గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన అవినీతి, అక్రమాల బాటలోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పయనిస్తూ తెలంగాణ ప్రజానీకాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతోందని బిజెపి సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఈ రెండు పార్టీలు కలిసి అప్పుల రాష్ట్రంగా మార్చేశాయని, మంత్రుల ఆస్తులు పెరుగుతుంటే ప్రభుత్వ ఆస్తులు తరిగిపోతున్నాయని ఆయన ఆరోపించారు.
ఈ అక్రమాలపై రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రణాళికాబద్ధంగా ఉద్యమించి, రైతులు, విద్యార్థుల పక్షాన నిలబడి ఈ రెండు పార్టీల వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇరిగేషన్, విద్యుత్, పురపాలక, పౌర సరఫరాల శాఖల్లో అప్పట్లో జరిగిన తప్పిదాలనే నేటి పాలకులు కూడా యథాతథంగా కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
ధాన్యం సేకరణ నిరంతర ప్రక్రియ అయినప్పటికీ, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల దళారులు దోచుకుంటుంటే, అన్నదాతలు మాత్రం నష్టపోతున్నారని, అకాల వర్షాల ముప్పు పొంచి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదని ఆయన మండిపడ్డారు. విద్యుత్ రంగంలో డిస్కంలు రూ. 69 వేల కోట్ల పైచిలుకు నష్టాల్లో కూరుకుపోయినా, ప్రభుత్వాలు మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని ప్రభాకర్ విమర్శించారు.
గృహ, వ్యవసాయ, పారిశ్రామిక విద్యుత్ వినియోగంపై సరైన లెక్కలు లేకపోవడం దారుణమని, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) పేరుతో గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రిటైర్డ్ అధికారులను సలహాదారులుగా పెట్టుకుని ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయని ఆయన ఆక్షేపించారు. కేవలం పరస్పర విమర్శలు, విచారణల పేరుతో కాలయాపన తప్ప, వ్యవస్థను చక్కదిద్దే చిత్తశుద్ధి ఏ ప్రభుత్వానికి లేదని ఆయన పేర్కొన్నారు.
‘ఇందిరమ్మ రాజ్యం’ అని పదే పదే చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రాజ్యానికి పునాదిగా చెప్పుకునే ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను నీరుగారుస్తోందని ప్రభాకర్ మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్ మెంట్ అందక విద్యార్థులు సర్టిఫికెట్లు రాక విద్యా సంవత్సరాన్ని కోల్పోయే దుస్థితికి చేరుకున్నారని, ఇది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటమేనని ఆయన ధ్వజమెత్తారు.

More Stories
సర్దార్ పటేల్ దూరదృష్టి వల్లే నేటి అఖండ భారతం
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్..14 రోజుల రిమాండ్
ధాన్యాన్ని బలవంతంగా రైస్ మిల్లర్లకు తరలిస్తున్నారు