భారత్‌లో పెరుగుతున్న వృద్ధుల జనాభా

భారత్‌లో పెరుగుతున్న వృద్ధుల జనాభా

భారతదేశంలో వృద్ధుల సంఖ్య పెరుగుతూ పిల్లలు, యువత జనాభా తగ్గుతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్–2023-24) వెల్లడించింది. 60 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వృద్ధుల జనాభా వాటా 2019-21 కాలంలో 11.8 శాతం ఉండగా, ప్రస్తుత సర్వే కాలంలో 12.9 శాతానికి చేరుకుంది. మూడేళ్ల వ్యవధిలోనే 1.1 శాతం పెరిగింది. ఈ గణాంకాలు భారతదేశం క్రమంగా వృధాప్య సమాజంగా మారుతున్న సంకేతాలు ఇస్తున్నాయి.

ఇదే సమయంలో 15 సంవత్సరాల లోపు జనాభా 26.5 శాతం నుంచి 2.5 శాతంకు తగ్గింది. అలాగే 5 సంవత్సరాల లోపు పిల్లల జనాభా 8.2 శాతం నుంచి 8.0 శాతానికి పడిపోయింది. దేశం మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్‌ఆర్) 2.0 వద్ద కొనసాగుతోంది. ఈ పరిణామాలు జననాల రేటు తగ్గడం, ఆయుర్దాయం పెరగడం, ఆరోగ్య సేవల మెరుగుదల వల్ల వృద్ధుల సంఖ్య పెరుగుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయి.

ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాల్లో ఈ ధోరణి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు 2.0 కంటే తక్కువగా ఉండటంతో వృద్ధుల జనాభా వాటా దేశ సగటును మించి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో టీఎఫ్‌ఆర్ సుమారు 1.5 కాగా, తెలంగాణలో 1.7గా నమోదైంది. ఈ రాష్ట్రాల్లో యువ జనాభా తగ్గుతుండగా, వృద్ధుల శాతం క్రమంగా పెరుగుతుంది. 

మరోవైపు బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మేఘాలయ వంటి రాష్ట్రాల్లో టీఎఫ్‌ఆర్ 2.1 కంటే ఎక్కువగా ఉండటంతో యువ జనాభా అధికంగా కొనసాగుతోంది. అయినప్పటికీ, రాబోయే దశాబ్దాల్లో ఈ రాష్ట్రాల్లో కూడా వృద్ధుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దానితో వృద్ధుల సంఖ్య పెరుగుదల దేశ ఆర్థిక, సామాజిక రంగాలపై ప్రభావం చూపగలదని భావిస్తున్నారు. 

పెన్షన్ ఖర్చు, ఆరోగ్య సంరక్షణ అవసరాలు, దీర్ఘకాలిక సంరక్షణ సేవలు, వృద్ధులకు అనుకూలమైన మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. దేశ జనాభాలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు వృద్దులుగా ఉన్నారు.  ఈ నేపథ్యంలో వృద్ధుల సంక్షేమం, ఆరోగ్య భద్రత, సామాజిక రక్షణ పధకాల విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందని స్పష్టం అవుతుంది.