రామాలయం విరాళాల చోరీపై సిట్ నివేదిక కోరిన సుప్రీం

రామాలయం విరాళాల చోరీపై సిట్ నివేదిక కోరిన సుప్రీం
అయోధ్య రామాలయం విరాళాల చోరీపై దర్యాప్తు పురోగతి నివేదికను సమర్పించాలని సిట్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. విరాళాల చోరీ వ్యవహారంపై తగిన వివరణ ఇవ్వాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు, ఇంకా కేంద్రానికి కూడా నోటీసులు జారీ చేసింది.  రామాలయంలో భక్తులు సమర్పించిన కానుకల చోరీ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున హాజరైన భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, స్టేటస్ రిపోర్ట్‌ను సీల్డ్ కవర్‌లో దాఖలు చేస్తామని తెలిపారు. ఈ కేసును తదుపరి విచారణ కోసం జూలై 20కి వాయిదా వేశారు. ఆ రోజు కోర్టు పిటిషన్లను పరిగణనలోకి తీసుకుని, సిట్ నివేదికలోని అంశాలను పరిశీలిస్తుంది.  ముగ్గురు పిటిషనర్లలో ఒకరైన నరేంద్ర కుమార్ గోస్వామి, ఈ విషయంలో సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
రామమందిర వ్యవహారాలను నిర్వహించే శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆడిట్ చేయాలని కూడా ఆయన కోరారు.  అజయ్ కుమార్ రాయ్, దినేష్ కుమార్ యాదవ్ కూడా ఇలాంటి చర్యలనే కోరుతూ రెండవ పిటిషన్‌ను దాఖలు చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ కోరడంతో పాటు, ఆలయ ట్రస్ట్ మొత్తం ఆర్థిక వ్యవహారాలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ దాఖలు చేసిన మూడవ పిటిషన్‌లో కోరారు.
ఆలయ ట్రస్ట్ వ్యవహారాలు, పరిపాలనకు సంబంధించిన ఆర్థిక అవకతవకలు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సీబీఐ నేతృత్వంలో దర్యాప్తు చేయాలని కోరారు. కోట్లాది మంది భక్తులు, దాతల విశ్వాసాన్ని నిలబెట్టడానికి అవసరమైన నియంత్రణ, పర్యవేక్షణ, ఆడిట్ యంత్రాంగాలను ఏర్పాటు చేసే విధంగా కేంద్రం, యూపీ ప్రభుత్వం, ట్రస్ట్‌కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో వివరించారు. 

ఎఫ్‌ఐఆర్ లేదా సాధారణ క్రిమినల్ కేసు కూడా నమోదు చేయకుండానే సిట్ ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించిందని పిటిషనర్లు ఆక్షేపించారు. ట్రస్ట్‌కు సంబంధించి నిధుల దుర్వినియోగం, ఇతర అవకతవకలకు సంబంధించిన నివేదికలు చివరికి నిజమని తేలినా, తేలకపోయినా, అవన్నీ అయోధ్య పూర్వ వైభవాన్ని పునరుద్ధరణకు పోరాడిన తరాల్లో తీవ్ర ఆందోళనను కలిగించాయని తెలిపారు. 

ఇందులో ఉన్న అంశాలు కేవలం ‘కాగ్నిజబుల్’ (పోలీసులు స్వయంగా కేసు నమోదు చేసే) నేరాలకు సంబంధించినవి మాత్రమే కాదని, అసంఖ్యాక భక్తులు, ప్రజల విశ్వాసం, మనోభావాలు, నమ్మకాలపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని తెలిపారు.