నేతృత్వంలోని గడిచిన 12 సంవత్సరాల కాలం దేశ ప్రగతిలో, సంస్కరణల పరంగా చారిత్రాత్మకమైనవని, 2047 నాటికి భారతదేశం ఖచ్చితంగా ‘వికసిత భారత్’గా మారి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  రాజకీయాల్లో నాయకుడికి లేదా పార్టీకి అతిపెద్ద పెట్టుబడి విశ్వసనీయత అని, చెప్పేదానికి చేసేదానికి తేడా ఉన్నప్పుడు విశ్వసనీయత సంక్షోభం ఏర్పడుతుందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. 
కాంగ్రెస్ హయాంలో ఈ సంక్షోభం ఉండేదని, కానీ బీజేపీ ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ప్రజల్లో నమ్మకాన్ని పెంచిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన వారికి అక్కడి ప్రజలు బుద్ధి చెప్పారని, అక్కడ బీజేపీ స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విజయవంతమైందని గుర్తుచేశారు. 
 
తాము అధికారంలోకి వచ్చాక రక్షణ బడ్జెట్‌ను రూ. 2.5 లక్షల కోట్ల నుండి దాదాపు రూ. 8 లక్షల కోట్లకు పెంచామని, రక్షణ రంగానికి కేటాయించే ప్రతి పైసా అత్యంత పారదర్శకంగా, దేశ భద్రత కోసమే ఖర్చవుతోందని రక్షణ మంత్రిగా హామీ ఇచ్చారు. కొత్త పార్లమెంట్ భవనంలో చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే చారిత్రాత్మక బిల్లును తీసుకువచ్చామని చెబుతూ మహిళలకు పూర్తి భాగస్వామ్యం, హక్కులు దక్కే వరకు తాము విశ్రమించబోమని, ఇది మోదీ ప్రభుత్వ గ్యారెంటీ అని స్పష్టం చేశారు. 
 
దేశంలో సమయం, వృధా ఖర్చులను తగ్గించడానికి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్నదే తమ ఆలోచన అని, అందరినీ విశ్వాసంలోకి తీసుకుని ఈ పనిని ఖచ్చితంగా చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. గతంలో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని చూసినా, అవతలి పక్షం విననప్పుడు బలం ఉపయోగించి సంస్థానాలను విలీనం చేసిన సర్దార్ పటేల్ విధానాన్నే తమ ప్రభుత్వం అనుసరిస్తోందని తెలిపారు.
 
మనపై దాడి చేసే వారికి వారి భాషలోనే సమాధానం చెబుతామని రక్షణ మంత్రి హెచ్చరించారు. గతంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా బుద్ధి చెప్పామని, అలాగే ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా శత్రువులకు గట్టి సందేశం ఇచ్చామని పేర్కొంటూ, మానవత్వానికి శత్రువులైన వారికి సింధు నది నీటిని ఇచ్చే ప్రసక్తే లేదని, పాకిస్తాన్ వైఖరి మారనంత వరకు కఠినంగానే ఉంటామని స్పష్టం చేశారు.

దశాబ్దాలుగా మన భద్రతా దళాలతో, సామాన్య ప్రజలతో రక్తపాతాన్ని సృష్టించిన నక్సలిజాన్ని మోదీ నాయకత్వంలో భారతదేశ గడ్డపై నుండి దాదాపు తుడిచిపెట్టేశామని రక్షణ మంత్రి సగర్వంగా ప్రకటించారు. గతంలో తుపాకీ శబ్దాలు మోగిన ప్రాంతాల్లో ఈరోజు స్కూల్ బెల్స్ మోగుతున్నాయని, రోడ్లు, అభివృద్ధి వేగంగా చేరుతున్నాయని చెప్పారు. 

 
దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ ‘వన్ నేషన్, వన్ మార్కెట్, వన్ టాక్స్’ విధానంతో జీఎస్టీని విజయవంతంగా అమలు చేశామని, దీనివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరిగిందని తెలిపారు. శ్రామికుల సామాజిక భద్రత, ఆదాయం పెంచేందుకు నాలుగు లేబర్ కోడ్‌లను తెచ్చామని, అలాగే వలసరాజ్యాల కాలం నాటి పాత చట్టాల స్థానంలో దేశ పౌరుల హక్కులను వేగంగా కాపాడేలా కొత్త న్యాయ చట్టాలను తీసుకువచ్చామని తెలిపారు. 
 
జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని ఎవరూ తొలగించలేరన్న కాంగ్రెస్ మాటలను పటాపంచలు చేస్తూ, తమ ప్రభుత్వం దానిని చిటికెలో రద్దు చేసిందని, “ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు చెల్లవు” అన్న పండిత్ శ్యామాప్రసాద్ ముఖర్జీ కలని నిజం చేశామని చెప్పారు.  గతంలో రాళ్లు రువ్వడం, ఉగ్రవాదంతో వార్తల్లో నిలిచిన కాశ్మీర్ ఈరోజు పర్యాటకం, పెట్టుబడులు, ఉపాధితో కళకళలాడుతోందని, లాల్ చౌక్‌లో త్రివర్ణ పతాకం ఎగురుతోందని, పైగా అక్కడ జన్మాష్టమి వేడుకలతో పాటు మొహర్రం ఊరేగింపులు కూడా శాంతియుతంగా జరుగుతున్నాయని వివరించారు.

2014కు ముందు దేశంలో నిరాశ నిండి ఉండేదని, విదేశీ పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదని, కానీ నేడు ప్రపంచ దేశాలన్నీ భారత్‌తో వాణిజ్య సంబంధాల కోసం పోటీ పడుతున్నాయని రక్షణ మంత్రి తెలిపారు. గత 12 ఏళ్లలో 38 దేశాలు భారత్‌తో కొత్త వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాయని పేర్కొంటూ, ‘మేక్ ఇన్ ఇండియా’ విజయాలను వివరించారు. 

 
భారతదేశానికి ఏటా 19 బిలియన్ల సెమీకండక్టర్ చిప్స్ అవసరమవుతాయని, గతంలో 1960లలో, 2004-05లో కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా తాత్సార్యం చేయడం వల్ల సదరు కంపెనీలు చైనాకు వెళ్లిపోయాయని, దేశం పెద్ద ఎత్తున ఉపాధిని కోల్పోయిందని విమర్శించారు. కానీ మోదీ  రాగానే దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని ప్రోత్సహించి, గత ఏడాది దేశంలోనే మొట్టమొదటి ‘మేడ్ ఇన్ ఇండియా’ సెమీకండక్టర్ చిప్‌ను తయారు చేసి చూపామని ప్రకటించారు. 
 
అలాగే ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్న ఐఫోన్లలో 25% భారతదేశంలోనే తయారవుతున్నాయని వెల్లడించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ ద్వారా సూది నుండి ఓడల వరకు, మొబైల్స్ నుండి క్షిపణుల  వరకు, డ్రోన్ల నుండి వ్యాక్సిన్ల వరకు అన్నీ భారత్ గడ్డపైనే తయారవుతున్నాయని, ఈ ఏడాది ఎగుమతుల లక్ష్యాన్ని 1 ట్రిలియన్ డాలర్లకు, రాబోయే ఐదేళ్లలో 2 ట్రిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 
 
గతంలో కేవలం రూ. 600 కోట్లు లేదా రూ. 1000 కోట్లుగా ఉన్న రక్షణ రంగ ఎగుమతులు నేడు దాదాపు రూ. 39,000 కోట్లకు చేరాయని, ప్రపంచంలోని 100కు పైగా దేశాలకు భారతదేశం రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తోందని సగర్వంగా ప్రకటించారు.