అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చే వారం చైనాలో తొలిసారిగా త్రైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అణ్వాయుధ నిల్వలు కలిగిన మూడు దేశాల అధినేతలు ఒకే వేదికపై భేటీ కానుండటం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. చైనాలోని షెన్‌జెన్‌లో జరిగే ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (ఏపీఈసీ) సదస్సు సందర్భంగా ఈ సమావేశం జరగనుందని శ్వేతసౌధం వెల్లడించింది.
చైనా పర్యటన ముగింపు సందర్భంగా అమెరికా, చైనా, రష్యా అధ్యక్షులు సమావేశమవుతారని శ్వేతసౌధం ప్రతినిధి ఒలివియా వేల్స్ మీడియాకు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్యను తగ్గించడంపై ట్రంప్ చర్చించనున్నట్లు చెప్పారు. అణ్వాయుధాల విస్తరణ అత్యంత ప్రమాదకరమని ట్రంప్ భావిస్తున్నారని పేర్కొన్నారు.
అయితే ఈ సమావేశంలో తక్షణమే కీలక ఒప్పందం కుదిరే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అమెరికా సంకేతాలిస్తోంది. ఇది సుదీర్ఘ చర్చలకు నాంది మాత్రమే కావచ్చని పేర్కొంది. అణ్వాయుధాల విషయంలో చైనా వైఖరి ఈ చర్చలకు సవాలుగా మారే అవకాశం ఉంది. అమెరికాతో నేరుగా అణ్వాయుధ నియంత్రణ చర్చలు జరిపేందుకు బీజింగ్ చాలాకాలంగా విముఖత చూపుతోంది.
అణ్వాయుధ నిల్వలు అమెరికా, రష్యాల వద్దే ఎక్కువగా ఉన్నందున వాటి మధ్యే ప్రధానంగా చర్చలు జరగాలని చైనా వాదిస్తోంది. చైనాతో ఈ అంశంపై చర్చించడం కష్టమైనప్పటికీ, అణ్వాయుధ నియంత్రణపై బాధ్యతాయుతమైన చర్చల్లో బీజింగ్ భాగస్వామి కావాల్సిన సమయం వచ్చిందని అమెరికా ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. తక్షణ ఒప్పందం కంటే భవిష్యత్తులో మరింత విస్తృత చర్చలకు ఈ సమావేశం మార్గం సుగమం చేస్తుందని వాషింగ్టన్ ఆశిస్తోంది.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కూడా ముగ్గురు నేతల చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని అమెరికా అధికారి తెలిపారు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా కొనసాగిస్తున్న యుద్ధం అంశం చర్చకు వచ్చే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ విషయంలో రష్యాతో అమెరికా జరుపుతున్న చర్చల్లో చైనా భాగస్వామి కానందున, ఈ త్రైపాక్షిక వేదికపై ఆ అంశాన్ని ప్రస్తావించడం సముచితం కాదని వాషింగ్టన్ భావిస్తోంది.
ఈ పర్యటనలో ట్రంప్, పుతిన్ ప్రత్యేకంగా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించే అవకాశం కూడా లేదని తెలుస్తోంది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ ఉపగ్రహ సమాచార సేవలను ఉక్రెయిన్ వినియోగించుకునే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ట్రంప్‌తో పాటు చైనా పర్యటనకు వెళ్తున్న మస్క్ ముగ్గురు అధ్యక్షుల సమావేశానికి మాత్రం హాజరుకారు.
అమెరికా, రష్యా మధ్య కుదిరిన న్యూ స్టార్ట్ అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం ఈ ఏడాది ప్రారంభంలో ముగియడంతో ప్రపంచ అణ్వాయుధ భద్రతపై ఆందోళనలు పెరిగాయి. స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా నిల్వ చేసిన అణ్వాయుధాలు రష్యా వద్ద ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా, చైనా ఉన్నాయి.

More Stories
అమెరికాలో ఉన్నట్టుండి నిలిచిపోయిన విమాన సర్వీసులు
ఎస్ఐఆర్ లో తొలగించిన 1.27 కోట్ల మందిని ఓటర్లుగా చేర్పించండి
మూడు నెలల్లో పాక్ భారత్ నుంచి రూ. 578 కోట్ల వస్తువుల కొనుగోలు