పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలకు ఇంధన పొదుపుపై పిలుపునిచ్చిన ప్రధాని మోదీ ఇప్పుడు అదే విషయాన్ని స్వయంగా ఆచరణలో పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన అధికారిక కాన్వాయ్‌లో వినియోగించే వాహనాల సంఖ్యను 50 శాతం వరకు తగ్గించాలని ప్రధాని ఆదేశించినట్లు సమాచారం. ఇటీవల దేశ ప్రజలకు ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, అవసరమైన చోట మాత్రమే వాహనాలను ఉపయోగించాలని ప్రధాని సూచించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ప్రధాని తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను తగ్గించాలని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) అధికారులకు సూచించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా, కాన్వాయ్‌లో విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరింత పెంచాలని కూడా ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకోసం కొత్త వాహనాలను కొనుగోలు చేయకూడదని ఎస్పీజీ స్పష్టం చేసినట్లు సమాచారం. భద్రతా నిబంధనలకు ఎలాంటి భంగం కలగకుండా ఈ మార్పులను అమలు చేయాలని ఎస్పీజీకి సూచించినట్లు తెలిసింది.
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే విధానాన్ని ఫాలోకావాలని కూడా ప్రభుత్వ వర్గాలు సూచించాయి. గత ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ ప్రధాని మోదీ కొన్ని పొదుపు చర్యల గురించి వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చేపట్టిన గుజరాత్, అస్సాం పర్యటనల్లో ప్రధాని మోదీ కాన్వాయ్ సామర్థ్యం తగ్గినట్లు తెలిసింది.
విదేశీ మారకం నిల్వలను పెంచుకోవాలన్న ఉద్దేశంతో ప్రధాని మోదీ పలు రాకల పొదుపు సూచనలు చేశారు. అయితే, ప్రధాని మోదీ సెక్యూర్టీలో ఎటువంటి తరుగుదల లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సెక్యూర్టీ ఏర్పాట్లతో పాటు ఎస్పీజీ ప్రోటోకాల్స్ అన్ని పూర్తి స్థాయిలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కానీ భద్రతకు సంబంధించిన వాహనాల సంఖ్యను మాత్రం తగ్గించినట్లు వెల్లడించారు.
అస్సాం సీఎంగా హిమంత ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ప్రధాని మోదీ ప్రసంగానికి చెందిన కాపీలను పీఎంవో అక్కడికి హాజరైన ముఖ్యమంత్రులకు అందజేసింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఆ పొదుపు చర్యలను చేపట్టాలని పీఎంవో కోరింది. విద్యుత్ వాహనాల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం తన కార్యాచరణలో భాగంగా కోరింది. వర్చువల్ మీటింగ్‌లపై ఆధారపడాలని పేర్కొన్నది.
కాగా ప్రధాని పిలుపు మేరకు డిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సహా ఇతర మంత్రులు కూడా తమ అధికారిక కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను ఇప్పటికే తగ్గించారు. ఇతర ప్రభుత్వ శాఖలు కూడా ఈ తరహా పొదుపు చర్యలకు సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తోంది. ఇంధన పొదుపు కోసం ఏయే చర్యలు తీసుకోవాలనే దానిపై పలు శాఖలు సమీక్షలు జరుపుతున్నాయి.

More Stories
నీట్ ప్రశ్నాపత్రం లీక్ నాసిక్ నుంచే.. ఒక వ్యక్తి అరెస్ట్
సువేందు అధికారి పిఎ హత్య కేసు సీబీఐకి అప్పగింత
పాక్ కు మద్దతుపై చైనాకు భారత్ చురకలు