సువేందు అధికారి పీఏ హత్య కేసులో షూటర్‌‌ అరెస్టు 

సువేందు అధికారి పీఏ హత్య కేసులో షూటర్‌‌ అరెస్టు 
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రాథ్‌ హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. చంద్రనాథ్‌ను కాల్చి చంపిన షూటర్‌‌ రాజ్‌కుమార్‌ను సీబీఐ సోమవారం అరెస్టు చేసింది. యూపీ పోలీసుల సహకారంతో అతడిని ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌‌ నగర్‌‌లో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడి ట్రాన్సిట్‌ రిమాండ్‌ను సీబీఐ అధికారులు తీసుకుని, కోల్‌కతా తరలిస్తున్నారు. 
 
మంగళవారం రాజ్‌ కుమార్‌‌ను సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు. చంద్రనాథ్ సువేందు అధికారికి అత్యంత సన్నిహితుడు. అతడిని, ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజులకు,అంటే ఈ నెల 6న దుండగులు నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని దోల్తాలాలో అత్యంత సమీపం నుంచి కాల్చి చంపారు. దీంతో ఈ హత్యకేసును విచారించేందుకు అధికారులు సిట్ ఏర్పాటు చేశారు.

ఈ ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రనాథ్ కుటుంబానికి సువేందు అధికారి హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా సిట్‌ నుంచి కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ సువేందు అధికారి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే మయాంక్ రాజ్ మిశ్రా, విక్కీ మౌర్యా, రాజ్ సింగ్ అనే ముగ్గురు నిందితుల్ని సీబీఐ అరెస్టు చేసింది. మరోవైపు ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా, ఈ హత్యలో ఎనిమిది మంది ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులు తమ వాంగ్మూలాలను పదేపదే మారుస్తున్నారని వారు తెలిపారు. “రథ్ కదలికలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం వారికి ఎలా అందింది? అలాగే నేర స్థలంలో మరెవరెవరు ఉన్నారు? అనే విషయాలను నిర్ధారించుకునేందుకు నిందితులను విచారిస్తున్నాము,” అని ఒక అధికారి తెలిపారు.