* గుంజపడుగు కొనుగోలు కేంద్రం వద్ద ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం.
బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన బీజేపీ బృందం చేపట్టిన ‘రైతు గోస – బీజేపీ భరోసా’ యాత్ర మూడవ రోజు పెద్దపల్లి జిల్లా మంథని రూరల్ పరిధిలోని గుంజపడుగు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో గోనె సంచులు, అమాలీలు, తూకం కాంటాలు, క్లీనింగ్ మిషన్లు లేక రైతులు అల్లాడుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని తీవ్రంగా మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ సభల కోసం హైదరాబాద్ డిపోల నుండి వందలాది బస్సులను పంపించగలరు కానీ, అన్నదాతల ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి లారీలను సమకూర్చలేకపోతున్నారని ఈటల విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిరోజూ ఇసుక రవాణా చేసే వేలాది లారీలను కనీసం మూడు నాలుగు రోజుల పాటు నిలిపివేసి, ధాన్యం తరలింపునకు ఉపయోగిస్తే పంట కళ్ల ముందే నానిపోకుండా, మొలకలు రాకుండా కాపాడుకునే వాళ్ళమని రైతులు కన్నీరు పెడుతున్నారని పేర్కొన్నారు.
ఈ ఎండ దెబ్బకు, కొనుగోళ్లు జరగని ఆవేదనతో కొందరు రైతులు గుండె పగిలి చనిపోతుంటే, మరికొందరు ఆత్మహత్యాయత్నాలు చేస్తున్నారని, మహిళా రైతులు చిన్న పిల్లలను వేసుకొని వరికుప్పల మీదనే రాత్రింబవళ్లు పడుకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన చెందారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం మద్దతు ధర అడిగిన రైతులపై సంకెళ్లు వేస్తే, ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కాటారంలో ధర్నా చేసిన రైతులపై అక్రమ కేసులు బనాయించిందని మండిపడ్డారు.
రైతులకు అండగా నిలబడటానికి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించడానికే బీజేపీ నాయకుల బృందం క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాల సందర్శనకు వచ్చి రైతుల పక్షాన నిలిచేందుకు వచ్చామని ఈటల స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే స్పందించి, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు.
గత 20 నుండి 30 రోజులుగా రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తూ కాపలా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఊరు పోయినా, ఏ ఐకేపీ సెంటర్ చూసినా గన్ని బ్యాగ్స్ ఇవ్వడం లేదని, బస్తాలు ఇస్తే జోకడం లేదని, లారీలు రావడం లేదని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని పక్కనే ఉన్న కాటారం గ్రామంలో తొమ్మిది మంది రైతులు శాంతియుతంగా ధర్నా చేస్తే, వారిపై నాన్-బెలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టిన దుర్మార్గమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Stories
ట్రంప్ ‘అబ్రహాం అకార్డ్’ మెలికతో ఇరకాటంలో పాక్
ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు అస్సాం అసెంబ్లీ ఆమోదం
సిద్దిపేట జిల్లాలో కాకతీయ గణపతిదేవుని శిల్పం గుర్తింపు