* కొత్త లేబర్ కోడ్లపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్
వారానికి 48 గంటల పని పరిమితి, తప్పనిసరిగా వారానికొక విశ్రాంతి దినం, ఓవర్‌టైమ్ పనికి అదనపు చెల్లింపుపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లను జారీచేసింది. దీంతో గతంలో నాలుగు కార్మిక కోడ్లలో చేసిన ఈ ప్రతిపాదనలు అధికారిక హోదాను పొందాయి. దేశవ్యాప్తంగా కంపెనీలు వీటిని ఇక కచ్చితంగా పాటించాల్సిందే. వాస్తవానికి నాలుగు కార్మిక కోడ్లు 2025 నవంబరు 21 నుంచే అమల్లోకి వచ్చాయి.
అయితే మే 8, 9 తేదీల్లో వాటికి సంబంధించిన తుది నిబంధనలు, నియమాలతో కేంద్ర ప్రభుత్వం దాదాపు 30 అధికారిక గెజిట్లను ప్రచురించింది. దీంతో ఈ కార్మిక సంస్కరణల ప్రక్రియ పూర్తయింది. కేంద్ర సర్కారు తాజాగా ప్రచురించిన గెజిట్ నోటిఫికేషన్లలోని అత్యంత కీలకమైన అంశం కార్మికుల కనీస వేతనం.
కేంద్రం తొలుత విడుదల చేసిన నాలుగు కార్మిక కోడ్ల ముసాయిదాలో కనీస వేతనాన్ని ఎలా లెక్కించాలి అనే దానిపై స్పష్టమైన ఫార్ములాను, ప్రమాణాలను పేర్కొంది. కానీ, తాజాగా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లలోని తుది నిబంధనలలో ఆ లెక్కింపు సూత్రాన్ని ప్రభుత్వం తొలగించింది. దీనికి బదులుగా, కనీస వేతన ప్రమాణాలను భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక లేదా సాధారణ ఉత్తర్వు ద్వారా విడిగా ప్రకటిస్తుందని స్పష్టంచేసింది.
కనీస జీవన ప్రమాణం, దుస్తులు, గృహవసతి వంటి వాటితో పాటు సముచితంగా భావించే ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎప్పటికప్పుడు కనీస వేతనాన్ని నిర్ణయిస్తామని కేంద్ర ప్రభుత్వం కొత్త వేతన నిబంధనలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 29 పాత కార్మిక చట్టాలను రద్దు చేసి, తీసుకొచ్చిన నాలుగు కొత్త కార్మిక కోడ్లలో ‘వేతనాల కోడ్ 2019’ అనేది అత్యంత ముఖ్యమైన మొదటి కోడ్.
ఈ వేతనాల కోడ్‌లోని సెక్షన్ 9 అనేది కేంద్ర ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో ‘ఫ్లోర్ వేజ్’ (కనీస ప్రాథమిక వేతనం)ను నిర్ణయించే చట్టపరమైన అధికారాన్ని ఇస్తుంది. దీని ప్రకారం, దేశంలోని వివిధ భౌగోళిక ప్రాంతాలకు వేర్వేరు కనీస వేతనాలను కేంద్ర సర్కారు నిర్ణయించొచ్చు.
కనీస ప్రాథమిక వేతనం (ఫ్లోర్ వేజ్) నిర్దిష్ట తుది మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదు. ఒక సెంట్రల్ అడ్వైజరీ బోర్డు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే దీనిపై తుది నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది.
కేంద్రం ఒకసారి ఫ్లోర్ వేజ్ను ప్రకటిస్తే, దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ రాష్ట్ర కార్మికులకు అంతకంటే తక్కువ కనీస వేతనాన్ని నిర్ణయించడానికి వీలు ఉండదు. రాష్ట్రాలు తమ పరిధిలో కనీస వేతన చట్టాలను చేసేటప్పుడు కేంద్ర ఫ్లోర్ వేజ్ను ఒక ప్రాథమిక బెంచ్‌మార్క్‌గా కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.

More Stories
నైతిక ఉల్లంఘనలపై 1,000 మందిని తొలగించిన ఎయిర్ ఇండియా
కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచిన కంపెనీలు
రూ.100 కోట్ల పిఎంఎల్ఏ కేసులో పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరా అరెస్ట్