పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీ అంతర్గత సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతున్నది. మమతపై అసంతృప్తితో రగిలిపోతున్న ఎంపీలు, ఎమ్మెల్యే ఆ పార్టీ నుండి నిష్క్రమిస్తున్నారు. తాజాగా టీఎంసీ రాజ్యసభ సభ్యుడు ప్రకాష్ చిక్‌బరైక్ పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
“గౌరవనీయులైన అధ్యక్షా, నేను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. దయచేసి దీనిని తక్షణమే ఆమోదించవలసిందిగా కోరుతున్నాను. రాజ్యసభ సభ్యుడిగా నా పదవీకాలంలో నాకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన మీకు, గౌరవనీయులైన డిప్యూటీ చైర్మన్‌కు, రాజ్యసభ సచివాలయ అధికారులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను,” అని రాజ్యసభ చైర్మన్ సి.పి. రాధాకృష్ణన్‌కు సమర్పించిన రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు.
విలేకరులతో మాట్లాడుతూ “పశ్చిమ బెంగాల్ ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ, నేను కూడా ఈ రోజు నా రాజీనామాను సమర్పించాను” అని చెప్పారు. తాను బీజేపీలో చేరుతారా? అని అడిగినప్పుడు, “కాలమే సమాధానం చెబుతుంది” అని ఆయన బదులిచ్చారు. ప్రకాష్ చిక్ బరైక్ పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ గిరిజన నాయకుడు. ఆయన సిలిగురి ప్రాంతంతో సంబంధం కలిగి ఉండి, రాష్ట్రంలోని ఉత్తర భాగంలో ఉన్న అలీపుర్‌దువార్ జిల్లాకు చెందినవారు.
ఆగస్టు 2023లో టీఎంసీ అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ నుండి రాజ్యసభకు ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ రాష్ట్రం నుండి పార్లమెంటు ఎగువ సభకు (రాజ్యసభకు) ఎన్నికైన తన వర్గానికి చెందిన తొలి గిరిజన నాయకులలో ఒకరిగా బరైక్ పరిగణించబడుతున్నారు. టీఎంసీ ఆయనను అలీపుర్‌దువార్ జిల్లా అధ్యక్షుడిగా కూడా నియమించింది.
పార్లమెంటులో తన పదవీకాలంలో, ఆయన టీ తోటల కార్మికులకు సంబంధించిన సమస్యలను – ముఖ్యంగా వారి హక్కులు, ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాలు, సామాజిక సంక్షేమ పథకాల లభ్యత వంటి అంశాలను నిరంతరం లేవనెత్తారు. ఇటీవలే రాజ్యసభ సభకు సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్ రాజీనామా చేయగా నేడు ప్రకాష్ సైతం రాజీనామా చేయడంతో నాలుగు రోజులలో టీఎంసీ రాజ్యసభ సభ్యుల రాజీనామాల సంఖ్య మూడుకు చేరింది.
చిక్‌బరైక్ రాజీనామాతో రాజ్యసభలో ఆ పార్టీ బలం 10 మంది సభ్యులకు పడిపోనుంది. రాబోయే వారంలో మరో ముగ్గురు టీఎంసీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసే అవకాశం ఉందని, తద్వారా మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీకి సంక్షోభం మరింత తీవ్రమయ్యే సూచనలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. పార్టీని వీడిన ఎంపీలు, ఎమ్మెల్యేలు త్వరలోనే ఎన్డీఏలో చేరనున్నట్లు సమాచారం.

More Stories
అస్పృశ్యత భావన సమాజాన్ని విభజిస్తుంది
కాంగ్రెస్ ద్రోహంతో దెబ్బతిన్న ప్రజలు ఎన్‌డిఎపై ఆశలు
టీఎంసీ రెబల్ గ్రూప్‌లో 19 మంది ఎంపీలు స్పీకర్‌కు లేఖ!