నార్వే చెస్‌ టైటిల్‌ విజేతగా ప్రజ్ఞానంద

నార్వే చెస్‌ టైటిల్‌ విజేతగా ప్రజ్ఞానంద

భార‌తీయ చెస్ గ్రాండ్‌మాస్ట‌ర్ ఆర్ ప్ర‌జ్ఞానంద చ‌రిత్ర సృష్టించాడు. ప్ర‌తిష్టాత్మ‌క నార్వే చెస్ టైటిల్‌ను కైవ‌సం చేసుకొని నార్వే చెస్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచాడు. త‌న ఆఖ‌రి రౌండ్‌లో జ‌ర్మ‌నీ ప్లేయ‌ర్ విన్సెంట్ కేయ్‌మెర్‌ను ఓడించిన 20 ఏళ్ల ప్ర‌జ్ఞానంద‌ అద్భుత‌మైన రీతిలో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.  15 పాయింట్ల‌తో చివ‌రి గేమ్‌ను ప్రారంభించిన ప్ర‌జ్ఞానంద‌ క్లాసిక‌ల్ గేమ్‌ను గెలిచి కీల‌క‌మైన మూడు పాయింట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు.

దీంతో అత‌నికి మొత్తం 18 పాయింట్లు వ‌చ్చేశాయి. ఇక చెస్ టోర్నీల్లో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే నార్వే టైటిల్ అత‌న వ‌శ‌మైంది. ఈ గెలుపుతో చెన్నై కుర్రాడు అద్భుతాన్ని సృష్టించాడు.  భార‌తీయ లెజెండ‌రీ చెస్ ప్లేయ‌ర్ విశ్వ‌నాథ‌న్ ఆనంద్‌, ప్ర‌స్తుత ప్ర‌ప‌చం చాంపియ‌న్ డీ గుకేశ్ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు నార్వే చెస్ టోర్నీ గెలుచుకోలేక‌పోయారు. ఈ టోర్నీని 2013 నుంచి నిర్వ‌హిస్తున్నారు. గ్రాండ్‌మాస్ట‌ర్ ప్ర‌జ్ఞానంద నార్వే చెస్ టోర్నీలో పాల్గొన‌డం ఇది రెండోసారి మాత్ర‌మే. 

ఫ‌స్ట్ హాఫ్‌లో కొంత నెమ్మ‌దిగా అత‌ను త‌న గేమ్‌ను ప్రారంభించాడు. ఎలైట్ సిక్స్ ప్లేయ‌ర్ కేట‌గిరీలో కొంత టైం తీసుకున్నాడు. ఇక ఆ త‌ర్వాత రెండో హాఫ్‌లో త‌న దూకుడు ప్ర‌ద‌ర్శించాడు. ఈ టోర్నీలో రెండు సార్లు వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ ప్లేయ‌ర్ మాగ్న‌స్ కార్ల్‌స‌న్‌పై విక్ట‌రీ సాధించాడు.  గ‌తంలో ఏడు సార్లు నార్వే చెస్ టైటిల్ గెలిచిన కార్ల్‌స‌న్ త‌న క్లాసిక‌ల్ గేమ్‌లో రెండు సార్లు ప్ర‌జ్ఞానంద చేతిలో ఓట‌మి పాల‌య్యారు. ఈ అద్భుత విజ‌యం ప్ర‌జ్ఞానంద‌కు పాయింట్ల రేసులో ముందుంచింది.

టోర్న‌మెంట్ చివ‌రి ద‌శ‌లో వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ గుకేశ్ కొంత త‌డ‌బ‌డ్డాడు. చివ‌రి రౌండ్ వ‌ర‌కు 15.5 పాయింట్ల‌తో టోర్నీలో అగ్ర‌స్థానంలో ఉన్న అమెరిక‌న్ గ్రాండ్‌మాస్ట‌ర్ వెస్లే సో త‌న చివ‌రి మ్యాచ్‌ను డ్రా చేసుకున్నాడు. అలిరెజా ఫిరౌజాతో జ‌రిగిన క్లాసిక‌ల్ గేమ్ డ్రా అయ్యింది. దీంతో అత‌ను రెండో స్థానానికి స్థిర‌ప‌డ్డాడు. ఈ టోర్నమెంట్‌లో ప్రజ్ఞానంద సాధించిన విజయం ఒక అద్భుతమనే చెప్పాలి. 

టోర్నీ మధ్యలో వరుసగా రెండు క్లాసికల్ గేమ్‌లలో ఓడిపోయిన ప్రజ్ఞానంద ఒక దశలో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పడిపోయాడు. లీడర్ కంటే 5.5 పాయింట్లు వెనుకబడ్డాడు. ఇక టైటిల్ రేసు నుండి తప్పుకున్నాడనుకున్న తరుణంలో.. అసాధారణమైన పోరాట పటిమను కనబరిచాడు. వరుసగా నాలుగు క్లాసికల్ గేమ్‌లలో వరుస విజయాలు సాధించి టోర్నీని మలుపు తిప్పాడు.