* భారత్ నాలుగు అతిపెద్ద ఆకాంక్షలను నెదర్లాండ్స్ లో వెల్లడించిన మోదీ
భారత్‌కు నాలుగు అతిపెద్ద ఆకాంక్షలున్నాయని చెబుతూ ఒలింపిక్స్ నిర్వహించడం, అంతర్జాతీయ తయారీ కేంద్రంగా మారడం, గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఎదగడంతోపాటు ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలవడం అనే నాలుగు లక్ష్యాలున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న ప్రధాని ది హేగ్ నగరంలో ప్రవాస భారతీయులతో మాటామంతీ కార్యక్రమం నిర్వహిస్తూ ఎన్ఆర్ఐలులక్ష్యాలను అధిగమించి పని చేస్తున్నారని కొనియాడారు.
“భారతీయ ఆకాంక్షలు అనంతం. అలాగే, మన ప్రయత్నం కూడా అపరిమితం. కీలక తయారీ కేంద్రంగా భారత్ ఎదుగుతోంది. దేశాన్ని ఆధునిక టెక్ స్టార్టప్ వ్యవస్థగా మార్చేందుకు దేశ యువత నిరంతరం పని చేస్తుంది. దేశంలో డ్రోన్లు, ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్న దేశ యువతకు ధన్యవాదాలు. ప్రపంచంలోనే ఇండియా మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా నిలిచింది” అని తెలిపారు.
సెమీకండక్టర్ల తయారీ హబ్‌గా భారత్ మారనుందని చెబుతూ ఇటీవలే అతిపెద్ద ఏఐ సదస్సును భారత్ లో నిర్వహించామని గుర్తు చేశారు. ఏఐలో అభివృద్ధి దిశగా భారత్ ముందడుగు వేస్తోందని పేర్కొంటూ దేశంలో 12 సెమీ కండక్టర్ తయారీ యూనిట్లు సిద్ధమవుతున్నాయని తెలిపారు. వాటిలో రెండింట్లో పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయిని చెప్పారు.
“2014, మే 16న మా రాజకీయ ప్రయాణం మొదలైంది. ఆ రోజు దేశంలో బీజేపీకి మెజారిటీ దక్కింది. బీజేపీకి, దేశ ప్రజలకు మధ్య బంధం మరింత బలోపేతం అవుతోంది. జల్‌మురి ఇక్కడికి కూడా చేరిందా? ఇటీవలి ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెరిగింది. దాదాపు 80–90 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఏటా ఓటింగ్ శాతం పెరుగుతోంది. ఇది మన దేశంలో పెరుగుతున్న ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం. అందుకే భారత్ ను ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’ అంటారు. భారత్ అభివృద్ధి చెందితే అది ప్రపంచానికి మేలు చేస్తుంది” అని మోదీ తెలిపారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 64 కోట్ల మంది ఓటు వేశారని చెబుతూ ఐరోపా దేశాల జనాభా మొత్తం కలిపినా 64 కోట్ల మంది కూడా లేరని ప్రధాని గుర్తు చేశారు. డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. దేశంలో ప్రస్తుతం నెలకు 20 బిలియన్ డాలర్ల డిజిటల్ ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయని తెలిపారు. భారత్‌లో ఒకప్పుడు కేవలం 4 యూనికార్న్ సంస్థలే ఉండేవని, ప్రస్తుతం అవి 100కు చేరాయని చెప్పారు.
సెమీకండక్టర్ల అంశంలోనూ భారత్ ముందడుగు వేసిందని, ఆ దిశగా పనులు కూడా జరుగుతున్నాయని పేర్కొన్నారు. నెదర్లాండ్స్ నాయకత్వంతో ఎప్పుడు మాట్లాడినా అక్కడి భారతీయుల కృషి, ప్రతిభ గురించి ఎంతో ప్రశంసిస్తారని చెప్పారు. నెదర్లాండ్స్ ఆర్థిక వ్యవస్థకు భారతీయులు అందిస్తున్న సేవలపై ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడని అభినందించారు. ది హేగ్ నగరం భారత్- నెదర్లాండ్స్ స్నేహానికి సజీవ చిహ్నంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు.
ఎన్నో కష్టాలను దాటుకుని అక్కడ స్థిరపడిన భారతీయ కుటుంబాల కథలు కేవలం వలసల కథలు కాదని, అవి అభివృద్ధి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకలని తెలిపారు. తరాలు మారినా, దేశాలు మారినా భారతీయ కుటుంబ విలువలు, సంస్కృతి మారలేదని కొనియాడారు. డచ్ భాషను స్వీకరించినా తమ మూల భాషలను, సంప్రదాయాలను ప్రవాస భారతీయులు వదల్లేదని అభినందించారు.
భారత్, నెదర్లాండ్స్ కలిసి విశ్వసనీయమైన, పారదర్శకమైన, భవిష్యత్తు అవసరాలకు అనుగుణమైన సరఫరా వ్యవస్థను రూపొందించేందుకు కృషి చేస్తున్నాయని ప్రధాని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం కోసం రెండు దేశాలు భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని వెల్లడించారు. 21వ శతాబ్దంలో భారత్ అవకాశాల భూమిగా ఎదుగుతోందని ప్రధాని పేర్కొన్నారు.
భారత్ ఒకేసారి టెక్నాలజీ ఆధారిత దేశంగా, మానవీయ విలువలను కాపాడే దేశంగా ముందుకు సాగుతోందని చెబుతూ భారత్ ఎంత పురాతనమో, అంత ఆధునికంగా కూడా మారుతోందని తెలిపారు. “ఇంతటి ప్రేమ, ఉత్సాహాన్ని చూసి నెదర్లాండ్స్‌లో ఉన్నానన్న సంగతి ఒక్క క్షణం మర్చిపోయాను. భారతదేశంలోనే ఓ ఉత్సవానికి హాజరైనట్లు అనిపించింది. భారత స్నేహానికి ది హేగ్ సజీవ చిహ్నంగా మారిందని అనిపిస్తుంది” అని సంతోషం వ్యక్తం చేశారు.
“నేను నెదర్లాండ్స్ నాయకత్వంతో మాట్లాడిన ప్రతిసారీ వారు ప్రవాస భారతీయులను ప్రశంసిస్తూనే ఉంటారు. నెదర్లాండ్స్ సమాజానికి, ఆర్థిక వ్యవస్థకు మీరు చేసిన సేవకు ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు. మీ పూర్వీకులు ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నో విషయాలను వదిలేశారు. కానీ కొన్ని విషయాలు ఎల్లప్పుడూ మీతోనే ఉండిపోయాయి. భారతదేశ మట్టి పరిమళం, పండుగల జ్ఞాపకాలు, భక్తి గీతాల రాగాలు, పూర్వీకులు అందించిన విలువలు మీతో ఉన్నాయి” అని ప్రశంసించారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరత, సంక్షోభ పరిస్థితులపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత దశాబ్దం ప్రపంచానికి సవాళ్ల కాలంగా మారిందని ఆయన అభివర్ణించారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఈ ఉద్రిక్తతలు, సంక్షోభ పరిస్థితుల్లో తక్షణ మార్పు రాకపోతే, ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు మళ్లీ పేదరికంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు.
ఈ ప్రతికూల పరిస్థితులు ఇలాగే కొనసాగితే, గత కొన్ని దశాబ్దాలుగా మానవాళి సాధించిన ఆర్థికాభివృద్ధి, సాంకేతిక విజయాలన్నీ వృథా అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షోభాల ప్రభావం నేరుగా సామాన్యుడిపై పడి, ప్రపంచ జనాభాలో పెద్ద భాగం మళ్లీ పేదరికంలో మగ్గాల్సి వస్తుందని హెచ్చరించారు.
More Stories
భారత్‌లో తొలిసారి పట్టుబడిన ‘జీహాదీ’ డ్రగ్
సింధూ జలాలపై ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పు చెల్లదన్న భారత్
బీజేపీ ఎన్నికల విజయాలపై అమెరికాలో సంబరాలు