పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రస్థాయికి చేరాయి. లెబనాన్ లో ఇజ్రాయెల్ సైనిక చర్యలకు ప్రతిగా కీలకమైన బాబ్ అల్-మందెబ్ జలసంధిని అడ్డుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. హర్మూజ్ జలసంధిపై ఇప్పటికే ఉన్న ఆంక్షలతో సతమతమవుతున్న ప్రపంచ నౌకా వాణిజ్యానికి ఈ తాజా పరిణామం కొత్త ఆందోళనలు రేకెత్తిస్తోంది.
అమెరికాతో పరోక్షంగా జరుపుతున్న చర్చలను నిలిపివేస్తున్నట్లు, బాబ్ అల్-మందెబ్ సహా పలు మార్గాల్లో ప్రతిఘటనను పూర్తిస్థాయిలో క్రియాశీలం చేయడంపై ఆలోచిస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా పేర్కొన్నది. దక్షిణ లెబనాన్‌లో పౌరులు, పారామెడిక్స్ మృతికి కారణమైన ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎర్ర సముద్రానికి దక్షిణ ప్రవేశ ద్వారంగా, యెమెన్, హార్న్ ఆఫ్ ఆఫ్రికా మధ్య బాబ్ అల్-మందెబ్ జలసంధి ఉంది. దీనిని ‘గేట్ ఆఫ్ టియర్స్’ అని కూడా పిలుస్తారు. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో దాదాపు 12-15 శాతం ఈ మార్గం గుండానే సాగుతుంది. ముఖ్యంగా సూయజ్ కాలువకు వెళ్లే నౌకలకు ఇది అత్యంత కీలకం. ఈ జలసంధిపై ఇరాన్‌కు ప్రత్యక్ష నియంత్రణ లేనప్పటికీ, యెమెన్‌లోని హౌతీల ద్వారా గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉంది.
లెబనాన్, గాజాలలో ఇజ్రాయెల్ చర్యలు కొనసాగితే, తమ ‘యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’ హర్మూజ్ తరహాలోనే బాబ్ అల్-మందెబ్‌లో కూడా నౌకా రవాణాను అడ్డుకుంటామని ఐఆర్జీసీ ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఇస్మాయిల్ ఖానీ స్పష్టంచేశారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 4 శాతానికిపైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 93 డాలర్లను దాటింది.
మరోవైపు ఇజ్రాయిల్ దాడులు ఆపేంత వరకూ చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో ట్రంప్ ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్ లో చర్చలు జరిపిన అనంతరం ‘నేను ఈ రోజు నెతన్యాహూతో మాట్లాడాను. బీరుట్‌పై దాడి చేయొద్దని కోరాను. ఆయన తన దళాలను వెనక్కి రప్పిస్తున్నారు. ధన్యవాదాలు’ అని ప్రకటించారు. హిజ్బొల్లా నాయకుల ప్రతినిధులతో కూడా మాట్లాడానని, ఇజ్రాయిల్ పైన, దాని సేనల పైన కాల్పులు ఆపడానికి వారు అంగీకరించారని తెలిపారు.
ఇజ్రాయిల్ కూడా కాల్పులు ఆపడానికి అంగీకరించిందని అంటూ ఇది ఎంతకాలం కొనసాగుతుందో చూద్దామని పేర్కొన్నారు. ట్రంప్‌తో సంభాషణను నెతన్యాహూ ధృవీకరిస్తూఈ సంభాషణ తనకు ఓ హెచ్చరిక వంటిదని చెప్పారు. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయిల్ సైన్యం ఓ ప్రణాళిక ప్రకారం పనిచేస్తుందని పేర్కొంటూ ఇజ్రాయిల్‌పై హిజ్బొల్లా దాడులు ఆపకపోతే తాము బీరుట్‌పై దాడి చేసే అవకాశం లేకపోలేదని స్పష్టం చేశారు. తాజా పరిణామాలపై హిజ్బొల్లా ఇంకా స్పందించలేదు.

More Stories
పాకిస్తాన్ లో మేలో 27 శాతం పెరిగిన ఉగ్రవాద దాడులు
అమెరికాతో చర్చలేవ్.. ఇక హర్మూజ్ దిగ్బంధం
భారత భూభాగాలు ఆక్రమించిన నేపాల్… ప్రధాని వ్యాఖ్యలపై దుమారం