లక్ష్మీ నరసింహ స్వామి కోనేరు నిర్మాణంలో రూ. 6 కోట్ల అవినీతి

లక్ష్మీ నరసింహ స్వామి కోనేరు నిర్మాణంలో రూ. 6 కోట్ల అవినీతి
కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయ కోనేరు నిర్మాణం, అభివృద్ధి పనుల్లో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయని కూటమి నేతలు ఆరోపించారు. కోనేరు మరమ్మతుల పేరుతో రెండు దశల్లో దాదాపు రూ. 6 కోట్ల మేర బిల్లులు దోచుకున్నారని  బీజేపీ సీనియర్ నేత ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి, జనసేన నేత బైరవ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నేతలు నాగేంద్ర ప్రసాద్, సోమ్లా నాయక్ ఆరోపించారు. 

ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం తక్షణమే విజిలెన్స్ విచారణకు ఆదేశించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రిని కలిసి అధికారిక ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. 
దేవాదాయ శాఖ అధికారులు బినామీ కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వారు విమర్శించారు. 
 
ఆరు నెలల్లో పూర్తి కావాల్సిన కోనేరు పనులు ఆరు సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికీ పూర్తికాలేదని విస్మయం వ్యక్తం చేశారు. ఆలయంలో అదనపు నిర్మాణాల పేరుతో నామినేషన్ విధానాన్ని దుర్వినియోగం చేస్తూ కోట్లాది రూపాయలను అక్రమంగా ఖర్చు చేశారని ఆరోపించారు. వరదల సమయంలో చేపట్టిన పనుల పేరుతో తప్పుడు బిల్లులు సృష్టించి నిధులను దుర్వినియోగం చేశారని వారు తెలిపారు. 
 
గత ఆరు సంవత్సరాలుగా అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై కోనేరు పనులను ఉద్దేశపూర్వకంగా పూర్తి చేయకుండా, భక్తుల కానుకల రూపంలో వచ్చిన కోట్లాది రూపాయలను దోచుకుంటున్నారని విమర్శించారు. అలాగే, ఆలయం చుట్టుపక్కల ఉన్న దేవుడి ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఈ నిర్లక్ష్యం కారణంగానే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మునిసిపాలిటీ కాలువ నీరు ప్రధాన ఆలయంలోకి చేరిందని , ఇలాంటి సంఘటనలు గతంలో మూడు సార్లు జరిగాయని చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.     దేవుడి నైవేద్యం, ప్రసాదాల పంపిణీ విషయంలో కూడా పలు ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా, ప్రత్యేక పూజల పేరుతో కొంతమంది అర్హతలు లేని సిబ్బంది ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారని, దర్శనానికి వచ్చే భక్తుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 
దేవాలయానికి చెందిన స్థలాన్ని కొందరు వ్యక్తులు గత 15 సంవత్సరాలుగా అక్రమంగా ఆక్రమించి పార్కింగ్ అవసరాలకు వినియోగిస్తున్నారని పేర్కొన్నారు.  ఆలయం చుట్టూ ఉన్న ఖాళీ స్థలాల వినియోగానికి సంబంధించి ఎటువంటి టెండర్లు నిర్వహించకపోవడం, సంబంధిత అధికారులు ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఆక్రమణలు కొనసాగుతున్నాయని విమర్శించారు. దీని ఫలితంగా ఆలయ పరిసరాల్లో మురుగు నీరు చేరి, భక్తులకు, స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.