అయితే తక్కువ కాలం నిర్వహించిన సమావేశాలు కూడా గతంలో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ విజయాల తర్వాత మొదటిసారి వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. రానున్న సమావేశాల్లో టీఎంసీ, శివసేన(యూబీటీ)లో తలెత్తిన తిరుగుబాట్లు కీలక భూమికను పోషించనున్నాయి. తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరుతూ 20 మంది టీఎంసీ, శివసేన(యూబీటీ) ఎంపీల వినతులు ప్రస్తుతం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పరిశీలనలో ఉన్నాయి.
కొత్తగా ఎన్నికైన సభ్యులు, తిరిగి ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేయడంతో రాజ్యసభలో రాజకీయ పార్టీల బలాబలాలు అధికార ఎన్డీయేకు అనుకూలంగా మారాయి. 2029 నాటికి చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం, లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచడం లక్ష్యంగా ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు దిగువ సభలో వీగిపోవడంతో ప్రభుత్వానికి గత పార్లమెంట్ సమావేశాలు నిరాశతో ముగిశాయి.
అన్ని రాష్ర్టాల లోక్‌సభ స్థానాలను ఏకరీతిగా 50 శాతం వరకు పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పుడు ఆ బిల్లును తిరిగి రూపొందిస్తోంది. జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్య పెరుగడం దక్షిణాది పార్టీలకు ఒక ప్రధాన ఆందోళనగా మారింది. తాజా ప్రతిపాదనల ప్రకారం, 1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాల నిష్పత్తిని యథాతథంగా కొనసాగిస్తూ, మొత్తం స్థానాల సంఖ్యను పెంచే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. లోక్‌సభతో పాటు రాష్ట్ర శాసనసభల నియోజకవర్గాల పునర్విభజనను 2011 జనాభా లెక్కల ఆధారంగా చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుత చట్టం ప్రకారం మహిళా రిజర్వేషన్ అమలు 2027 జనగణన అనంతర డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయ్యాకే సాధ్యమవుతుంది. అంటే 2034కు ముందుగా ఈ చట్టం అమల్లోకి వచ్చే అవకాశం లేదు.
అయితే 2029 లోక్‌సభ ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలంటే నారీ శక్తి వందన్ అధినియమ్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం పరిశీలిస్తున్న ప్రణాళిక ప్రకారం ప్రస్తుతం 543 ఉన్న లోక్‌సభ స్థానాలను గరిష్ఠంగా 850కు పెంచే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు స్థానాల సంఖ్యను పెంచే ప్రతిపాదనలు ఉన్నాయి.
అలాగే మహిళలకు కేటాయించే లోక్‌సభ, శాసనసభ స్థానాలను ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రొటేషన్ విధానంలో వేర్వేరు నియోజకవర్గాలకు కేటాయించాలని తాజా రాజ్యాంగ సవరణ ముసాయిదా బిల్లులో ప్రతిపాదించినట్లు సమాచారం. ఈసారి వర్షాకాల సమావేశాల్లో పలు కీలక బిల్లులు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ బిల్లును పరిశీలిస్తున్న జేపీసీ జూలై 17న సమావేశమై తన నివేదికను ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అనంతరం నివేదికను పార్లమెంట్ పరిశీలనకు సమర్పించనున్నారు. తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర లేదా రాష్ట్ర మంత్రులు అరెస్టై వరుసగా 30 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంటే వారిని పదవి నుంచి స్వయంచాలకంగా తొలగించాలనే ప్రతిపాదన ఈ బిల్లులో ఉన్నట్లు సమాచారం. ఈ నిబంధనపై ఇప్పటికే తీవ్ర రాజకీయ చర్చ జరుగుతోంది.

More Stories
జమ్మూకశ్మీర్ పాఠ్యపుస్తకాల్లో ఉగ్రవాదులపై పొగడ్తల దుమారం
అయోధ్య విరాళాలు, యుజిసి నిబంధనలపై జాగ్రత్త!
సంఘ్ శాఖ వ్యక్తిత్వ వికాసానికి ఒక ప్రయోగశాల