హైదరాబాద్ నగరంలోని ప్రముఖ షాపింగ్ మాల్స్‌లో లభించే ఆహార పదార్థాల నాణ్యతపై మరోసారి పెద్ద ఎత్తున ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేపీహెచ్బి పరిధిలోని ప్రసిద్ధ లులు మాల్‌లో కొనుగోలు చేసిన ఒక మిక్చర్ ప్యాకెట్‌లో ఫ్రైడ్ బల్లి వచ్చిందంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. దీనిపై ఫిర్యాదు అందడంతో అప్రమత్తమైన తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం లులు హైపర్ మార్కెట్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో మాల్‌లోని ఇన్‌హౌస్ కిచెన్‌లో పరిశుభ్రత లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సోదాల్లో కిచెన్ పరిసరాలు, స్టోరేజ్ రూములలో పెద్ద ఎత్తున పురుగులు, కీటకాలు తిరుగుతున్నట్లు తేలింది. ఆహార తయారీకి సిద్ధంగా ఉంచిన కూరగాయలు పూర్తిగా కుళ్లిపోయి ఉన్నట్లు అధికారులు గుర్తించి వాటిని అక్కడికక్కడే పారవేయించారు. వంటగదిలో అత్యంత అధ్వాన్నమైన పరిశుభ్రత పరిస్థితులు కనిపించాయి.
ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన మిగిలిపోయిన ఆహారాన్ని అధికారులు అక్కడికక్కడే పారవేయించారు. వంటగది పరిసరాల్లో కీటకాలు ఉన్నట్లు గుర్తించారు. ప్యాక్ చేసిన కొన్ని ఆహార పదార్థాల గడువు ముగిసిపోవడానికి దగ్గరగా ఉన్నప్పటికీ వాటిపై చిరిగిన, ట్యాంపరింగ్ చేసేలా లేబుళ్లను అంటించినట్లు గుర్తించారు. శనగపిండి, గోధుమపిండి, పప్పుధాన్యాలలో పురుగులు పట్టినట్లు గుర్తించారు. గడువు ముగిసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్‌తో ఉన్న ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను గుర్తించారు.
లేబులింగ్, డిస్‌ప్లే నియమాలను ఉల్లంఘించినట్లు తేలింది. కొన్ని ఉత్పత్తులపై పోషక విలువల సమాచారం, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ వివరాలు, తయారీదారుల చిరునామా లేకపోవడాన్ని గుర్తించారు. మాంసం వ్యర్థాలతో డ్రైనేజీలు పూడుకుపోయి, తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఇది ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
పురుగులు పట్టిన స్వీట్లు, నూనెలు, పిండి పదార్థాలు, పప్పుధాన్యాలతో సహా సుమారు 150 కిలోల ఆహార పదార్థాలను అధికారులు పారవేశారు. కల్తీ జరిగినట్లు లేదా రంగులు ఎక్కువగా వాడినట్లు అనుమానం ఉన్న ఆహార నమూనాలను, అలాగే పురుగులు పట్టిన శనగపిండి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. వినియోగదారులు రిటైల్ దుకాణాలు, సూపర్ మార్కెట్లు, బేకరీలు, హోటళ్ల నుండి ఆహార పదార్థాలను కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

More Stories
తెలంగాణలో డిమాండ్‌కు సరిపడా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ
కేబీర్ పార్క్ చుట్టూరా చెట్ల నరికివేతపై సుప్రీం ఆంక్షలు!
ప్రధానిగా 12వ వార్షికోత్సవం సందర్భంగా పర్యావరణం, ఇంధన పొదుపు!