మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు నరహరి లొంగుబాటు 

మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు నరహరి లొంగుబాటు 
* తెలంగాణాలో అజ్ఞాతంలో గణపతితో సహా మరో ముగ్గురు మాత్రమే 

మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు,  బీహార్‌-జార్ఖండ్‌ స్పెషల్‌ ఏరియా కమిటీ కార్యదర్శి పసునూరి నరహరి అలియాస్‌ సంతోశ్ (64) పోలీసుల ఎదుట లొంగిపోయారు. భార్య,  రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేదర దానమ్మ అలియాస్‌ పూ నమ్‌ అలియాస్‌ జోబాలు డీజీపీ సివి ఆనంద్ ఎదుట లొంగిపోయారు. తెలంగాణకు చెందిన మరో ముగ్గురు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని, గణపతి, జాడే సుజాత, వార్త శేఖర్ మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని ఆయన తెలిపారు. 

మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు గణపతి విదేశాల్లో లేడని, ఆయన భారత్ లోనే ఎక్కడో ఓ చోట తలదాచుకున్నాడని తెలిపారు. తెలంగాణలో ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులను ప్రత్యక్షంగా కలిసి.. వారి సమస్యలు వింటానని డీజీపీ వెల్లడించారు. ఈ ఇద్దరు అగ్రనేతల లొంగుబాటు మావోయిస్టు పార్టీకి తీవ్రనష్టమని, తూర్పు ప్రాంతీయ బ్యూరో (ఈఆర్బీ) వ్యవస్థ దాదాపు కుప్పకూలే పరిస్థితికి చేరుకుందని డీజీపీ తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వ పునరావాసం కింద నరహరికి రూ.25 లక్షలు, దానమ్మకు రూ.20 లక్షల రివార్డు మొత్తాలను చెక్కు రూపంలో అందజేశారు. అదనంగా ఆరోగ్య కార్డులు సహా ఇతర పునరావాస ప్రయోజనాలు కూడా కల్పించనున్నట్టు పేరొన్నారు. 2024 నుంచి 2026 వరకు మొత్తం 822 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ తెలిపారు. 

ఇందులో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు, 23 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారని వెల్లడించారు. ఒక్క 2026లో 264 మంది మావోయిస్టు క్యాడర్‌ లొంగిపోయారని, అందులో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యు లు, 11 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారని వివరించారు. లొంగిపోయిన మావోయిస్టులపై ఇంటెలిజెన్స్‌ నిఘా ఉంటుందని డీజీపీ స్పష్టం చేశారు.

నరహరి హనుమకొండ జిల్లా సోమిడి గ్రామానికి చెందినవారని చెప్పారు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే ఉద్యమంలోకి వెళ్లి గోపన్న దళం, రామన్న స్క్వాడ్‌ దండకారుణ్యంలో పని చేశారని వివరించారు. 1986లో నరహరి కమాండర్‌గా పదోన్నతి పొందగా 2017 నాటికి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారని సీవీ ఆనంద్ చెప్పారు.  తుపాకులు, మోర్టార్లు, రాకెట్లు, గ్రనేడ్ల తయారీలో నరహరి నిపుణుడని డీజీపీ తెలిపారు.

2004లో నరహరి భార్య దానమ్మను అరెస్టు చేశారని సీవీ ఆనంద్ వెల్లడించారు. ఏడు సంవత్సరాల పాటు దానమ్మ జైలులో ఉన్నారని, అనంతరం బెయిల్‌పై విడుదలై మళ్లీ మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లారని చెప్పారు.  గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడుకు చెందిన మేదర్‌ దానమ్మ 1986లో ఉద్యమంలో చేరిన తర్వాత.. ఆమెను నరహరిని వివాహం చేసుకున్నట్టు తెలిపారు.

నాగ్‌పూర్‌ జైలులో ఏడేండ్లు గడిపిన తర్వాత మళ్లీ మావోయిస్టు పార్టీలో చేరి బీహార్‌-జార్ఖండ్‌ ప్రాంతంలో సాంకేతిక విభాగంలో ఆమె బాధ్యతలు నిర్వర్తించిందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టులు చేపట్టిన సాయుధ పోరాటం కష్టంగా మారిందని ఈ సందర్భంగా నరహరి తెలిపారు. జార్ఖండ్, తెలంగాణతోపాటు మిగతా ప్రాంతాల్లో సాయుధ పోరాటం పరంగా అనేక నష్టాలు చేశామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కల్పించిన అవకాశాలు కారణంగానే తాము ప్రజా జీవితంలోకి వచ్చామని స్పష్టం చేశారు. 

జార్ఖండ్‌లోని మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిరి బిశ్రా అనుమతితోనే తాము ప్రజా జీవితంలోకి వచ్చామని తెలిపారు. తెలంగాణ ప్రజల హక్కుల సాధన చట్టపరంగానే జరగాలని భావిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.  కాగా, ,లొంగిపోయిన మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయలు, సాయుధ పోరాటంలో చోటు చేసుకున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రజా జీవితంలోకి రావాలని మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావును నరహరి కోరారు.