ఐదో తరం విమానాలు గగనంలో ఎగరబోతున్నాయి

ఐదో తరం విమానాలు గగనంలో ఎగరబోతున్నాయి
ఐదో తరం యుద్ధ విమానాల తయారీకి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వేదికైంది. రూ.15,803 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన ఐదో తరం యుద్ధ విమానాల తయారీకి అడ్వాన్స్​డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఎఎంసిఎ) ప్రాజెక్టుకు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, ముఖ్యమంత్రి  చంద్రబాబు చంద్రబాబు చేతుల మీదుగా శుక్రవారం భూమిపూజ జరిగింది. 650 ఎకరాల్లో అడ్వాన్స్​డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ, డీఆర్‌డీఓ భాగస్వామ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. ‘ఎఎంసిఎ‘ ఐదో తరం యుద్ధ విమానాల ప్రాజెక్టు ఏపీ పారిశ్రామిక ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మంది నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. కొన్నేళ్లక్రితం రక్షణ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుగా ఉండేవాళ్లమని రాజ్‌నాథ్​సింగ్ గుర్తు చేశారు.
యుద్ధసమయంలో సొంత భద్రత కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వచ్చేదని కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని చెప్పారు. గత పదేళ్లుగా చేసిన కఠోర శ్రమకు ఫలితాలు వస్తున్నాయని వెల్లడించారు. 2004లో కేవలం భారత్‌ రూ.46 వేల కోట్ల విలువైన ఆయుధ పరికరాలు తయారీ ఉండేదని, ప్రస్తుతం రికార్డు స్థాయిలో లక్షా రూ.75 వేల కోట్లకు పెరిగిందని ఆయన తెలిపారు. 
 
రక్షణ రంగంలో సంపూర్ణ స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని వెల్లడించారు. పబ్లిక్‌, ప్రైవేటు రంగాలు చేయిచేయి కలిపి నడుస్తున్నాయని పేర్కొంటూ గత పదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య అంతరాన్ని తగ్గించామని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య నమూనా రక్షణ రంగ తయారీకి ప్రజా ఉద్యమంగా మారిందని స్థానిక యువతకు అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. 
 
ఏపీ సంపూర్ణ అభివృద్ధికి దోహదపడేలా ఈ పరిశ్రమలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. 8 డ్రోన్‌ కంపెనీలు కలిసి కర్నూలులో డ్రోన్‌ సిటీ ప్రారంభానికి సిద్ధమయ్యాయని వెల్లడించారు. యుద్ధరంగంలో డ్రోన్‌ టెక్నాలజీ ఒక గేమ్‌ ఛేంజర్‌గా నిలిచిందని ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయరంగంలో కూడా డ్రోన్‌ పాత్ర కీలకంగా మారిందని చెప్పారు. ఇకనుంచి కర్నూలును డ్రోన్‌ హబ్‌గా పిలుస్తారని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తెలిపారు. ఏపీలో రూ.480 కోట్లతో భారత్‌ డైనమిక్స్ లిమిటెడ్‌ ప్రారంభిస్తున్నామని చెప్పుకొచ్చారు.
 
పుట్టపర్తి అంటే దేశం గర్వించే రక్షణ కేంద్రంగా తయారవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం గర్వకారణంగా ఉందని పేర్కొంటూ భవిష్యత్తులో పుట్టపర్తిలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. . అలాగే కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్‌ సిటీ ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.