టిఎంసిలో తిరుగుబా టుకు అభిషేక్ బెనర్జీ అహంకారమే కారణమా?

టిఎంసిలో తిరుగుబా టుకు అభిషేక్ బెనర్జీ అహంకారమే కారణమా?
 
* టిఎంసి చీలిక పరిణామాలను నిశితంగా గమనిస్తున్న బిజెపి 
పశ్చిమ బెంగాల్‌లో అధికారం నుంచి ఓడిపోయిన నెల రోజులకే, ఎన్నికల్లో 41% ఓట్లు గెలుచుకున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ వేగంగా చీలికను ఎదుర్కోవడానికి పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ వారసుడిగా భావిస్తున్న ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ `అహంకారమే’ కారణంగా కనిపిస్తోంది. ఆయన ఒంటెత్తు పోకడల పట్ల పార్టీలో నెలకొన్న తీవ్రమైన అసంతృప్తి ఎన్నికల ఫలితాలకు ముందు నుండే బయటపడుతూ వస్తుంది. 
 
పార్టీ ఓటమి ఖాయమని స్పష్టమైన వెంటనే, మే 4వ తేదీ నుంచే పార్టీలో కొందరు నాయకులు నాయకత్వాన్ని విమర్శించడం ప్రారంభించారు. రెండు రోజుల తర్వాత పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నివాసంలో జరిగిన ఒక సమావేశంలో అసమ్మతికి వెలువడిన తొలి సంకేతాన్ని మమతా గమనించక పోవడంతోనే ఇప్పుడు ఆమెకు నిస్సహాయ పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఆ సమావేశంలో `మనం ఓడిపోలేదు.. మనమే గెలిచాము..’ అంటూ   మమతా బెనర్జీ తన మేనల్లుడుకు నిలబడి చప్పట్లు కొట్టమని హాజరైన ఎమ్మెల్యేలందరినీ కోరడంతో చాలామంది తట్టుకోలేకపోయారు. “మమతా బెనర్జీ ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఆమె మమ్మల్ని నిలబడమని అడిగినప్పుడు, చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు అలా చేయలేదు, కానీ వారు ఏమీ అనలేదు కూడా,” అని ఒక ఎమ్మెల్యే తెలిపారు. 
 
ఎన్నిక వాయిదా పడిన ఫల్తా నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి  జహంగీర్ ఖాన్‌ పార్టీతో కనీసం సంప్రదించకుండానే తాను పోటీ నుండి నిష్క్రమిస్తున్నట్లు పోలింగ్ కు రెండు రోజుల ముందు ప్రకటించినా అతనిపై ఎటువంటి చర్య తీసుకోకూడదని తీసుకున్న నిర్ణయం పార్టీ వర్గాలలో విస్మయాన్ని రగిలించింది. అభిషేక్‌కు సన్నిహితుడు కావడంతోనే అతనిపై చర్య తీసుకోవడం లేదంటూ రగిలిపోయారు. 
 
“అంతేకాదు, నాయకత్వం, ముఖ్యంగా అభిషేక్ బెనర్జీ చాలా అహంకారంతో ప్రవర్తించారు. అంతటి ఘోర పరాజయం తర్వాత కూడా, జహంగీర్ ఖాన్ విషయంలో పార్టీ ఏం చేస్తోందని అడిగినప్పుడు, ఆయన కేవలం ‘పార్టీ ట్వీట్ చూడండి’ అని మాత్రమే అన్నారు. మమతా బెనర్జీ కూడా తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనని ప్రకటించారు. ఆ తర్వాతే తిరుగుబాటుకు బీజాలు పడ్డాయి,” అని ఒక సీనియర్ టీఎంసీ ఎమ్మెల్యే వెల్లడించారు.
 
అప్పుడే తిరుగుబాటు ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకుని, తిరుగుబాటుకు పునాదులు వేయడం ప్రారంభించారని టీఎంసీ వర్గాలు తెలిపాయి. ఈ కుట్రకు కేంద్ర బిందువు స్పీకర్ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించిన ఉలుబేరియా పూర్బా ఎమ్మెల్యే, మాజీ రాజ్యసభ ఎంపీ రీతాబ్రత బెనర్జీ. గత వారం రిటబ్రత ఢిల్లీ పర్యటనకు వెళ్లి, అక్కడ ముఖ్యమంత్రి సువెందు అధికారితో సమావేశమైన తర్వాత ఈ ప్రణాళికకు రచన జరిగిందని తెలుస్తోంది. 
 
రితబ్రత ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన తర్వాత, ఈ ప్రణాళిక వేగం పుంజుకుంది. రితబ్రత ఎమ్మెల్యేల హాస్టల్‌లోనూ, కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ హోటల్‌లోనూ వరుసగా సమావేశాలు నిర్వహించారు. నాయకత్వం చాలా వరకు మౌనంగా ఉంటూ, చురుకుగా వ్యవహరించక పోవడంతో, ఆ నాయకత్వానికి వ్యతిరేకంగా ఏకం కావాలంటూ ఎమ్మెల్యేలందరికీ ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి. 
 
“అసెంబ్లీతో అభిషేక్ బెనర్జీకి ఎలాంటి సంబంధం లేదు. ప్రజలకు కూడా ఆయనతో ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ సంబంధం ఉండి ఉంటే, ఆయన 26 రోజుల పాటు అజ్ఞాతంలో ఉండేవారు కాదు. బయటకు వచ్చేవారు. దొంగను కొట్టినట్లు ఆయనను కొట్టారు. దెబ్బలు తిన్న తర్వాత, ప్రజలు తన వైపు ఉన్నారని, కాబట్టి ప్రజలే తన భద్రతను చూసుకుంటారని అన్న అభిషేక్, తన భద్రతను పెంచాలని కోరుతూ ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం గమనార్హం” అంటూ ప్రతిపక్ష నేత  రీతాబ్రత బెనర్జీ పేర్కొనడం గమనార్హం. 
 
“అయితే, మా ప్రధాన లక్ష్యం అభిషేక్ బెనర్జీనే. మేము మమతా బెనర్జీకి వ్యతిరేకం కాదు. కానీ అభిషేక్ నాయకత్వాన్ని మాత్రం ఇకపై అంగీకరించలేము,” అని ఒక తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు.  సంతకాల ఫోర్జరీ వివాదం తలెత్తినప్పుడు పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. జూన్ 1న, శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయను ప్రతిపక్ష నాయకుడిగా. నయన బందోపాధ్యాయ, అషిమా పాత్రలను ఉప ప్రతిపక్ష నాయకులుగా, ఫిర్హాద్ హకీమ్‌ను చీఫ్ విప్‌గా నియమిస్తూ టిఎంసి నాయకత్వం స్పీకర్ కార్యాలయానికి ఒక లేఖను సమర్పించింది. 
 
ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి సువెందు అధికారి అగ్గికి ఆజ్యం పోసినట్లు, చేశారు. రితబ్రత, ఎంటాలీకి చెందిన మరో టిఎంసి ఎమ్మెల్యే సందీపన్ సాహా తమ సంతకాలు ఫోర్జరీ జరిగిందని ఫిర్యాదు చేశారని, అలాగే ఈ విషయాన్ని విచారిస్తున్న సిఐడి ముందు ఎమ్మెల్యేలు అరూప్ రాయ్, బహరుల్ ఇస్లాం కూడా తాము ఆ లేఖపై సంతకం చేయలేదని అంగీకరించారని ఆయన వెల్లడించడంతో కలకలం చెలరేగింది. 
 
తాము అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకం తప్ప, మమతా బెనర్జీ నాయకత్వంతో తమకు ఎటువంటి సమస్య లేదని తిరుగుబాటు నేతలు అందరూ దాదాపుగా స్పష్టం చేస్తున్నారు. అయితే, తాము పార్టీకి వ్యతిరేకం కాదని అర్థం చేసుకోవడానికి మమతా బెనర్జీ సిద్ధంగా లేకపోవడంతో ఈ సమస్య ఏర్పడిందని చెబుతున్నారు. 
 
పైగా, తాము బిజెపితో చేతులు కలపలేమని, బిజెపికి  వ్యతిరేకంగా సాగే పోరాటంలో తమకు మమతా బెనర్జీ అవసరం ఎంతైనా ఉందని ముఖ్యంగా మైనారిటీ వర్గానికి చెందిన ఎమ్యెల్యేలు స్పష్టం చేస్తున్నారు. పైగా, పార్టీ ఎన్నికల వ్యూహాల అమలుకు అభిషేక్ తీసుకు వచ్చిన ఐ-ప్యాక్ సిబ్బంది తమపై పెత్తనం చేస్తుండటం పట్ల కూడా వారిలో అసహనం వ్యక్తం అవుతుంది. 
 
పార్టీ కార్యకలాపాల్లో అభిషేక్ గానీ, మరే ఇతర సంస్థ (ఐ-ప్యాక్) గానీ జోక్యం చేసుకోవడాన్ని తాము సహింపలేక పోతున్నామని తేల్చి చెబుతున్నారు. అయితే శాసన సభ్యుల తిరుగుబాటుతో టిఎంసిలో వ్యవహారాలు పరిమితం కాబోవని,  టిఎంసి పార్లమెంటరీ పార్టీలో వారం రోజుల్లోపే చీలిక ఏర్పడవచ్చని ఆ పార్టీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
 
మూడింట రెండు వంతుల మెజారిటీతో సంపూర్ణ ఆధిపత్యం చెలాయిస్తున్న బిజెపి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో, 80 మంది సభ్యులున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చోటుచేసుకుంటున్న చీలిక సంకేతాలను  నిశితంగా గమనిస్తున్న. ఆ పార్టీకి టిఎంసి ఎమ్యెల్యేల మద్దతు అవసరం లేదు. అయితే, కీలకమైన రాజ్యాంగ సవరణలను సజావుగా ఆమోదింపజేసుకోవడానికి అవసరమైన సంఖ్యాబలం పార్లమెంటులోని ఎన్డీఏకు లేకపోవడమే ఇందుకు కారణమని బీజేపీ నాయకులు చెబుతున్నారు.
 
 “పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి మద్దతు అవసరం లేదు. ఎంపీలను గెలుచుకోవడమే మా ప్రాధాన్యత. టీఎంసీ చీలిపోయిన తర్వాత, దాని ఎంపీలు ఒక ప్రత్యేక కూటమిగా ఏర్పడవచ్చు. మా ప్రతిష్టాత్మక చట్టాలకు అవసరమైన సంఖ్యాబలం కోసం వారి మద్దతును బీజేపీ ఉపయోగించుకోవచ్చు,” అని ఈ పరిణామాలపై అవగాహన ఉన్న ఒక సీనియర్ బీజేపీ నాయకుడు పేర్కొన్నారు.
 
బెంగాల్‌లోని పరిణామాలను, 2022లో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బిజెపికి దోహదపడిన శివసేన, ఎన్సీపీ చీలికలతోనూ; అలాగే, రాఘవ్ చద్దా నేతృత్వంలో ఆప్ కు చెందిన 10 మంది రాజ్యసభ సభ్యులలో ఏడుగురు బీజేపీలో చేరడం ద్వారా, 245 మంది సభ్యులు కలిగిన ఎగువ సభలో ఎన్డీయే బలాన్ని 141కి చేర్చిన ఆప్ లోని ఇటీవలి చీలికతోనూ రాజకీయ పరిశీలకులు పోల్చి చూస్తున్నారు.