వైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం ఈ నెల 3న నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) పేపర్ లీక్ అయినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్న పత్రంలోని 100 ప్రశ్నలు పరీక్షకు ముందే మార్కెట్లో లభ్యమైనట్టు వస్తున్న ఆరోపణలపై రాజస్థాన్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్‌వోజీ) దర్యాప్తు ప్రారంభించింది.
భారత్‌తోపాటు విదేశాల్లోని 22.79 లక్షలమందికి పైగా విద్యార్థులు ఈ ఏడాది నీట్ రాశారు. పేపర్ లీక్ అయినట్టు వస్తున్న ఆరోపణలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సోమవారం సుదీర్ఘ వివరణ ఇచ్చింది. పరీక్ష నిర్వహణలో ఎటువంటి అవకతవకలు జరుగలేదని, పూర్తి భద్రతా ఏర్పాట్ల మధ్య పరీక్ష నిర్వహించామని పేర్కొంది.
నీట్ పరీక్షలో విద్యార్థులు ఎదుర్కొన్న ప్రశ్నలను పోలిన 100 ప్రశ్నలు పరీక్ష జరగడానికి ముందే సర్క్యులేట్ అయినట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని రాజస్థాన్ ఎస్‌వోజీ తెలిపింది. తమ దర్యాప్తులో భాగంగా పరీక్ష జరగడానికి ముందు సర్క్యులేట్ అయిన ఒక బుక్‌లెట్‌ను స్వాధీనం చేసుకున్నామని అందులో 400కు పైగా ప్రశ్నలున్నాయని దర్యాప్తు అధికారులు చెప్పారు.
వాటిలో బయాలజీ, కెమిస్ట్రీకి సంబంధించిన 100 ప్రశ్నలున్నాయని, అవి నీట్ పరీక్షలో వచ్చిన ప్రశ్నలకు చాలా దగ్గరగా ఉన్నాయని వివరించారు. ఇది కేవలం యాదృచ్చికమని, లీకేజీ కాకపోవచ్చని అధికారులు అంటున్నారు. ఆ బుక్‌లెట్ కోచింగ్ సెంటర్లు రూపొందించిన గెస్ పేపర్, స్టయిల్ టెస్ట్ సిరీస్ అయి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఈ వివాదంపై రాజస్థాన్ ఎస్ఒజి అదనపు డైరెక్టర్ జనరల్ విశాల్ బన్సల్ మాట్లాడుతూ “ఈ గెస్ పేపర్ విషయంలో ఏదైనా మోసం లేదా నేరపూరిత కార్యకలాపాలు జరిగాయా అని మేం దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటివరకు ఎటువంటి అరెస్టులూ చేయలేదు” అని తెలిపారు. కాగా దీని వెనుక ఒక సంఘటిత నెట్‌వర్క్ ఉండవచ్చని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ఇప్పటికే రాజస్థాన్‌లోని పలు నగరాలు, ఉత్తరాఖండ్‌లో సైతం సోదాలు నిర్వహించామని తెలిపారు.

More Stories
సుప్రీంకోర్టుకు చేరిన బెంగాల్ ఓటర్ల జాబితా వివాదం
జులై 1 నుంచి వీబీజీ రామ్‌జీ పథకం అమలు
బినామీ పేరిట ఆస్తుల కొనుగోలు చట్టవిరుద్ధం