ప్రధానిగా 12వ వార్షికోత్సవం సందర్భంగా పర్యావరణం, ఇంధన పొదుపు!

ప్రధానిగా 12వ వార్షికోత్సవం సందర్భంగా పర్యావరణం, ఇంధన పొదుపు!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాల పాలనను పూర్తి చేసుకోబోతున్నారు. అదే సమయంలో పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇంధన పొదుపుపై “మేరా భారత్ – మేరా యోగదాన్” అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మూడు అంశాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుకుగా పనిచేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు పిలుపిచ్చారు. 

పార్టీ కార్యక్రమాలపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలనలో దేశం “ఆత్మనిర్భర్ భారత్”, “వికసిత భారత్” లక్ష్యాల దిశగా ముందుకు సాగుతోందని పేర్కొంటూ అదే దిశగా పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను వివరించాలని ఆయన కోరారు. “మేరా భారత్ – మేరా యోగదాన్” అంటే దేశానికి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించడం అని తెలిపారు. 

ప్రధాని మోదీ ఇచ్చే ప్రతి పిలుపు దేశ ప్రయోజనాల కోసమే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత పరిస్థితులు నెలకొన్నాయని, అనేక దేశాలు ఇంధన ధరలను భారీగా పెంచాయని గుర్తు చేశారు. కొన్ని దేశాల్లో రేషన్ విధానం కూడా అమలు చేస్తున్నారని, అయితే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలపై అదనపు భారం పడకుండా చూసిందని చెప్పారు. 
 
అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇంధన వినియోగంలో క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి అంతర్జాతీయ పరిణామాల కారణంగా భవిష్యత్తులో చమురు సంక్షోభం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.  అందుకే ప్రజలు సాధ్యమైనంత వరకు ఇంధన పొదుపు చేయాలని, కార్‌పూలింగ్ చేయాలని, ప్రజా రవాణాను వినియోగించాలని కోరారు. మెట్రో, ఆర్టీసీ బస్సులను ఎక్కువగా ఉపయోగించాలని, విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలని, అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలను కూడా అనుసరించాలని వివరించారు.  
 
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని చెబుతూ “ఒక చెట్టు – అమ్మ పేరు మీద” కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని రామచందర్ రావు సూచించారు. ప్రకృతి పరిరక్షణ కోసం స్థానిక ఉత్పత్తులను వినియోగించాలని, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని, పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా భావించి ముందుకు సాగాలని చెప్పారు.