ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీలో 58 మంది ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటు చేశారు. వారంతా కలిసి ఏకంగా అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ సమర్పించారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన రితబ్రతా బెనర్జీని తమ పార్టీ తరఫున అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించాలని అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్‌కు విజ్ఞప్తి చేశారు.
ప్రతిపక్ష నాయకుడి పదవికి సీనియర్ నాయకుడు శోవన్‌దేవ్ చటోపాధ్యాయకు గతంలో మద్దతు తెలిపిన పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి ఇది ఒక బహిరంగ సవాలు.పార్టీ లెటర్‌ప్యాడ్‌పై కాకుండా, ఒక సాధారణ తెల్ల కాగితంపై తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఒక లేఖను సమర్పించారు. ఆ లేఖలో మమతా బెనర్జీని పార్టీ నాయకురాలిగా, రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నాయకుడిగా, అలాగే షెయులి సాహా, జావేద్ ఖాన్, సందీపన్ సాహా, సబీనా యాస్మిన్‌లను సభలో ఉపనాయకులుగా వారు పేర్కొన్నారు.
బుధవారం వీరంతా ప్రత్యేక బస్సుల్లో బెంగాల్ అసెంబ్లీకి చేరుకున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు రితబ్రతా బెనర్జీ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం టీఎంసీలో 60 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరిలో 58 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేతగా రితబ్రత పేరు సూచిస్తూ మద్దతు నిలిచారు.
ఆయన చెప్పినట్లు పార్టీపై 60 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే మమత పార్టీలో 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారు. సభలో ప్రతిపక్ష నాయకుడిగా శోవన్‌దేవ్ ఛటర్జీని అంగీకరించడానికి తిరుగుబాటు ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరని వారు స్పష్టం చేశారు. అయితే, ఈ అంశంపై ఇప్పటివరకు మమతా బెనర్జీకానీ, టీఎంసీ అగ్రనాయకత్వం కానీ స్పందించలేదు.
మరోవైపు టీఎంసీ అగ్రనేత అభిషేక్ కల్యాణ్ బెనర్జీ తాజాగా ఎక్స్‌లో స్పందిస్తూ తన పార్టీ తరఫున అసెంబ్లీలో హోదాలకు సంబంధించి కీలక ప్రతిపాదనల్ని స్పీకర్‌కు పంపించారు. ఆయన ప్రకారం శోభన్‌దేవ్ ఛట్టోపాధ్యాయను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని కోరారు. రితబ్రతనే ప్రతిపక్ష నేతగా గుర్తిస్తే మమత ఆధ్వర్యంలోని టీంఎసీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. ఇటీవలే రితబ్రతతోపాటు సందీపన్ సాహాను కూడా టీఎంసీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. పార్టీ అగ్రనాయకత్వం తమ సంతకాలను ఫోర్జరీ చేసిందని వీరు ఫిర్యాదు చేయడంతో టీఎంసీ వీరిని సస్పెండ్ చేసింది.
పార్టీలోని గందరగోళం మధ్య, మమతా బెనర్జీ వ్యాఖ్యలు పార్టీ చీలిపోయే అవకాశం ఉందనే ఊహాగానాలను మరింత తీవ్రతరం చేశాయి. “గతంలో సీపీఎంతో ఉన్న వ్యక్తి (రీతాబ్రత బెనర్జీ) ఇదంతా చేస్తున్నారు. ఇతరులకు టికెట్లు దక్కకుండా చేసి మేమే ఆయనకు టికెట్ ఇచ్చాం. దీనివల్ల నష్టపోయిన వారికి నా క్షమాపణలు. మా 2,500 పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేశారు, 10,000 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. ఎమ్మెల్యేలను ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు బెదిరిస్తున్నారు. మేమే బహిష్కరించిన వ్యక్తికి (రీతాబ్రత బెనర్జీ) మద్దతు ఇవ్వాలని, మా పార్టీని విచ్ఛిన్నం చేయాలని పోలీసులు ఎమ్మెల్యేలను కోరుతున్నారు.”
తృణమూల్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ మాట్లాడుతూ, “వారు ఎమ్మెల్యేల హాస్టల్‌లో, ఒక ప్రైవేట్ హోటల్‌లో సమావేశమయ్యారని మేము విన్నాము. వారు మహారాష్ట్ర నమూనాను అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారు,” అని ఆరోపించారు. ఇదిలా ఉండగా, ఇది తృణమూల్ కాంగ్రెస్‌లోని అంతర్గత సంక్షోభమని బీజేపీ పేర్కొంది.మంత్రి తపస్ రాయ్ మాట్లాడుతూ, తృణమూల్ “విచ్ఛిన్నమవుతుంది, అది జరగాల్సినట్లే” అని స్పష్టం చేశారు.
కాగా, తృణమూల్ కాంగ్రెస్ నుంచి నాయకులను తమ పార్టీలోకి తీసుకోబోమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య తేల్చి చెప్పారు.“బీజేపీలో తృణమూల్ ప్రభావం ఎన్నటికీ జరగదు. టీఎంసీకి మా తలుపులు మూసేశాం. ఎవరినీ బయటి నుండి తీసుకురాకుండానే మేం 207 స్థానాలకు చేరుకున్నాం. టీఎంసీ నాయకులకు వ్యతిరేకంగా ప్రజలే ఓటు వేశారు. ఈసారి మా రాజకీయ వ్యూహం అట్టడుగు నుంచే మొదలైంది. మచ్చపడిన వారిని మా పార్టీలో ఎలా చేర్చుకోగలం? బీజేపీలో తృణమూల్ ప్రభావం ఎన్నటికీ జరగదు,” అని ఆయన చెప్పారు.
More Stories
ఖేష్మ్ ద్వీపంపై అమెరికా, కువైట్ లో ఇరాన్ దాడులు
మమతాకు ముఖం చాటేసిన టిఎంసి ఎంపీలు, ఎమ్యెల్యేలు
అమరవీరుల కలలు కన్న తెలంగాణ నిర్మాణంలో వెనుకబడ్డాం