ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పీఎం గతిశక్తి కార్యక్రమానికి కొనసాగింపుగా ‘ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియా’ అయిన హైదరాబాద్ నుంచి ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (జెఎన్ పిటి) కు ఔషధాలను సరఫరా చేసేందుకు మే 2వ తేదీన ‘ఔషధి ఎక్స్‌ప్రెస్’ పేరుతో దేశంలోనే తొలి ప్రత్యేక ఫార్మసీ రైలును ప్రారంభించడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఈ మొదటి రెగ్యులర్ ‘ఔషధి ఎక్స్‌ప్రెస్’ ప్రత్యేక రైలును తెలంగాణకు కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లకు ధన్యవాదములు తెలిపారు. కీలకమైన ఫార్మాకంపెనీలకు కేంద్రమైన హైదరాబాద్‌లో తయారయ్యే ఫార్మా ప్రొడక్ట్స్‌ను, భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించడంతో పాటుగా అంతర్జాతీయంగా పంపిణీ చేసేందుకు ముంబై సమీపంలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ కు తరలించడం తప్పనిసరి అని తెలిపారు.
అందుకే హైదరాబాద్‌ను, జెఎన్ పిటికు అనుసంధానిస్తూ ఈ ప్రత్యేక రీఫర్ రైలు (కోల్డ్ స్టోరేజ్ వసతి గల రైలు)ను ప్రారంభించడం హైదరాబాద్ ఫార్మా కంపెనీలకు చాలా మేలు జరగనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతోపాటుగా దేశవ్యాప్తంగా, వివిధ దేశాలకు సరైన సమయంలో ఔషధాలను చేరవేసేందుకు వీలు కలుగుతుందని చెప్పారు.
హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ, జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా, పటాన్‌చెరులోని ఫార్మా జోన్, ముచ్చర్ల లోని ఫ్యూచర్ సిటీ తదితర ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే ఫార్మా ప్రొడక్ట్స్ సరఫరాకు ఈ రైలు చాలా కీలకం కానుందని తెలిపారు. దేశవ్యాప్తంగా తక్కువ ఖర్చులో వస్తు రవాణా జరగడంతోపాటుగా సుస్థిరమైన, పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థను ప్రోత్సహించేలా మోదీ ప్రభుత్వం రూ.100 లక్షల కోట్ల వ్యయంతో పీఎం గతిశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఆయన గుర్తు చేశారు.
ఫ్రీజర్ ఫెసిలిటీ లేకపోతే చాలా వరకు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ నాణ్యత తగ్గుతుంది కాబట్టి హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో తయారయ్యే మందులను వాటి నాణ్యత తగ్గకుండా సరఫరా చేయాలనేది మోదీ సర్కారు సంకల్పం అని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థ అయిన కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న సనత్ నగర్ లోని ఇన్ ల్యాండ్ కంటైనర్ డిపో నుండి ఈ ప్రత్యేక రైలు సేవలు అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
‘ఔషధి ఎక్స్‌ప్రెస్’గా నామకరణం చేసిన ఈ రెఫ్రిజిరేటర్ రైలు ద్వారా లైఫ్ సేవింగ్ మందులతో పాటు అవసరమైన ఇతర సరుకులను కూడా రవాణా చేయనున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రయాణిస్తున్న సమయంలో.. కంటిన్యూయస్ రిఫ్రిజిరేషన్ ఉండేందుకు డీజిల్ పవర్ ప్యాక్‌లతో కూడిన అధునాతన రీఫర్ కంటైనర్లను వినియోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఇది మన కోల్డ్-చైన్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడంతో పాటుగా మన ఫార్మాసూటికల్స్ సప్లయ్ చైన్ కెపాసిటీని పెంచేందుకు కీలకమైన ముందడుగు కానుందని తెలిపారు.ప్రస్తుతానికి వారానికి ఒకసారి నడుస్తున్న ఈ ‘ఔషధి ఎక్స్‌ప్రెస్’ను డిమాండ్, వాణిజ్య వర్గాల అవసరాలకు అనుగుణంగా వారానికి రెండుసార్లు నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.
స్పెషల్ రీఫర్ రేక్స్ సర్వీసు కారణంగా నాణ్యత తగ్గకుండా, ఎక్కువ రవాణా సమయం పట్టకుండా, తక్కువ ఖర్చులతో సప్లయ్ చైన్ బలోపేతం అవుతుందని భరోసా వ్యక్తం చేశారు.

More Stories
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా విజయలక్ష్మి!
పళనిస్వామిపై అన్నాడీఎంకే ఎమ్యెల్యేల్లో తిరుగుబాటు
తీవ్రమైన ఇంధన సంక్షోభంలో ఆసియా దేశాలు