* రాహుల్ కు వ్యతిరేకంగా ఢిల్లీలో పోస్టర్ల కలకలం
దాదాపు రెండేళ్ల తర్వాత ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో పలు పార్టీలు బిజెపికి వ్యతిరేకంగా నిలబడిన ప్రతిపక్ష కూటమిని కాంగ్రెస్ బలహీనపరుస్తుందని విమర్శించాయి. కాంగ్రెస్ సంకుచిత రాజకీయ ప్రయోజనాలపై వామపక్షాలు, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌జెడి వంటి పార్టీలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. ప్రతిపక్ష నాయకులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ఉపయోగించినప్పుడు ఇండియా బ్లాక్ ఐక్యంగా నిలబడాలని, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ సమస్యపై ఇండియా బ్లాక్ ఒకే వైఖరిని అవలంబించాలని ఆయా పార్టీల నేతలు డిమాండ్ చేశారు.
కేరళ ఎన్నికల సమయంలో వామపక్షాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ జాతీయ నాయకులు చేసిన నిరాధార ప్రచారాన్ని సిపిఎం రాజ్యసభ నాయకుడు జాన్ బ్రిట్టాస్ ఎత్తి చూపారు. వామపక్షాలకు, బిజెపికి మధ్య రహస్య అవగాహన ఉందని రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వంటి నాయకులు పచ్చి అబద్ధం ప్రచారం చేశారని మండిపడ్డారు.
‘బిజెపిని అధికారానికి దూరంగా ఉంచడానికి వామపక్షాలు కఠిన వైఖరి వల్లే మొదటి యుపిఎ ప్రభుత్వం ఏర్పడింది. రాహుల్ గాంధీ ఆ చరిత్రను కప్పిపుచ్చి, వామపక్షాలకు, బిజెపికి మధ్య ఒక ఒప్పందం జరిగిందని తప్పుడు ప్రచారం చేశారు. వామపక్షాల బిజెపి వ్యతిరేక వైఖరికి కాంగ్రెస్ సర్టిఫికెట్ అవసరం లేదు’ అని జాన్ బ్రిట్టాస్ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘వామపక్షం ఇకపై వామపక్షం కాదు’ అన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యను సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని విమర్శించారు. దీనికి కలత చెందిన రాహుల్ గాంధీ, తాను ఆ వ్యాఖ్యను వాస్తవాల ఆధారంగానే చేశానని బదులిచ్చారు. `మీ వద్ద ఉన్న వాస్తవాలు’ ఏమిటని వామపక్ష నాయకులు ప్రశ్నించారు.
అదానీని కేరళకు తీసుకొచ్చింది ఎల్‌డిఎఫ్ అని, ఇది ఒప్పందంలో భాగమని రాహుల్ ఆరోపించగా, `మీ అవగాహన తప్పు అని, అదానీని కేరళకు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే’నని వామపక్ష నాయకులు గుర్తుచేశారు. దీని తరువాత, డిఎంకె, ఆప్ దూరంగా ఉండటం పెద్ద ఎదురుదెబ్బ అని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. బిజెపికి వ్యతిరేకంగా ఇదే పద్ధతిలో కొనసాగాలా వద్దా అనే దానిపై తీవ్రంగా పరిశీలించాలని కూడా డిమాండ్ చేశారు.
బీహార్‌లో కాంగ్రెస్, బిజెపి నాయకుల మధ్య అనేక విషయాలపై రహస్య అవగాహనలు ఉన్నాయని తేజస్వి యాదవ్ ఆరోపించారు. ఈ విషయాన్ని తాను కాంగ్రెస్ జాతీయ నాయకత్వంతో చాలాసార్లు ప్రస్తావించానని, అయినప్పటికీ, దానిని సరిదిద్దడానికి వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు.
అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకై డిమాండ్
ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, మహిళలు, అణగారిన తరగతులపై అఘాయిత్యాలు వంటి అంశాలపై చర్చించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీట్, సిబిఎస్ఇ పరీక్షలకు హాజరైన లక్షలాది మంది యువతకు ద్రోహం చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఆయన రాజీనామా కోరుతూ చేస్తున్న నిరసనలను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఎన్నికల్లో అవకతవకలు, ఓట్ల దోపిడీ, పారదర్శకత లోపించాయని ఎత్తిచూపుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఎస్ఐఆర్‌పై లేఖ రాయాలని నిర్ణయించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు మరింత ఐక్యంగా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను బహిర్గతం చేయాలని నిర్ణయించారు.
ఇండియా బ్లాక్ సమావేశం ఇక నుంచి రెండు నెలలకోసారి జరపాలని, తదుపరి సమావేశం ఆగస్టు 5న హైదరాబాద్‌లో జరపాలని నిర్ణయించారు. కాగా, కాక్రోచ్ జనతా పార్టీతో కలిసి పనిచేద్దామని అఖిలేశ్, ఒమర్ అబ్దుల్లా ప్రతిపాదించగా, ప్రజాఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని మమత బెనర్జీ పేర్కొన్నట్టు సమాచారం.
బ్యానర్లు, పోస్టర్లు కలకలం
కాగా, ఇండియా బ్లాక్ సమావేశానికి ముందు ఢిల్లీలోని అనేకచోట్ల కాంగ్రెస్, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బ్యానర్లు, పోస్టర్లు వెలువడటం కలకలం సృష్టించాయి. రాహుల్‌గాంధీకి రాజకీయ నిలకడ లేదని, తాము కాంగ్రెస్ పార్టీపై ఆధారపడబోమని కూటమి నేతలే అంటున్నట్లు ఆ పోస్టర్లలో పేర్కొనడం గమనార్హం. శరద్ పవార్, ఎంకే స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ తదితర కీలక నేతల ఫొటోలతో ఈ వివాదాస్పద పోస్టర్లు వెలిశాయి.
వివిధ సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ గురించి వారు చేసిన వాఖ్యలతో ఈ పోస్టర్లు వెలవడం గమనార్హం. ఇండియా కూటమి ఐక్యతపై అనుమానాలు వస్తున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కీలక సమావేశానికి డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ దూరంగా ఉండటం గమనార్హం. ఈ సమావేశానికి 25 ప్రతిపక్ష పార్టీల నుండి 39 మంది నాయకులు హాజరయ్యారు.

More Stories
ఐపీఎల్లో వరుసగా రెండోసారి ఫైనల్లోకి ఆర్సీబీ
మాలేగావ్ పేలుళ్ల కేసులో నలుగురు నిందితులకు విముక్తి
చమురు ధర బ్యారెల్‌కు 150 డాలర్లకు చేరే అవకాశం