ఎసిబి సోదాల్లో అదనపు ఎస్పీ భుజంగరావు అరెస్ట్‌

ఎసిబి సోదాల్లో అదనపు ఎస్పీ భుజంగరావు అరెస్ట్‌

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా  సస్పెన్షన్‌లో ఉన్న అదనపు ఎస్పీ నాయిని భుజంగరావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్ట్ చేసింది. అక్రమాస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు 15 ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో రూ 100 ఓట్లను పైగా అక్రమాస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ సోదాల్లో సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఉన్న 27.29 ఎకరాల వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఐదు ఓపెన్ ప్లాట్లు, రెండు నివాస గృహాలు, ఒక వాణిజ్య భవనాన్ని గుర్తించారు.  అలాగే, భుజంగరావు నివాసంలో రూ.3.83 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.8 లక్షలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదనంగా సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.

సోదాల్లో భాగంగా మారుతి స్విఫ్ట్, కియా సెల్టోస్ కార్లను కూడా గుర్తించినట్లు ఏసీబీ తెలిపింది. ప్రాథమిక లెక్కల ప్రకారం  ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల మొత్తం డాక్యుమెంట్ విలువ సుమారు రూ.5.92 కోట్లుగా గుర్తించినప్పటికీ, మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల మొత్తం విలువ రూ.100 కోట్లకు పైగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు తేలడంతో భుజంగరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. ఇక సోదాల సమయంలో 29 మద్యం బాటిళ్లు కూడా లభ్యమైనట్లు వెల్లడించిన ఏసీబీ, దీనిపై తదుపరి చర్యల కోసం ఎక్సైజ్ శాఖకు సమాచారం అందించినట్లు తెలిపింది. భుజంగరావుకు చెందిన మరిన్ని ఆస్తులు, పెట్టుబడులపై విచారణ కొనసాగుతోందని ఏసీబీ వెల్లడించింది.