పాక్ అదుపు తప్పిన పీఓకే .. ఆర్మీ కాల్పుల్లో వంద మందికి పైగా మృతి?

పాక్ అదుపు తప్పిన పీఓకే .. ఆర్మీ కాల్పుల్లో వంద మందికి పైగా మృతి?
* నలుగురు ఉద్యమకారులపై రూ 1 కోటి చొప్పున నజరానా
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) రక్తపాతంతో  అట్టుడుకుతోంది. జూలైలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా శరణార్థులకు 12 స్థానాలు కేటాయించడంపై జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) నిరసనలకు పిలుపునివ్వడంతో పరిస్థితులు పాకిస్థాన్ ప్రభుత్వ అదుపు తప్పుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.  దానితో  ప్రభుత్వం ఆ సంస్థను ఉగ్రవాద సంస్థల్లోకి చేర్చింది. 
 
ఈ పరిస్థితులకు జాయింట్ అవామీ యాక్షన్ కమిటీని కారణం చేస్తూ, జేఏఏసీకి చెందిన నలుగురు నేతలపై రూ. కోటి బహుమతి ప్రకటిస్తూ బహిరంగ పోస్టర్లు విడుదల చేసింది. అంతేగాకుండా అక్కడ జరుగుతున్న హింసాకాండకు నలుగురు నేతలను బాధ్యుల్ని కూడా చేశారు. షౌకత్ నవాజ్ మీర్, ఉమర్ నజీర్ కశ్మీరీ, ఖ్వాజా మెహ్రాన్ అర్షద్, సర్దార్ అమన్ ఖాన్‌ తలలపై రూ. కోటి నజరానా ప్రకటించారు.
 
ఈ నలుగురు ఎక్కడ కనిపించిన సమాచారం ఇవ్వాలంటూ పీఓకేలో పోస్టర్లు కూడా విడుదల చేసింది. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామంటూ ప్రకటనలు వెలువడ్డాయి. పైగా, ఎలాగైనా అక్కడి అల్లర్లు, ఉద్యమాన్ని అణచివేయాలని కాల్పులకు తెగబడుతున్నారు. పాక్ ఆర్మీ చేసిన ఈ కాల్పుల్లో వంద మందికి పైగా నిరసనకారులు మరణించగా, 400 మందికిపైగా గాయపడ్డారని సమాచారం. వందలాది మంది నిరసనకారులను కూడా అరెస్ట్ చేశారు. 
 
తాజాగా, గురువారం ఆందోళనకారులపై పాక్ ఆర్మీ కాల్పులు జరపడంతో  16 మంది మరణించగా, 37 మందికి పైగా గాయపడ్డారు. పీవోకే పరిధిలోని రావల్‌కోట్‌లోని ఈద్గా గ్రౌండ్‌లో ఆందోళనకారులు నిరసనలు చేస్తుండగా, వారిపై పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. నిరాయుధులైన వేలమంది ఇక్కడ ఆందోళన చేస్తుండగా వారిపై పాక్ ఆర్మీ విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. 
 
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌‌ (పీవోకే)లో ప్రజలకు సరైన హక్కులు దక్కడం లేదు. దీంతో అక్కడివారు తమకు తక్కువ ధరకే బియ్యం, పిండి, విద్యుత్ వంటివి అందించాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనల్ని అణచివేయడానికి పాక్ ప్రభుత్వం హింసాయుత చర్యలకు దిగుతోంది. తాజా ఘటనకు సంబంధించి గురువారం 60,000 నుంచి 70,000 మంది స్థానికులు ఇక్కడ సమావేశమయ్యారు. పురుషులు, స్త్రీలు, యువత సహా అందరూ ఆందోళన చేస్తుండగా ఆర్మీ కాల్పులు జరిపింది.ఘటన తర్వాత ఆ ప్రదేశమంతా రక్తపు మరకలతో నిండిపోయింది. గత శుక్రవారం నుంచి పీవోకేలో ఆందోళనకారులపై పాక్ జరిపిన కాల్పుల్లో 57 మంది మరణించారు. వందల మంది గాయపడ్డారు. పాక్ ఆర్మీ ఇంతగా అణచివేస్తున్నా అక్కడి ప్రజలు తమ ఆందోళనల్ని విరమించడం లేదు. తమకు హక్కులు కావాలని, ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 

మరోవైపు పాక్ ప్రభుత్వ చర్యలపై మండిపడుతున్నారు. ఆర్మీ సిబ్బంది తీవ్రవాదుల్లా ప్రవర్తిస్తూ దాడులు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. పాక్ వ్యవహరించిన ఈ తీరును అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. పీఓకేలో పాకిస్తాన్ చేపడుతున్న చర్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. 

విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ పాకిస్తాన్ చేసిన దుర్మర్గాపు చర్యలను అంతర్జాతీయ వేదికలపై ఎండగడుతామని చెప్పారు.  50 మందికి పైగా బ్రిటిష్ ఎంపీలు యూకే ప్రభుత్వానికి వ్రాసిన లేఖలో ఈ అణచివేతను ‘అమానుషమైనది’గా అభివర్ణించారు. అరెస్టులు, సమాచార నిలిపివేతలు, ప్రాణాంతక బలప్రయోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ కూడా జేఏఏసీని ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద నిషేధించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.