విద్యార్థుల కఠోర శ్రమ, అంకితభావం, పట్టుదల, నిబద్ధత ఫలితమే డిగ్రీ సాధించడానికి ప్రధాన కారణమని, స్నాతకోత్సవం కేవలం ఒక ఉత్సవ కార్యక్రమం మాత్రమే కాదని, జ్ఞానం, పట్టుదల, క్రమశిక్షణ, ఆశయాలు, విజయాల వేడుక అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. బుధవారం శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ఎస్ వి ఆడిటోరియం నందు నిర్వహించిన 63 నుండి 68 వ ఉమ్మడి స్నాత కోత్సవంలో గవర్నర్ పాల్గొని విద్యార్థులకు పథకాల ప్రధానంతో పాటు డిగ్రీ లు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆచార్య అజయ్ కుమార్ సూద్, భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారులు, డాక్టర్ సి.మాండే, భారత జాతీయ విజ్ఞాన అకాడమీ అధ్యక్షులు, శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధన మండలి (సియస్.ఐ.ఆర్.) మాజీ డైరెక్టర్ జనరల్, డాక్టర్ కృష్ణ యం.ఎల్ల, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, భారత బయోటెక్ ఇంటర్నేషనల్ లకు గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్లు ప్రధానం చేశారు.
వీరితో పాటు తుడా చైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి ఎస్వీ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. ఎస్వీ యూనివర్సిటీలోని ఎకనామిక్స్ విభాగంలో “ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ టెనెంట్ ఫార్మర్స్: ఎ కేస్ స్టడీ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్” (చిత్తూరు జిల్లాలోని కౌలు రైతుల ఆర్థిక పరిస్థితులు) అనే కీలకమైన అంశంపై ఆయన పరిశోధన చేశారు.
ఈ స్నాతకోత్సవంలో 502 మంది విద్యార్థులు బంగారు పథకాలు, 260 మంది ప్రత్యేక బహుమతులు అందుకున్నారు. మొత్తం 2713 మంది విద్యార్థులు నేరుగా, 719 మంది హాజరు మినహాయంపు పద్ధతిలో, 12,141 మంది ముందస్తు విధానం ద్వారా పొందారు. ఈ కార్యక్రమంలో విసి ఆచార్య టాటా నరసింగరావు, రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు, వర్సిటీ వివిధ కళాశాలల డీన్లు, ప్రిన్సిపాల్ లు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కాగా, అంతకు ముందు ప్రస్తుత కాలంలో డిజిటల్ పరివర్తన, కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోందని గవర్నర్ తెలిపారు. నెల్లూరు జిల్లాలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవ సభలో పాల్గొంటూ ఉన్నత విద్యాసంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించి విద్యార్థులను భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం చేయాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్య అందుబాటులోకి రావాలంటే డిజిటల్ విద్యను విస్తృతంగా వినియోగించాలని తెలిపారు. విద్యార్థులు తమ వృత్తి జీవితంలో కమ్యూనికేషన్ నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను నిరంతరం పెంపొందించుకోవాలని సూచించారు. కరుణ, నిజాయితీ, వినయం, పరస్పర గౌరవం వంటి విలువలను జీవితాంతం పాటించాలని సూచించారు.

More Stories
లక్ష్మీ నరసింహ స్వామి కోనేరు నిర్మాణంలో రూ. 6 కోట్ల అవినీతి
విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
గోసేవ ప్రాముఖ్యతపైతిరుపతిలో ‘వాక్ టూ హీల్’ వాకథాన్