ఇరాన్‌తో ఉద్రిక్తతలతో పెను సంక్షోభం దిశగా అమెరికా

ఇరాన్‌తో ఉద్రిక్తతలతో  పెను సంక్షోభం దిశగా అమెరికా
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ప్రస్తుతం పెను సంక్షోభం దిశగా పయనిస్తోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతలు మరో మూడు నెలల కంటే ఎక్కువ కాలం కొనసాగితే ఈ ఒత్తిడిని తట్టుకునే శక్తి అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఉండకపోవచ్చని మూడీస్ అనలిటిక్స్ చీఫ్ ఎకనమిస్ట్ మార్క్ జాందీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
గతంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న చరిత్ర ఉన్నప్పటికీ ప్రస్తుతం చైనాతో వాణిజ్య యుద్ధం, పెరుగుతున్న ఇంధన ధరలు అమెరికా ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయనున్నాయి. కాగా యుఎస్‌ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఈ ఆందోళనలను కొట్టిపారేస్తున్నారు. వాల్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్లు బలంగా ఉన్నాయని, ప్రస్తుత ఇంధన ధరల పెరుగుదల కేవలం తాత్కాలికమేనని ఆయన వాదిస్తున్నారు. ప్రతికూల ఆర్థిక అంచనాలను కేవలం భయాందోళనలు సృష్టించేవిగా ఆయన అభివర్ణించారు. 
 
కానీ  క్షేత్రస్థాయి గణాంకాలు మాత్రం భిన్నమైన చిత్రాన్ని చూపుతున్నాయని అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలను వెల్లడిస్తున్నాయి. ఇంధన ధరలు మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరుకోవడం ఇన్వెస్టర్లను, సామాన్యులను కలవరపెడుతోంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో కనిపిస్తున్న జోరు నిజమైన ఆర్థిక వృద్ధికి సంకేతం కాదని, అది కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ)పై ఉన్న మితిమీరిన ఆశలతో ఏర్పడిన ఒక బుడగ వంటిదని మార్క్ జాందీ విశ్లేషించారు. 
 
ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో అమెరికాలో 2 శాతం వృద్ధి, 4.3 శాతం నిరుద్యోగిత రేటు కనిపిస్తున్నప్పటికీ ఏడాది కాలంగా కొత్త ఉద్యోగాల సృష్టి జరగకపోవడం ఆర్థిక వ్యవస్థ బలహీనతకు నిదర్శనమని ఆయన హెచ్చరించారు. డిమాండ్ స్వల్పంగా తగ్గినా భారీగా ఉద్యోగ కోతలు మొదలయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.  రాబోయే 90 రోజులు అమెరికాకు అత్యంత కీలకం కానున్నాయి.
ఒకవేళ ఇరాన్‌తో యుద్ధ వాతావరణం త్వరగా ముగిస్తే సంక్షోభం నుండి తప్పించుకోవచ్చు. లేదంటే పరిస్థితి అదుపు తప్పుతుందని జాందీ అంచనా వేశారు. అమెరికా ప్రపంచంలోనే అగ్రశ్రేణి చమురు ఉత్పత్తిదారుగా ఉన్నందున ప్రస్తుతానికి సరఫరా ఇబ్బందులను తట్టుకోగలుగుతోంది. 
 
కానీ, గతంతో పోలిస్తే ఆర్థిక భద్రతా వలయాలు చాలా పల్చబడ్డాయని మరో ఆర్థికవేత్త క్లాడియా సామ్ పేర్కొన్నారు. నవంబర్ నాటికి ఇంధన ధరలు అదుపులోకి రాకపోతే అది దేశ ఆర్థిక వ్యవస్థపైనే కాకుండా అధ్యక్షుడి రాజకీయ భవిష్యత్తుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని ఆమె స్పష్టం చేశారు. మొత్తానికి ప్రపంచ అగ్రరాజ్యం ఇప్పుడు ఒక క్లిష్టమైన కాలపరీక్షను ఎదుర్కొంటోందని స్పష్టం చేశారు.