సువేందు అధికారి పీఏ హత్యలో ముగ్గురు షార్ప్​షూటర్లు అరెస్టు

సువేందు అధికారి పీఏ హత్యలో ముగ్గురు షార్ప్​షూటర్లు అరెస్టు
పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ హత్య కేసులో పోలీసులు ఈ దారుణ ఘటనకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.  ఉత్తరప్రదేశ్​కు చెందిన ముగ్గురు షార్ప్​షూటర్లను పోలీసులు అరెస్టు చేశారు.  అత్యంత ప్రణాళికాబద్ధంగా చేసిన ఈ హత్యకు బిహార్​తో లింకులు ఉన్నాయని, డిజిటల్ ఆర్థిక లావాదేవీలు, వ్యవస్థీకృత నేరగాళ్ల హస్తం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
 
పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, బీహార్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించి విశాల్ శ్రీవాస్తవ, రాజ్ సింగ్, మయాంక్ మిశ్రాలను అదుపులోకి తీసుకున్నారు. కోల్‌కతా సమీపంలోని ‘బ్యాలీ’ టోల్ ప్లాజా వద్ద నిందితులు చేసిన యూపీఐ పేమెంట్‌ పోలీసులు ఈ కేసును ఛేదించడంలో కీలకపాత్ర పోషించింది. 
“డిజిటల్ చెల్లింపు ద్వారా ఒక అనుమానితుడి మొబైల్ నంబర్​ను పోలీసులు కనిపెట్టడం జరిగింది. అంతేకాదు టోల్​ ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్​లో కారు, అందులోని వ్యక్తులు స్పష్టంగా కనిపించడంతో దర్యాప్తునకు బలమైన ఆధారాలు లభించాయి. టోల్ రికార్డులు, మొబైల్​ టవర్​ లొకేషన్లు, ఆర్థిక లావాదేవీలను విశ్లేషించాం. దాడి తర్వాత దుండగులు సిల్వర్​ కారును వదిలేసి, ఎరుపు రంగు కారు, మోటార్​ సైకిళ్లపై పారిపోయారు” అని పోలీసులు తెలిపారు. 
 
పశువుల అక్రమ రవాణా, బొగ్గు మాఫియా నెట్​వర్క్​కు సంబంధించిన కీలక ఫైళ్లు చంద్రనాథ్​ వద్ద ఉండడమే ఈ హత్యకు కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు తెరదించుతూ బీజేపీ సర్కార్ ఏర్పడిన రెండు రోజులకే ఈ హత్య జరగడం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపింది. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. ​

గత బుధవారం రాత్రి 10 గంటల సమయంలో చంద్రనాథ్ రథ్ తన ఇంటికి కేవలం 200 మీటర్ల దూరంలో ఉండగా ఈ హత్య జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న మహీంద్రా స్కార్పియో వాహనం ముందు ప్యాసింజర్ సీటులో కూర్చుని ఉండగా దుండగులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు.  పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం మొదట సిల్వర్ రంగు నిస్సాన్ మైక్రా కారుతో రథ్ ఎస్‌యూవీని అడ్డగించారు. ఆ వెంటనే బైక్‌పై వచ్చిన హంతకులు ఆయనపై కాల్పులు జరిపారు. అనంతరం ఆ కారును అక్కడే వదిలేసి మరో ఎరుపు రంగు కారు, బైక్‌పై పరారయ్యారు.

సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితులు వాడిన మైక్రా కారును గుర్తించారు. ఆ కారు కోసం ఓ టోల్ ప్లాజా వద్ద యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించినట్లు తేలింది. ఆ చెల్లింపు ఆధారంగా నిందితుల వివరాలు సేకరించిన పోలీసులు వారిని బీహార్, ఉత్తర ప్రదేశ్‌లలో అరెస్ట్ చేశారు. పట్టుబడిన ముగ్గురూ వృత్తిపరమైన హంతకులని, వీరిలో విశాల్ శ్రీవాస్తవపై హత్య, దోపిడీ సహా 15కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిందితులను సోమవారం బారాసాత్ కోర్టులో హాజరుపరచనున్నారు.