గాజియాబాద్‌లో విద్యార్థి హత్యకేసులో నిందితుడి ఎన్‌కౌంటర్

గాజియాబాద్‌లో విద్యార్థి హత్యకేసులో నిందితుడి ఎన్‌కౌంటర్
ఉత్తర్‌ప్రదేశ్‌లో బక్రీద్ రోజున సంచలనం సృష్టించిన 11వ తరగతి విద్యార్థి 17 ఏళ్ల సూర్యప్రతాప్ చౌహాన్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అసద్ శనివారం అర్ధరాత్రి పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మే 28వ తేదీన బక్రీద్ పండగ రోజున గాజియాబాద్‌లోని ఖోడా ప్రాంతంలో సూర్యప్రతాప్ చౌహాన్‌పై అసద్, అతని అనుచరులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన సూర్యప్రతాప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. 

ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించగా,  ఈ కేసులో మొత్తం ఐదుగురిని నిందితులుగా గుర్తించిన పోలీసులు ఘటన జరిగిన వెంటనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. అయితే ప్రధాన నిందితుడు అసద్ పరారీలో ఉండటంతో అతడిని అరెస్ట్ చేసేందుకు రూ.50 వేల రివార్డు ప్రకటించారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

శనివారం రాత్రి అసద్ తన అనుచరుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని నగరం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో  ఖోడా, ఇందిరాపురం పోలీస్ స్టేషన్ల సంయుక్త బృందాలు పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో బైక్‌పై వస్తున్న అసద్‌ను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా అతడు పోలీసులపై కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.

దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపగా అసద్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతడు మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి కూడా గాయపడగా, అతడు చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి నాటు తుపాకీ, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అసద్‌తో పాటు ఉన్న మరో వ్యక్తి పరారీ కావడంతో అతని కోసం గాలింపు కొనసాగుతోంది.
కాగా, తన కుమారుడిని ఏడుగురు వ్యక్తులు కలిసి అతి దారుణంగా హత్య చేశారని పేకరోన్తు మిగిలిన నిందితులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సూర్యప్రతాప్ తల్లి డిమాండ్ చేశారు. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య హంతకులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.