ముఖ్యమంత్రి సిద్దరామయ్యను తప్పుకోమన్న అధిష్టానం!

ముఖ్యమంత్రి సిద్దరామయ్యను తప్పుకోమన్న అధిష్టానం!
ర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వ మార్పు అంశంపై మంగళవారం సుదీర్ఘ చర్చలు జరిపిన కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు ముఖ్యమంత్రి సిద్దరామయ్యను రాజీనామా చేయమని స్పష్టం చెప్పింది.  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభ ద్వారా ఢిల్లీకి మకాం మార్చాలని సిద్ధరామయ్యను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆదేశించినట్లు తెలుస్తున్నది. 
 
జాతీయ స్థాయిలో ఆయనకు మరింత పెద్ద పాత్ర ఇస్తామని హామీ ఇచ్చింది. భవిష్యత్తు సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలో మార్పులు తీసుకురావడం, పార్టీని, ప్రభుత్వాన్ని పునర్వ్యవస్థీకరించడం వంటి చర్యలు చేపట్టాలని యోచిస్తున్నట్లు కాంగ్రెస్‌ అధిష్ఠానం ముఖ్యమంత్రికి తెలియచేసినట్లు తెలిసింది. రాష్ట్ర పగ్గాలు చేపట్టేందుకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ చాలా కాలంగా తెరవెనుక వేచి చూస్తున్నారు.  

ఏఐసీసీ కార్యాలయంలోని ఇందిరాభవన్‌లో మంగళవారం విడతలవారీగా  అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్‌, సుర్జేవాలాలతో చర్చలు జరిపారు.  నాయకత్వ మార్పు అనివార్యమని పార్టీ వర్గాలు చెబుతుండగా కాంగ్రెస్‌ అధికారికంగా సిద్ధరామయ్య మార్పుపై ఎటువంటి చర్చ జరగలేదని ప్రకటించడం గమనార్హం. 

దాదాపు ఆరు గంటలకు పైగా జరిగిన చర్చల అనంతరం కేసీ వేణుగోపాల్‌ విలేకరులతో మాట్లాడుతూ తమ చర్చలు రాజ్యసభ, కర్ణాటక శాసన మండలి ఎన్నికలకు మాత్రమే పరిమితమైనట్లు స్పష్టం చేశారు. నేటి చర్చలు కేవలం రాజ్యసభ ఎన్నికలు, ఎంఎల్‌సీ ఎన్నికల చుట్టూ మాత్రమే జరిగాయి. మీరు ఊహించినది నిజంకాదు అని వేణుగోపాల్‌ చెప్పారు. 

తొలుత రాజ్యసభ సీటు, ఆయన కుమారుడికి ఉపముఖ్యమంత్రి పదవి సహా పలు ఆఫర్లను అధిష్ఠానం ప్రతిపాదించినా సీఎం సీటు వీడేందుకు సిద్దరామయ్య ససేమిరా అన్నట్లు తెలిసింది. తనకు హిందీ భాష రాదని, జాతీయ రాజకీయాలపై తనకు ఆసక్తిలేదని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.  తన ఆప్తులతో చర్చించి చెబుతానని నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం పదవి వదులుకోకూడదని ఆయన వర్గం చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికీ కాంగ్రెస్ ఎమ్యెల్యేలలో అత్యధికులు సిద్ధరామయ్యకు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో అత్యధికుల మద్దతు సిద్ధరామయ్యకే ఉందని పార్టీ నాయకత్వానికి తెలుసు. అంతేకాకుండా, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఏకైక ఓబిసి నాయకుడు ఆయనే.

పార్టీలో తిరుగుబాటులు, ఆధిపత్య పోరులు తలెత్తకుండా ఉండేందుకు గాను,సిద్ధరామయ్యకున్న హోదాను దృష్టిలో ఉంచుకుని, ఆయనకు తగిన గౌరవం దక్కేలా చూసుకుంటూనే, ఈ నాయకత్వ మార్పు ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.