ఇండో-పసిఫిక్ ప్రాంత వ్యాప్తంగా సముద్ర జలాల నిఘాను, ఓడరేవుల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి కొత్త చర్యలు చేపడుతున్నట్లు క్వాడ్ ప్రకటించింది. ఈ ప్రాంతంలో పెరుగుతున్న చైనా మిలటరీ బలం నేపథ్యంలో క్వాడ్ ఈ నిర్ణయాలు తీసుకుంది. కీలకమైన ఖనిజాలు, ఇంధన రంగాల్లో సహకారాన్ని విస్తరించాలని సమావేశం నిర్ణయించింది.
ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరుగుతున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. విదేశాంగ మంత్రి జై శంకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీవాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మోతెగి పాల్గొన్నారు. సముద్ర జలాల భద్రతా సవాళ్ళను ఎదుర్కొనడంలో నాలుగు దేశాలు చేపట్టిన చర్యలను, ప్రయత్నాలను క్వాడ్ సంయుక్త ప్రకటన వివరించింది.
రాబోయే మాసాల్లో తదుపరి తరం కమ్యూనికేషన్ల ప్రమాణాలను అందుకోవడంపై కృషిని మరింత ముందుకు తీసుకెళ్ళాలని క్వాడ్ దేశాలు నిర్ణయించాయని ఆ ప్రకటన తెలిపింది. పహల్గాం, బాండీ బీచ్ ఉగ్ర దాడులను క్వాడ్ ఖండించింది. ఉగ్రవాదం ఏ రూపంలో వున్నా దాన్ని ఎదుర్కొనాల్సిందేనని, ఇందుకోసం అంతర్జాతీయ స్థాయిలో కృషి జరగాలని పేర్కొంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రికత్తల నేపథ్యంలో అంతర్జాతీయ చట్టాలకు అందరూ కట్టుబడాల్సి వుందని క్వాడ్ విదేశాంగ మంత్రులు కోరారు.
ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై వారు చర్చించారు. ఆ ప్రాంతంలో శాంతి నెలకొనడానికి సాగుతున్న దౌత్య యత్నాలకు మద్దతును ప్రకటించారు. ప్రధానంగా సముద్ర జలాల విభాగంలో సహకారాన్ని విస్తరించడం గురించి చర్చించినట్లు జైశంకర్ తెలిపారు. క్వాడ్ దేశాల మధ్య ఇండో – పసిఫిక్ సముద్రజలాల క్షేత్ర అవగాహనా చొరవను కూడా విస్తరించినట్లు రూబియో ప్రకటించారు. పసిఫిక్ దీవుల్లో ఓడరేవుల్లో మౌలిక సదుపాయాలను కూడా పెంపొందించేందుకు కొత్త చొరవను చేపట్టాలని క్వాడ్ నిర్ణయించిందని తెలిపారు.
కాగా, ప్రత్యేకమైన చిన్న గ్రూపుల ఏర్పాటును, కూటముల మధ్య ఘర్షణలను తాము వ్యతిరేకిస్తామని చైనా మంగళవారం వ్యాఖ్యానించింది. క్వాడ్ ప్రకటనపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ, ‘క్వాడ్ యంత్రాంగం’కు సంబంధించి చైనా తన వైఖరిని గతంలో అనేకసార్లు వెల్లడించింది. దేశాల మధ్య సహకారమనేది ప్రాంతీయ శాంతి, సుస్థిరతలు నెలకొనడానికి , సంక్షేమం, అభివృద్ధి వంటివి పెంపొందడానికి అనుకూలంగా వుండాలని పేర్కొంది. అంతేకానీ ఏ తృతీయ పక్షాన్ని ఉద్దేశించి వుండకూడదని తెలిపింది.

More Stories
ముఖ్యమంత్రి సిద్దరామయ్యను తప్పుకోమన్న అధిష్టానం!
జనాభాలో అనవసర మార్పులు, అక్రమ వలసలపై అత్యున్నత కమిటీ
టీఎంసీకి 100 మంది కౌన్సిలర్ల రాజీనామా.. ఎంపీ బీజేపీకి మద్దతు