[మాన్యులు హెచ్. వి . శేషాద్రిజీ 1926 మే 26న బెంగళూరులో జన్మించినారు. ఈ సంవత్సరం మే 26 నాటికి వారు జన్మించి 100 సంవత్సరాలు పూర్తి కావడంతో ఈ సంవత్సరం వారిశత జయంతి. సంఘ శతాబ్ది జరుగుతున్న ఈ సమయంలో వారి శతజయంతి వచ్చింది. వారు హిందుత్వ జాగరణకు విశేష కృషి చేశారు. దశాబ్దాలుగా సంఘం చేస్తున్న అనేక రకాల పనులు ఉద్యమాలు, సేవకార్యక్రమలు దేశ సంరక్షణలో స్వయంసేవకుల బలిదానాలు, యోగదానంలను అక్షరబద్ధం చేసి `ఆర్ఎస్ఎస్ ఏ విజన్ ఇన్ యాక్షన్’ అనేపేరు పెట్టారు. అదే తెలుగులో `ఆకృతి దాల్చిన ఆదర్శం’ పేరుతో వచ్చింది. ఇట్లా సంఘ పనిలో వారి భాగస్వామ్యము వారిజీవనాన్ని ఈ సమయంలో ఒకసారి మననం చేసుకుందాము]
మైసూరు విశ్వవిద్యాలయం నుండి 1946లో శేషాద్రిజీ రసాయన శాస్త్రంలో ప్రథమ శ్రేణిలో బంగారు పతకాన్ని అందుకున్నారు. 1943లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో చేరారు. 1946లో సంఘ ప్రచారక్ గా వచ్చారు. 1946 నుండి 2005 వరకు తన పూర్ణజీవితాన్ని సమాజపరమేశ్వరునికి సమర్పణ చేశారు. ప్రారంభంలో కొద్దికాలం మంగుళూరు కేంద్రంగా పనిచేసి, ఆ తదుపరి సుమారు ఇరవై ఏళ్ల పాటు కర్నాటక ప్రాంతానికి ప్రాంత ప్రచారక్ గా పనిచేశారు. వారి నేతృత్వంలో కర్ణాటక ప్రాంతంలో సంఘపని అన్ని రంగాలలో విస్తరించి బలపడింది..1977-87 వరకు దక్షిణ క్షేత్ర క్షేత్ర ప్రచారక్ గ పనిచేసారు.
1987లో అఖిలభారత సర్ కార్యవాహగా ఎన్నికయ్యారు. సంఘ నియమావళి ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సర్ కార్యవాహ ఎన్నిక జరుగుతుంది. ఆ రకంగా నాలుగు సార్లు ఖిల భారత సర్ కార్యవాహగా ఎన్నికోబడ్డారు 1987 నుండి 2000 వరకు సర్ కార్యవాహ గ పనిచేసారు. 1987 నుంచి దేశంలో సామాన్య ప్రజలలో హిందుత్వ భావన జాగృతి కోసం అనేక కార్యక్రమాల రచన జరిగింది. అయోధ్య రామజన్మభూమి ఉద్యమ సమయంలో అనేక ఇతర సందర్భాలలో వారి నేతృత్వములో హిందూసమాజం విజయపథంలో ముందుకుసాగింది.
ఈ రోజున దేశవ్యాప్తంగా కనబడుతున్న హిందుత్వ జాగరణ కు రూపకర్త మాననీయ శేషాద్రిజీ. అట్లాగే ధర్మజాగరణ, సామాజిక సమరసత పనులు ప్రారంభించి గతివిధి పనులకు శ్రీకారం చుట్టారు. సంఘం, వివిధ క్షేత్రాలు మధ్య సమన్వయం, సేవాభారతి ప్రారంభం, అన్ని క్షేత్రాలు సేవా కార్యక్రాలునిర్వహించాలని మార్గదర్శనం చేశారు. శేషాద్రి గారి వాక్చాతుర్యం కూడా అద్భుతమైనది. ఆయన తన సందేశాన్ని శ్రోతలకు స్పష్టంగా తెలియజేయడానికి సరళమైన, ఆసక్తికరమైన ఉదాహరణలను ఉపయోగించేవారు.
1984లో, న్యూయార్క్ (అమెరికా)లో జరిగిన ప్రపంచ హిందూ సదస్సుకు, బ్రాడ్‌ఫోర్డ్ (యుకె)లో జరిగిన హిందూ సంగ మానికి వారు ప్రత్యేక ఆహ్వానితులు.ఆయన ప్రసంగాలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకునేవి
సంఘ సాహిత్య నిర్మాణానికి ఒక మిషన్
నేడుదేశంలోని అన్ని భాషల్లో సంఘ సాహిత్యం విరివిగా వెలువడుతోంది. ఈ పనిని ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించిన వారిలో హెచ్. వి. శేషాద్రి పేరు ముందు వరుసలో ఉంటుంది. పని ఒత్తిడితో, తీరిక లేకపోయినా, ఆయన ప్రతిరోజూ రాయడానికి కొంత సమయం కేటాయించేవారు. ఆయన దక్షిణ భారత వారపత్రిక ‘విక్రమ్’, మాసపత్రిక ‘ఉత్థాన్’, ఢిల్లీలోని వారపత్రికలు ‘పాంచజన్య ‘, ‘ఆర్గనైజర్’, లక్నోలోని మాసపత్రిక ‘రాష్ట్రధర్మ’లకు తరచుగా వ్యాసాలు రాసేవారు. పాఠకులు ఆయన వ్యాసాల కోసం ఆసక్తిగా ఎదురుచూసేవారు.
సంఘ్, ఇతర సాహిత్యాన్ని ప్రచురించడానికి యాదవరావుజీ సూచన మేరకు వారు బెంగళూరులో ‘రాష్ట్రోత్థాన్ పరిషత్’ను స్థాపించారు. ఆయన సేవా కార్యక్రమాలను విస్తరించడానికి, సంస్కృతాన్ని ప్రోత్సహించడానికి కూడా విశేషంగా కృషి చేశారు. శేషాద్రి గారు చిన్నవి, పెద్దవి కలిపి వందకు పైగా పుస్తకాలువ్రాసారు. ఆయన ముఖ్యమైన రచనలలో “కృతిరూప సంఘ దర్శన్,” “యుగవతార్,” దేశ్ బంత్ గయా,” “నాన్యః పంథా,” ” హిందూస్ అబ్రాడ్ డైలమా,” “టువర్డ్స్ ఉజలే….” వంటివి ఉన్నాయి. ఇవన్నీ అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి.
శేషాద్రీజీ గొప్ప ఆలోచనాపరులు. వారు రాసిన `తోర్బరేల్’ అనే పుస్తకానికి 1982లో కన్నడ సాహిత్య అకాడమీ సాహిత్య పురస్కార్ బహుమతి ప్రదానం చేసింది. పరమపూజనీయ శ్రీ గురూజీ 1940-73 వరకు అనేక సందర్భాలలో ఇచ్చిన ఉపన్యాసాలు సిద్ధాంత పరమైన విషయాలు ఆధారంగా ఆంగ్లంలో `బంచ్ ఆఫ్ థాట్స్’, (పాంచజన్య తెలుగులో) రచించారు. దేశ విభజనకు దారితీసిన పరిస్థితులను, అనేక గ్రంథాలు, ఆనాటి ప్రభుత్వ ఉత్తర్వులు, వివిధ నాయకుల మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు ఆధారంగా `ట్రాజిక్ స్టోరీ ఆఫ్ పార్టీషన్’ (తెలుగులో కాళరాత్రి) పుస్తకం రచించారు.
సంఘం ద్వారా, వివిధ క్షేత్రాల ద్వారా నిర్వహిస్తున్న విశేష కార్యక్రమాల సమాచారం “, క్రోడికరించి `ఆర్ఎస్ఎస్ ఎ విజన్ ఇన్ ఆక్షన్’ అనే పుస్తకం రాశారు. ఇదే కాకుండా వివిధ పత్రికలలో వ్యాసాలు రాశారు. సంఘ స్వయంసేవకులకు కొత్తవారికి కి కూడా సంఘం గురించి సవివరంగా అర్థం చేయించేందుకు సాహిత్యం తయారుచేశారు. వారి జీవితము నిరంతర ప్రేరణదాయకమైనది. కార్యకర్తల జీవితాలను తీర్చిదిద్దిన వారు. చిన్న చిన విషయాలలో జాగ్రత్తగా ఉండటంలో విశేషంగా కార్యకర్తలకు నేర్పించారు. వారి సమావేశంలో కూర్చుంటే అనేక కొత్త విషయాలు చాలా సరళంగా మనకు చెప్పేవారు.
శేషాద్రిజీ జీవితంలో చివరిఘట్టం
తీవ్రమైన శారీరక, మానసిక శ్రమ కారణంగా, ఆయన శరీరం అనేక అనారోగ్యాలకు గురైంది. నాల్గవ సర్ సంఘ చాలక్ అయిన రజ్జు భయ్యా అనారోగ్యం కారణంగా పదవీ విరమణ చేయాలనుకున్నప్పుడు, కార్యకర్తలందరూ ఈ బాధ్యతను శేషాద్రిజీ చేపట్టాలని కోరుకున్నారు. కానీ ఆయన నిరాకరించారు. తన ఆరోగ్యం బాగోలేదని చెప్పారు. ఈ పనిని ఒక యువ కార్యకర్తకు అప్పగించాలి కోరారు . చివరికి, ఈ బాధ్యతను అప్పటి సహ సర్ కార్యవాహగా ఉన్న శ్రీ సుదర్శన్ జీకి అప్పగించారు. శేషాద్రి జీ సహా సర్ కార్యవాహ, తర్వాత అఖిల భారత ప్రచారక్ ప్రముఖ్‌గా పనిచేశారు.
ఆయన చివరి రోజుల్లో బెంగళూరు కార్యాలయంలో ఉన్నారు. అక్కడ, సాయం శాఖలో జారిపడటంతో వారి కాలు విరిగింది. అంతకుముందే ఆయన తుంటి ఎముక ఒకసారి విరిగింది. ఈసారి, చికిత్స సమయంలో, ఇన్ఫెక్షన్ ఆయన శరీరం అంతటా వ్యాపించటంతో, క్రమంగా ఆయన అవయవాలన్నీ పనిచేయకుండా పోయాయి. ఆయన్ని కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచారు. తన శరీరంతో సంఘ్ పని ఇక సాధ్యం కాదని భావించినప్పుడు, తనకు అమర్చిన ప్రాణ రక్షణ పరికరాలన్నింటినీ తొలగించి కార్యాలయంకు తీసుకొని వెళ్ళమని కోరారు. ఆయన కోరికను గౌరవిస్తూ,హాస్పటల్ నుండి వారిని సంఘ్ కార్యాలయానికి తీసుకువచ్చారు.
నిరంతరం క్రియాశీలంగా ఉండాలనే శేషాద్రిజీ జీవన ప్రేరణ
1946 నుంచి అంతిమశ్వాస వరకు సంఘ కార్యమే శ్వాసగా జీవించిన వారు ఆగస్టు 14వ తేదీ రాత్రి 7.02 నిమిషాలకు బెంగుళూరులోని సంఘ కార్యాలయంలో తుదిశ్వాస విడిచారు. ఎంతో మంది నిష్టావంతులైన కార్యకర్తలను తయారు చేసిన శ్రీ శేషాద్రీజీ సమాజ సమస్యలకు స్పందించే గుణం కలవారు. అందుకే క్రొత్త క్రొత్త పనులకు శ్రీకారం చుట్టారు. సమాజంలోని రుగ్మతలను పోగొట్టి భారతమాత వైభవానికి పాటుపడాలని స్వయం సేవకులకు ఉద్భోదించేవారు.

More Stories
70 బిలియన్ డాలర్ల విదేశీ నిధులకై ఆశాభావం
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ ‘రాజకీయ ప్రేరేపితం’
ఇండియా కూటమిలో కాంగ్రెస్ పై సిపిఎం, జేఎంఎం అసంతృప్తి