సర్దార్ పటేల్ దూరదృష్టి వల్లే నేటి అఖండ భారతం 

సర్దార్ పటేల్ దూరదృష్టి వల్లే నేటి అఖండ భారతం 

సర్దార్ పటేల్ దూరదృష్టి వల్లే నేటి అఖండ భారత సాధ్యమైందని  కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు.  దేశ సమగ్రతకు ఉక్కు సంకల్పంతో పునాదులు వేసిన ‘భారతరత్న’ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు సందర్భంగా హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో  ‘భారత్ భారతి’ ఆధ్వర్యంలో జరిగిన “ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

సర్దార్ పటేల్ కేవలం ఒక చారిత్రక వ్యక్తి మాత్రమే కాదని, ఆయన ఒక ‘కాలాతీత శక్తి’ అని కేంద్ర మంత్రి అభివర్ణించారు. “బ్రిటిష్ పాలకులు భారత్‌ను 562 చిన్న చిన్న రాజ్యాలుగా విభజించి, దేశాన్ని బలహీనపరిచి వెళ్లాలని చూశారు. ఆ సమయంలో సర్దార్ పటేల్ తన అద్భుతమైన దౌత్యం, రాజనీతిజ్ఞత, ధైర్యంతో ఆ సంస్థానాలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చి, నేటి అఖండ భారతావనిని నిర్మించారు. ఒకవేళ సర్దార్ పటేల్ లేకపోతే, నేడు మనం చూస్తున్న భౌగోళిక భారతం ఉండేది కాదు,” అని ఆయన స్పష్టం చేశారు.

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, “మహాత్మా గాంధీ, వీర్ సావర్కర్ వంటి మహనీయుల బలిదానాల పునాదులపై మనకు స్వాతంత్ర్యం లభించింది. ఇప్పుడు వారి ఆశయాలకు అనుగుణంగా, అభివృద్ధి చెందిన భారతావనిని నిర్మించడమే మన ముందున్న ప్రధాన లక్ష్యం. 140 కోట్ల మంది భారతీయులు ఈ సంకల్పాన్ని స్వీకరించి, దేశ పురోభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు మాట్లాడుతూ, హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడంలో సర్దార్ పటేల్ దృఢ సంకల్పం, దూరదృష్టి కీలక పాత్ర పోషించాయని తెలిపారు. నాటి నిజాం పాలనలో హైదరాబాద్‌ను భారత్ నుండి వేరు చేయడానికి లేదా పాకిస్థాన్‌లో విలీనం చేయడానికి జరిగిన ప్రయత్నాలను తనదైన వ్యూహంతో సర్దార్ పటేల్ తిప్పికొట్టారని కొనియాడారు.
 
నేడు మనం అనుభవిస్తున్న సమైక్య భారతం ఆయన వేసిన పునాది ఫలితమేనని స్పష్టం చేశారు.  అంతేకాకుండా, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ, వారి ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని రాంచందర్ రావు పిలుపునిచ్చారు.  దేశ ఐక్యతను, సమగ్రతను మరియు సామాజిక సామరస్యాన్ని కాపాడుకుంటూ, అభివృద్ధి చెందిన భారతావని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. మహనీయుల ఆశయ సాధన దిశగా పయనించడమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన స్పష్టం చేశారు.