బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) బిల్లును అసోం అసెంబ్లీ ఆమోదించింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య బిల్లు బుధవారం ఆమోదం పొందింది. ఈ బిల్లును కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు `రాజకీయ ఎజెండా’ బిల్లుగా పేర్కొన్నాయి. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి.
విస్తృత సంప్రదింపుల కోసం బిల్లును ఒక ప్రత్యేక కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను స్పీకర్ రంజీత్ కుమార్ దాస్ తిరస్కరించడంతో, వారు సభ మధ్యలోకి వెళ్లి బిల్లు ఆమోదం పొందే వరకు నినాదాలు చేస్తూనే ఉన్నారు. అధికార పక్ష సభ్యులు ‘భారత్ మాతా కీ జై’, ‘జై శ్రీ రామ్’ అంటూ నిరంతరం నినాదాలు చేస్తుండగా, స్పీకర్ బిల్లును మూజువాణి ఓటింగ్‌కు పెట్టారు. అధికార సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేసిన తర్వాత, “బిల్లు ఆమోదం పొందిందని నేను ప్రకటిస్తున్నాను” అని ఆయన తెలిపారు.
బిల్లు ఆమోదం పొందిన వెంటనే, సభ చప్పట్లతో దానికి ఘనస్వాగతం లభించింది. ఈ బిల్లు అమలైతే యూసీసీని అమలు చేస్తున్న మూడో రాష్ట్రంగా అసోం నిలవనుంది. ఇంతకుముందు ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాలు యూసీసీని ఆమోదించి అమలు చేస్తున్నాయి. అసోంలో ఐదు రోజుల ప్రత్యేక అసెంబ్లీని హిమంత బిశ్వ శర్మ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా సోమవారం యూసీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. బుధవారం ఆమోదం పొందింది.
రాష్ట్రంలోని ఏ ఒక్కరూ ఇకపై బహుభార్యత్వం కలిగి ఉండటానికి వీల్లేకుండా ఈ చట్టం నిరోధిస్తుంది. మత ప్రాతిపదికన కాకుండా అందరికీ ఇదే చట్టం వర్తిస్తుంది. అయితే, అసోంలోని గిరిజన తెగలకు మాత్రం ఈ బిల్లు వర్తించదు. ఈ బిల్లు ప్రకారం ఎవరైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటే ఇకపై నేరమే. దీని ప్రకారం గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.
అలాగే, ఎవరైనా, ఎవరితోనైనా సహజీవనం (లివ్ ఇన్ రిలేషన్) చేస్తే ఆ బంధాన్ని రిజిష్టర్ చేసుకోవాలి. లేకుంటే సంబంధిత వ్యక్తులకు మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు. ఈ బిల్లు ప్రకారం పురుషుల వివాహ వయస్సు 21 సంవత్సరాలు, యువతుల వివాహ వయస్సు 18 సంవత్సరాలుగా నిర్ణయించారు.
ఈ బిల్లు ద్వారా పెళ్లి, విడాకులు, సహజీవనం, వారసత్వ హక్కులపై చట్టబద్ధత లభిస్తుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. అసోం సాంస్కృతిక వైవిధ్యానికి నిదర్శనంగా నిలిచే ఈ బిల్లు మతపరమైన వివాహ సంప్రదాయాలకు, ఆచారాలకు రక్షణ కల్పిస్తుందని చెప్పారు. అయితే, ఈ బిల్లును ప్రతిపక్షాలైన కాంగ్రెస్, టీఎంసీ, ఆర్డీపీలు వ్యతిరేకించాయి. ఈ బిల్లుకు సంబంధించిన తమకు చెందిన అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోకుండానే దీన్ని ఆమోదించడం సరికాదని ప్రతిపక్షాలు అంటున్నాయి.
More Stories
ప్రధాని మోదీని కలిసిన తమిళనాడు సీఎం విజయ్
బిఎస్ఎఫ్ కు 142.79 ఎకరాల భూమి అప్పగింత
ట్రంప్ ‘అబ్రహాం అకార్డ్’ మెలికతో ఇరకాటంలో పాక్