ప్రపంచంలో అత్యంత క్రియాశీలకమైన ఉగ్రవాది, ఐసిస్ ఉగ్రసంస్థకు 2వ కమాండర్ అయిన అబు బిలాల్ అల్ మినుకిని అమెరికా సైన్యం మట్టుబెట్టింది. నైజీరియాలో ఆ దేశ సైన్యంతో కలిసి అమెరికా దళాలు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో అబు బిలాల్‌ను అంతం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. తన ఆదేశాల మేరకు అమెరికా అత్యంత పక్కా ప్రణాళికతో, వ్యూహాత్మకంగా ఈ సంక్లిష్టమైన మిషన్‌ను పూర్తి చేసినట్లు తన సొంత సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు. ఈ ఆపరేషన్కు సహకరించిన నైజీరియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
“ఈ రాత్రి నా ఆదేశాల మేరకు ధైర్యవంతమైన అమెరికా దళాలు, నైజీరియా సాయుధ దళాలు కలిసి ఐసిస్ రెండో కమాండర్ అబు- బిలాల్- అల్ మినుకిని అంతం చేశాయి. అత్యంత ప్రణాళికాబద్ధమైన, క్లిష్టమైన మిషన్‌ను విజయవంతంగా నిర్వహించాయి. ప్రపంచంలో అత్యంత చురుకైన ఉగ్రవాదుల్లో ఒకడైన అబూ-బిలాల్ అల్-మినుకీని యుద్ధభూమి నుంచి తొలగించాయి. ఆఫ్రికాలో దాక్కుంటే తాను సురక్షితమని అతడు భావించాడు. కానీ అతడు చేస్తున్న ప్రతి కదలికపై మాకు సమాచారం అందించే వనరులు ఉన్నాయని అతడికి తెలియదు” అని ట్రంప్ పోస్ట్లో పేర్కొన్నారు.
ఇకపై అతడు ఆఫ్రికా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయలేడని, అమెరికన్లపై దాడులకు ప్రణాళికలు రచించలేడని స్పష్టం చేశారు. అతడిని తొలగించడంతో ఐసిస్ గ్లోబల్ కార్యకలాపాలకు భారీ దెబ్బ తగిలిందని పేర్కొన్నారు. అయితే అల్-మినుకిని ఎలా హతమార్చారన్న విషయాన్ని ట్రంప్ వెల్లడించలేదు. 2023 జూన్‌లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో అమెరికా విదేశాంగ శాఖ అబూ-బిలాల్ అల్-మినుకిని ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించింది.
అతడు అబూబకర్ మైనోక్, అబోర్ మైనోక్ వంటి పలు మారుపేర్లతో ఐసిస్‌లో కీలక నేతగా వ్యవహరించినట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. అతడు ఐసిస్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రావిన్సెస్‌లో భాగమని, ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలకు మార్గదర్శకత్వం, నిధుల సమీకరణ బాధ్యతలు నిర్వహించే వ్యవస్థలో కీలక పాత్ర పోషించాడని తెలిపింది.

More Stories
బీజేపీ ఎన్నికల విజయాలపై అమెరికాలో సంబరాలు
ఒలింపిక్స్, తయారీ కేంద్రం, గ్రీన్ హబ్, ప్రపంచ ఆర్థిక శక్తి!
భారత్‌కు రూ.47 వేల కోట్ల పెట్టుబడులు ప్రకటించిన యూఏఈ