సరఫరా గొలుసులను కాపాడటానికి, ఇంధన సరఫరాలకు అంతరాయం కలగకుండా చూసేందుకు భారత్ పటిష్ఠమైన చర్యలు చేపట్టిందని పేర్కొంటూ భారత్ వద్ద 60 రోజులకు సరిపడా ముడి చమురు, సహజ వాయువు, 45 రోజుల ఎల్‌పీజీ నిల్వలు ఉన్నాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. భారతదేశ విదేశీ మారక నిల్వలను పరిరక్షించే ప్రయత్నాల్లో భాగంగా ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిని అమలు చేసేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని రాజ్‌నాథ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
“దేశీయ ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోవడానికి ఇతర దేశాలు అత్యవసర చర్యలు తీసుకున్నాయి. అయితే ఇంధన వినియోగం విషయంలో మాత్రం భారత్ సురక్షిత స్థానంలో ఉంది. ఏ పెట్రోలియం ఉత్పత్తి కొరత దేశంలో లేదు. భారత్ వద్ద 60 రోజులకు సరిపడా ముడి చమురు, నేచురల్ గ్యాస్, 45 రోజులకు సరిపడా ఎల్‌పీజీ నిల్వలు ఉన్నాయి” అని తెలిపారు.
విదేశీ మారక నిల్వలు 703 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయని చెబుతూ భారత్ నాలుగో అతిపెద్ద పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతిదారు అని, ఇండియా 150కి పైగా దేశాలకు పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి చెప్పారు. దేశీయ డిమాండ్‌ను పూర్తిగా తీరుస్తోందని, కానీ అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు చాలా అధిక స్థాయిలో కొనసాగుతున్నందున దేశం చాలా భారాన్ని మోస్తోందని పేర్కొన్నారు.
ఇంధన పొదుపు ఈ భారాన్ని తగ్గిస్తుందని, అయితే, ఇంధన కొరతపై ప్రజలు భయాందోళనలకు గురికావొద్దని, ప్రశాంతంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఇంధన సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా చూడటం, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడం, సముద్ర వాణిజ్య మార్గాలు సురక్షితంగా ఉండేలా చూడటం భారత్ ప్రధాన లక్ష్యమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ వెల్లడించారు.
ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భవిష్యత్ ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకుని సరఫరా గొలుసు అంతరాయాల వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి వ్యూహాత్మక నిల్వల అవసరాలను పునర్ పరిశీలించాలని పిలుపునిచ్చారు. పశ్చిమాసియా సంక్షోభాన్ని కేవలం ఒక ప్రత్యేక సంఘటనగా చూడకూడదని స్పష్టం చేశారు.
ఎందుకంటే నేటి పరస్పర అనుసంధాన ప్రపంచ వాతావరణంలో ఏ రకమైన అంతర్జాతీయ సంక్షోభమైనా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అన్ని దేశాలను ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు. పశ్చిమాసియాలో సంఘర్షణ మొదలై 70 రోజులకు పైగా గడిచినా, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఈ అస్థిరత కాలంలో కూడా పెట్రోలియం ధరలు స్థిరంగా ఉన్న అతికొద్ది దేశాలలో భారత్ ఒకటని ఆయన గుర్తు చేశారు.
అనేక దేశాలలో పెట్రోలియం ధరలు 30-70 శాతం వరకు పెరిగాయని, అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆకాశాన్నంటుతున్న ధరల భారం భారత పౌరులపై పడకుండా ఉండేందుకు భారతదేశపు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజుకు దాదాపు రూ. 1,000 కోట్ల నష్టాలను భరించాయని తెలిపారు. అయితే ఇంధన కొరతపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు దేశంలో సమృద్ధిగా ఉన్నాయని భరోసా ఇచ్చారు.

More Stories
మే 15 నుంచి 20 వరకు ప్రధాని మోదీ ఐదు దేశాల్లో పర్యటన
పళనిస్వామిపై అన్నాడీఎంకే ఎమ్యెల్యేల్లో తిరుగుబాటు
తీవ్రమైన ఇంధన సంక్షోభంలో ఆసియా దేశాలు