ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని, కళాశాలల ఉద్యోగులను రక్షించాలని, తెలంగాణ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని బిజెపి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా, గత ప్రభుత్వానికి సంబంధించిన రెండు సంవత్సరాల బకాయిలు, ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన మూడు సంవత్సరాల బకాయిలు కలిపి సుమారు రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇప్పటికీ విద్యార్థులకు విడుదల కాలేదని  ఆయన విమర్శించారు.  

కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే బిజెపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కలిసి రాష్ట్రంలోని యూనివర్సిటీలు, కళాశాలలు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్, నాన్-ప్రొఫెషనల్ విద్యాసంస్థలను సందర్శిస్తామని ఆయన వెల్లడించారు. విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి ఉద్యమిస్తామని తెలిపారు.  రాబోయే 10-15 రోజుల్లో ప్రభుత్వం ఫీ రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమం ఉధృతమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. 

ఫీజు రీయింబర్స్‌మెంట్ నిలిచిపోవడంతో అనేక ఇంటర్మీడియట్, డిగ్రీ, ఉన్నత విద్యా కళాశాలలు సగానికి సగం మూతపడే పరిస్థితి వచ్చిందని,  డ్రాప్‌అవుట్లు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.  ఇంజినీరింగ్, మెడికల్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ వంటి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు కూడా ఫీజు బకాయిల కారణంగా తమ సర్టిఫికెట్లు తీసుకోలేకపోతున్నారని తెలిపారు.  విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తే కేవలం అతడికి మాత్రమే కాకుండా తల్లిదండ్రుల భారం తగ్గుతుందని బిజెపి ఎమ్యెల్యే వివరించారు. 

ఇంటర్మీడియట్ స్థాయిలో విద్యార్థికి ట్యూషన్ ఫీజు, మెయింటెనెన్స్ కింద ప్రభుత్వం పరిమిత మొత్తమే చెల్లిస్తుందని, డిగ్రీ, హయ్యర్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ కోర్సులకు కూడా ప్రభుత్వం నిర్దిష్ట మొత్తాలను చెల్లిస్తోందని చెప్పారు. అయితే ఈ మొత్తాలు కూడా విడుదల కాకపోవడంతో కళాశాలలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు కలిపి 1,500కు పైగా విద్యాసంస్థలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి ఉన్నాయని వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు.   ప్రస్తుతం సుమారు రూ.14-15 వేల కోట్ల మేర బకాయిలు ఉన్నాయని చెబుతూ ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్సీ, ఎస్టీ కేటగిరీల కింద వచ్చిన నిధులు, ప్రభుత్వం అక్కడక్కడా విడుదల చేసిన కొన్ని మొత్తాలు పోను, ప్రస్తుతం దాదాపు రూ.12 వేల కోట్ల మేర బకాయిలు ఉన్నాయని తెలిపారు.

 
ఈ రూ.12 వేల కోట్లలో సుమారు 60 శాతం కొద్దిమంది పెద్ద యూనివర్సిటీలు, విద్యాసంస్థలకు సంబంధించినది. మిగిలిన 40 శాతం ఇంటర్మీడియట్, డిగ్రీ, ప్రొఫెషనల్, నాన్-ప్రొఫెషనల్, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యాసంస్థలకు సంబంధించినది. కనీసం రూ.3,000 నుంచి రూ.4,000 కోట్లు విడుదల చేసినా గ్రామీణ ప్రాంతాల విద్యాసంస్థలకు ఉపశమనం లభిస్తుందని ఆయన చెప్పారు.

ఈరోజు ఫీజు రీయింబర్స్‌మెంట్ లేకపోవడంతో కొంతమంది విద్యార్థులు చదువులు మానివేస్తూ గ్రామాల్లో గంజాయి, పట్టణాల్లో డ్రగ్స్ వంటి చెడు అలవాట్ల బారిన పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని బీజేపీ ఎమ్యెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు తప్పుదోవ పడితే సమాజం, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

మీడియా సమావేశంలో బిజెపి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవి కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.