మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌స్వీప్

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌స్వీప్
* ఏపీలో నలుగురు రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల ఎన్నిక ఏక‌గ్రీవం

మధ్యప్రదేశ్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి  మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో పోటీ లేకుండానే బీజేపీ ముగ్గురు అభ్యర్థులు ఎన్నికయ్యారు. బీజేపీ తరఫున బరిలో నిలిచిన త‌రుణ్‌చుగ్‌, ర‌జ‌నీశ్ అగ‌ర్వాల్‌, మ‌హేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ తరఫున పోటీకి దిగిన అభ్యర్థి మీనాక్షి నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో ఎన్నిక ఏకపక్షంగా మారింది.

దీంతో మూడో స్థానానికి కూడా బీజేపీ అభ్యర్థి ఎన్నిక కావడానికి మార్గం సుగమమైంది. అనంతరం ముగ్గురు అభ్యర్థుల ఎన్నికను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. వారికి నియామక పత్రాల్ని కూడా ఈసీ అందించింది. నిజానికి ఈ ఎన్నిక ఈ నెల 18న జరగాల్సి ఉంది. కానీ, కాంగ్రెస్ అభ్యర్తి మీనాక్షి నామినేషన్‌ను ఈసీ తిరస్కరించింది. తెలంగాణలో నమోదైన ఒక కేసుకు సంబంధించి ఆమె వివరాలు పేర్కొనలేదని చెబుతూ మీనాక్షి నామినేషన్‌ను తిరస్కరించింది. 

ఈ విషయంపై బీజేపీ తగిన ఆధారాల్ని ఈసీకి సమర్పించింది. వాటిని పరిశీలించిన ఈసీ మీనాక్షి అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు ఉన్నాయని భావించి, ఆమె నామినేషన్‌ రద్దు చేసింది. అయితే  తమ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ అన్యాయమని ఆరోపిస్తున్న  కాంగ్రెస్  ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది.  ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమైంది. రాష్ట్రానికి చెందిన 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్రపతిని కలిసి ఈ అంశంపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 

మరోవంక, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీకి అవసరమైన దానికంటే ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఎన్నిక ఏకపక్షంగా ముగిసింది. ఈ నేపథ్యంలో సానా సతీష్‌, చింత‌కాయ‌ల విజ‌య్‌, భాష్యం రామ‌కృష్ణ‌, లింగ‌మ‌నేని ర‌మేష్‌లు రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.