* యుపిలో బిజెపి శ్రేణులకు నితిన్ నబిన్ హితవు
అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఆరోపణల వల్ల తలెత్తే రాజకీయ పరిణామాలపై బీజేపీలో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో, ఆ పార్టీ కేంద్ర నాయకత్వం శనివారం ఉత్తరప్రదేశ్ నేతలకు కీలక సూచనలు చేసింది. ఈ వ్యవహారాన్ని “జాగ్రత్తగా” చేపట్టాలని, దోషులపై తక్షణ చర్యలు తీసుకుంటామని ప్రజలకు భరోసా ఇవ్వాలని, అలాగే ఈ విషయంలో బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న చర్యలను వారికి వివరించాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది.
ఉత్తరప్రదేశ్‌తో సహా పలు కీలక రాష్ట్రాల్లో ఏడాది లోపే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో, రామమందిర విరాళాల వివాదం, యుజిసి నిబంధనల సమస్య ప్రభావంపై బీజేపీ కేంద్ర నాయకత్వం ఆందోళన చెందుతోందని సమాచారం. రెండు రోజుల ఉత్తర ప్రదేశ్ పర్యటనకు వచ్చిన బిజెపి అధ్యక్షుడు నితిన్ నబిన్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో, రామమందిర విరాళాల చోరీ, ఈ ఏడాది ప్రారంభంలో తలెత్తిన యూజీసీ నిబంధనల వివాదం గురించి ప్రస్తావించారు.
విరాళాల దుర్వినియోగం ఆరోపణలు మొత్తం హిందూ సమాజాన్ని,బీజేపీ సంస్థను బాధించాయని నబిన్ పేర్కొన్నారు. ఈ చోరీ ఆరోపణలను కొందరు ‘తప్పుడు వ్యక్తులు’ చేసిన ‘పొరపాటు’గా ఆయన అభివర్ణించారు. ఆ పొరపాటును సరిదిద్దుతామని, దోషులను శిక్షించడానికి, భవిష్యత్తులో (విరాళాల లెక్కింపులో) మరింత పారదర్శకతను తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.
మందిర విరాళాల చోరీ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రతిపక్ష పార్టీలు “కుట్ర” పన్నుతున్నాయని నబిన్ ఆరోపించారని, ఇందుకు ఉదాహరణగా ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల అయోధ్యలో పర్యటించడాన్ని ఆయన ప్రస్తావించారని సమాచారం. బీజేపీ ముఖ్య నేతలతో జరిగిన అంతర్గత సమావేశంలో నబిన్ మాట్లాడుతూ, “బీజేపీ ప్రభుత్వంపై విమర్శించడానికి తమ దగ్గర ఎటువంటి అంశాలు లేకపోవడంతో, ప్రజల దృష్టిని మళ్లించడానికి సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ ప్రతికూల రాజకీయాలకు పాల్పడుతున్నాయి” అని విమర్శించారు.
“మనం ప్రతిపక్షాల ఉచ్చులో పడకూడదు. మనం యూపీ అభివృద్ధి కోసం కృషి చేయాలి” అని నబిన్ పేర్కొన్నారు. యుజిసి నిబంధనల వివాదం కారణంగా యూపీ జిల్లాలకు చెందిన కొందరు అగ్రవర్ణ నేతలు బీజేపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో, పార్టీ సభ్యులు ఎటువంటి ఆందోళనకు గురికావద్దని లేదా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని నబిన్ సూచించారు.” కొత్త యుజిసి నిబంధనల వెనుక ఉన్న ఉద్దేశ్యం తప్పు కాదని, ఏది జరిగి ఉన్నా ప్రభుత్వం దానిని సరిదిద్దుతుందని నబిన్ చెప్పారు” అని ఒక బీజేపీ నేత తెలిపారు.
లక్నోలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఒక అంతర్గత సమావేశంలో, నబిన్ సమక్షంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బి.ఎల్. సంతోష్ రామమందిర విరాళాల వివాదంపై మాట్లాడారని సమాచారం. కొత్త యుజిసి నిబంధనల వివాదంపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ సమావేశానికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరయ్యారు.
“సంతోష్‌జీ తన ప్రసంగంలో రామమందిరం, యుజిసి నిబంధనల అంశాలపై జాగ్రత్తగా ఉండాలని మాకు సూచించారు. ‘విరాళాల చోరీ’ వ్యవహారం దురదృష్టకరమని, అయితే దీనిపై విచారణ జరిపేందుకు బీజేపీ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వం వెంటనే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసిందని ప్రజలకు వివరించాలని ఆయన పార్టీ నాయకులను కోరారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిందితులను అరెస్టు చేశామని కూడా చెప్పమన్నారు,” అని సమావేశానికి హాజరైన ఒక పార్టీ నాయకుడు తెలిపారు.
మరొక నాయకుడు మాట్లాడుతూ, “యుజిసి నిబంధనల విషయానికొస్తే, కొత్త నిబంధనల నోటిఫికేషన్‌లో కొన్ని పదాలను తప్పుగా వాడటం వల్ల ప్రతికూల సంకేతం వెళ్లిందని సంతోష్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని మనం ప్రజలకు తెలియజేయాలి,” అని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో జారీ చేసిన యుజిసి ఈక్విటీ నిబంధనలు (2026), ఉన్నత విద్యా సంస్థలలో కుల వివక్షతో సహా అన్ని రకాల వివక్షలను పరిష్కరించే లక్ష్యంతో రూపొందించారు.
అయితే, ఈ నోటిఫికేషన్ విద్యార్థులలోని కొన్ని వర్గాల నుండి నిరసనలకు, దానిని ఉపసంహరించుకోవాలనే డిమాండ్లకు దారితీసింది. కొత్త నిబంధనలు కులపరమైన విభజనలను సృష్టిస్తాయని , ‘జనరల్ కేటగిరీ’ (సాధారణ వర్గం) వారికి వేధింపులకు కారణమవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
అనంతరం, రామమందిర విరాళాల అంశంపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు నబిన్ స్పందిస్తూ, ఆయన “మొసలి కన్నీరు కారుస్తున్నారని” ధ్వజమెత్తారు. “రామమందిరం పట్ల ఎప్పుడూ దురుద్దేశాలు ఉన్నవారు, ఆ మందిరానికి సంబంధించిన విశ్వాసంతో ముడిపడి ఉండకపోవడమే మంచిది,” అని ఆయన వ్యాఖ్యానించారు. 2027 ఎన్నికల్లో ‘కమలం’ (బీజేపీ) మళ్లీ వికసించేలా పునాది వేయడమే తన రెండు రోజుల యూపీ పర్యటన ఉద్దేశమని నబిన్ తెలిపారు.

More Stories
సంఘ్ శాఖ వ్యక్తిత్వ వికాసానికి ఒక ప్రయోగశాల
ఈ20 ఇంధన సరఫరాకు భూటాన్ నిరాకరణ
ఆర్ఎస్ఎస్ కు చట్టబద్దతపై ఖర్గే వాదనను తిరస్కరించిన కోర్టు