రాజస్థాన్ లో ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలోని చురు, శ్రీగంగానగర్, బికనీర్, సీకర్ తదితర ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం భీకర గాలులు వణికించాయి. దట్టమైన మేఘాల రూపంలో ఇసుక ఆవరించడంతో ఒక్కసారిగా చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. అనంతరం ఆయా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇసుక తుపాను కారణంగా వాహనదారులు, స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. .
దట్టమైన ఇసుక తుపానుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆకాశాన్ని భారీ ధూళి మేఘాలు కమ్మేయడంతో పట్టపగలే రాత్రిని తలపించింది. రోడ్లపై కొద్ది మీటర్ల దూరం కూడా కనిపించని పరిస్థితి నెలకొనడంతో వాహనాలు హెడ్లైట్ల సాయంతో మెల్లగా కదిలాయి. బలమైన గాలులు, ఇసుక తుపాన్ నుంచి రక్షించుకునేందుకు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.
ఈ భీకర గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు, కరెంటు స్తంభాలు దెబ్బతిన్నాయి. ఇసుక తుపాను అనంతరం కొన్నిచోట్ల భారీ వర్షం కురిసింది. దట్టమైన ఇసుక తుఫాను, భారీ వర్షం కారణంగా స్థానికుల రోజువారీ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సర్దార్‌షహర్ ప్రాంతంలో ధూళి మేఘాల తీవ్రత ఎక్కువగా కనిపించింది.
ఆకాశాన్ని ఇసుక మేఘాలు పూర్తిగా కమ్మేయడంతో, పట్టపగలే దట్టమైన చీకట్లు అలుముకున్న దృశ్యాలు చూపరులను భయాందోళనలకు గురిచేశాయి. అంతకుముందు జైపూర్‌లోనూ శుక్రవారం ఇదే విధమైన వాతావరణం కనిపించింది. ఇసుక తుపానుతోపాటు భీకర గాలులు వీచాయి. ధోల్‌పుర్ జిల్లాలో అత్యధికంగా 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రాష్ట్రంలో ఈ తరహా వాతావరణం మరో నాలుగైదు రోజులు కొనసాగే అవకాశం ఉందని జైపూర్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. జైపూర్, అజ్మీర్, బికనీర్, కోటా, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్ డివిజన్లలో గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీయడంతోపాటు ఆయా చోట్ల ఉరుములతో కూడిన వర్షంపడే అవకాశం ఉందని తెలిపింది.

More Stories
సీబీఎస్ఈ పోర్టల్‌పై సైబర్ దాడి
వర్షపాతం 90 శాతంకు తగ్గే అవకాశం
దేశవ్యాప్తంగా ఒకే హెల్ప్‌లైన్ నెంబర్ 112