* కోల్‌కతా మేయర్ పదవికి ఫిర్హాద్ హకిం రాజీనామా
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో భారీ షాక్ తగిలింది. టీఎంసీ బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్ ఆదేశాలు వెలువరించారు. ప్రతిపక్షానికి కేటాయించిన ఛాంబర్ తాళాలను కూడా రితబ్రతకు సిబ్బంది అప్పగించారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక వెనక్కి తిరిగి రాని దశకు చేరుకున్నట్లు స్పష్టమవుతోంది.
తన సన్నిహితుడు శోభన్‌దేబ్ ఛటోపాధ్యాయ్ను అసెంబ్లీలో టీఎంసీ నేతగా మమతా బెనర్జీ ఎంపిక చేయడంతో తిరుగుబాటు మొదలైన సంగతి తెలిసిందే.
మొత్తం 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేల్లో 59 మంది ఆయన ఎంపికను వ్యతిరేకించారు. అనంతరం రితబ్రత సారథ్యంలో రెబల్ వర్గం స్పీకర్‌ను కలిసి తమదే అసలైన టీఎంసీ అని, రితబ్రతను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని లేఖను సమర్పించారు.
ఈ నేపథ్యంలో తాజాగా రితబ్రతను ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే, మమతా బెనర్జీయే తమ నేతని, పార్టీ చీల్చే ఉద్దేశం తనకు లేదని రితబ్రత బెనర్జీ స్పష్టం చేశారు. ‘‘ఈ కూటమికి ముఖ్య సలహాదారుగా ఉండాలని మేము మమతా బెనర్జీని అభ్యర్థిస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు. శాసనసభ పక్ష హోదా కోసం తిరుగుబాటు వర్గం చేసిన అభ్యర్థనను స్పీకర్ అంగీకరించారని రిటబ్రత చెప్పారు.
“పార్లమెంటరీ నిబంధనల ప్రకారం, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో అసలైన, ప్రధాన ప్రతిపక్షం మేమే. టీఎంసీ శాసనసభ పక్షానికి ముఖ్య సలహాదారు పాత్ర పోషించాలని మేము మమతా బెనర్జీని కోరుతున్నాము,” అని రిటబ్రత తెలిపారు. హేతుబద్ధమైన విమర్శలో భాగంగా ప్రతిపక్షం బీజేపీ విధానాలను ప్రతిఘటిస్తుందని, కానీ కేవలం దాడి చేయడం కోసమే దాడి చేయదని ఆయన పేర్కొన్నారు.
శోభన్‌దేబ్ ఛటోపాధ్యాయ్ను ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటూ అసెంబ్లీ స్పీకర్‌కు మమతా మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ రాసిన లేఖను స్పీకర్ తిరస్కరించగా, తమ సంతకాలను ఫోర్జరీ చేశారని ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీ, సాందీపన్ ఆరోపించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత నుంచి తప్పించుకోవాలంటే చీలిక వర్గానికి మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అంటే టీఎంసీ రెబల్ వర్గంలో 53 మంది ఉండాలి. ప్రస్తుతం రెబల్ వర్గానికి 59 మంది మద్దతు ఉండటంతో టీఎంసీ పేరు, గుర్తును వారు సొంతం చేసుకునే అవకాశం ఉంది.
కాగా, మహారాష్ట్రలో శివసేను చీల్చిన ఏక్నాథ్ షిండే మాదిరిగా టీఎంసీలో చీలికకు కారణమైన రితబ్రతా బెనర్జీ ఒకప్పుడు వామపక్షాల కీలక నేత. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ)లో విద్యార్థి కార్యకర్త స్థాయి నుంచి సీపీఎంలో రాజ్యసభ సభ్యుడిగా ఎదిగారు. వామపక్ష పార్టీకి అత్యంత ఆదరణపాత్రుడిగా పరిగణించిన ఆయనను పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా 2017లో సీపీఎం నుంచి బహిష్కరించారు.
అయితే ఆ వెంటనే 2018లో టీఎంసీలో రితబ్రతా బెనర్జీ చేరి మమతా బెనర్జీ నేతృత్వంలోని ఆ పార్టీలో కీలక నేతగా ఆయన ఎదిగారు. మొదట టీఎంసీ కార్మిక సంఘ విభాగానికి నాయకత్వం వహించారు. ఆ తర్వాత రాజ్యసభ స్థానానికి నామినేట్ అయ్యారు. 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనాన్ని రితబ్రతా బెనర్జీ తట్టుకుని ఉలుబేరియా పూర్వ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
మరోవంక, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు ఫిర్హాద్ హకీమ్ కోల్‌కతా మేయర్ పదవికి రాజీనామా చేశారు. అయితే, మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆమోదంతోనే ఫిర్హాద్ తన పదవికి రాజీనామా చేయడం విశేషం. ఫిర్హాద్ తన పదవికి రాజీనామా చేస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.
More Stories
టిఎంసిలో తిరుగుబా టుకు అభిషేక్ బెనర్జీ అహంకారమే కారణమా?
భారత రక్షణ సామర్ధ్యాల ఆధునీకరణలో డిఆర్డిఓ
కోల్‌కతా కాలేజీ గదుల్లో రూ 1 కోటి నగదు, గన్, బెడ్స్, కండోమ్స్