ప్రొఫెసర్ యశ్వంతరావు కేల్కర్ అనుసరించిన విశిష్టమైన పని విధానం ద్వారా, అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) సైద్ధాంతిక స్పష్టత, సంస్థాగత దార్శనికత, కార్యకర్తలను తీర్చిదిద్దే ఒక ప్రత్యేకమైన పద్ధతి లభించాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే తెలిపారు. ఇవే ఎబివిపికి దేశవ్యాప్తంగా బలమైన ఉనికిని కల్పించాయని, దేశ నిర్మాణంలో విద్యార్థి శక్తిని ఒక కీలకమైన బలంగా నిలపడంలో ఆయన అగ్రగామి పాత్ర పోషించారని చెప్పారు.
ఎబివిపికి సంస్థాగత రూపకర్తగా, మాజీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించిన ప్రొఫెసర్ యశ్వంతరావు కేల్కర్ జన్మ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఎబివిపి ఢిల్లీ విభాగం డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ సివిక్ సెంటర్లో ‘ప్రియ కేల్కర్ జీ’ పేరిట నిర్వహించిన ఒక ప్రత్యేక స్మారక కార్యక్రమంలో హోసబలే ముఖ్యఅతిధిగా పాల్గొన్నా రు. జాతీయతా భావనతో కూడిన విద్యార్థి ఉద్యమానికి ఒక జాతీయవాద చింతకుడిగా, సంస్థాగత రూపకర్తగా, అపారమైన స్ఫూర్తి వనరుగా నిలిచిన ప్రొఫెసర్ యశ్వంతరావు కేల్కర్ 1925 ఏప్రిల్ 25న మహారాష్ట్రలోని పండర్పూర్ (సోలాపూర్)లో జన్మించారు.
తన విద్యార్థి దశ నుండే దేశ సేవను తన జీవిత లక్ష్యంగా భావించిన కేల్కర్ 1945లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్‌గా మారారు. 1955లో, ఆయన నేషనల్ కాలేజీలో ఆంగ్ల ఆచార్యుడిగా బోధన ప్రారంభించారు. అదే సమయంలో సంఘ్ ఆదేశాల మేరకు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ కోసం పనిచేయడం మొదలుపెట్టారు. ఆయన అనుసరించిన విశిష్టమైన పని విధానం ద్వారా దేశ నిర్మాణంలో విద్యార్థి శక్తిని ఒక కీలకమైన బలంగా నిలపడంలో ఆయన అగ్రగామి పాత్ర పోషించారు.
ఈ కార్యక్రమం సందర్భంగా, పూణేకు చెందిన మిలింద్ భాడ్గే నేతృత్వంలోని ఒక కళా బృందం ‘ప్రియ కేల్కర్ జీ’ పేరిట ఒక ప్రభావవంతమైన ప్రదర్శనను ఇచ్చింది. ఈ ప్రదర్శనలో ప్రొఫెసర్ కేల్కర్ జీవిత విశేషాలు, ఆయన ఆలోచనా విధానం, సంస్థాగత పని పద్ధతులను అద్భుతంగా చిత్రించి చూపించారు. ఈ ప్రదర్శనలో, ప్రొఫెసర్ కెల్కర్ జీ తన జీవితాంతం మూర్తీభవించిన ఏబీవీపీ పనితీరు శైలి, వివరంగా, ముందుగానే ప్రణాళిక వేసుకోవడం, సమయ నిర్వహణ, క్రమశిక్షణ, సామూహిక కార్యాచరణ, చైతన్యవంతమైన కేడర్ నిర్మాణ పద్ధతిని ప్రముఖంగా ప్రస్తావించారు.
దత్తాత్రేయ హోసబలే మాట్లాడుతూ, “యశ్వంతరావు కెల్కర్ డాక్టర్ హెడ్గేవార్ వారసత్వానికి నిజమైన వారసులని బాలాసాహెబ్ దేవరస్ చెప్పేవారు. ఏబీవీపీకి పటిష్టమైన పునాది వేసిన సంస్థాగత సూత్రాలను ప్రొఫెసర్ కెల్కర్ అందించారు. ఏబీవీపీ కేవలం ఆందోళనలకే పరిమితం కాకుండా, నిర్మాణాత్మక పని, ప్రాతినిధ్యం, దేశ నిర్మాణం వైపు నడిపించేలా ఆయన చూసుకున్నారని చెప్పారు.
బృంద స్ఫూర్తి, సమయపాలన, సరళత, వనరుల సరైన వినియోగం, ఆప్యాయమైన సంస్థాగత పద్ధతి ద్వారా ప్రొఫెసర్ కెల్కర్ సంస్థాగత జీవితానికి ఒక ఆదర్శ నమూనాని అందించారని కొనియాడారు. ఆయన ఎలాంటి అసూయ లేదా కక్ష లేకుండా అందరినీ ఏకతాటిపైకి తెచ్చిన వ్యక్తిత్వం అని పేర్కొంటూ ఆయన జీవితం కార్యకర్తలకు శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు.
ఏబీవీపీ సంస్థాగత పద్ధతి, జీవిత దృక్పథాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ఆయన “ప్రొఫెసర్ యశ్వంతరావు కెల్కర్ తో కలిసి పనిచేస్తున్నప్పుడు, ఏబీవీపీలో జీవితం పట్ల నాకు ఒక దార్శనికత లభించింది. అది నన్ను సంఘంలో మరింతగా పోషించి, సుసంపన్నం చేసింది” అని పేర్కొన్నారు.
ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ రఘురాజ్ కిషోర్ తివారీ మాట్లాడుతూ, “ప్రొఫెసర్ యశ్వంతరావు కెల్కర్ జీవిత ప్రయాణం ప్రతి కార్యకర్తకు ఒక ఆదర్శం. ఈ రోజు దేశవ్యాప్తంగా ఏబీవీపీ అనుసరిస్తున్న కార్యాచరణ పద్ధతిని ప్రొఫెసర్ కెల్కర్ ప్రసాదించారు. ఒక కార్యకర్త జీవితంలో మాటలకు, చేతలకు మధ్య భేదం ఉండకూడదని ఆయన జీవితం మనకు బోధిస్తుంది” అని తెలిపారు.
ఏబీవీపీ మాజీ జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ రాజ్‌కుమార్ భాటియా మాట్లాడుతూ మనం ప్రొఫెసర్ కెల్కర్ వ్యక్తిత్వాన్ని, ఏబీవీపీ కార్యాచరణ పద్ధతిని అర్థం చేసుకోవాలనుకుంటే, ఆయన జీవితం, ఆలోచనలపై ఆధారపడిన సాహిత్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం చాలా అవసరం అని చెప్పారు. ప్రొఫెసర్ కెల్కర్ ఏబీవీపీని వ్యక్తిత్వ వికాసానికి ఒక కార్యశాలగా భావించారని చెప్పారు.
అఖిల్ భారతీయ ఛాత్ర కార్య ప్రముఖ్ మను శర్మ కటారియా, ఎబివిపి ఢిల్లీ అధ్యక్షుడు డాక్టర్ తపన్ బిహారీ, ఢిల్లీ కార్యదర్శి సార్థక్ శర్మ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీనియర్ ఆర్ఎస్ఎస్ ప్రచారకులు, వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, రిజిస్ట్రార్లు, ఆచార్యులు, ఢిల్లీ శాసనసభ స్పీకర్, ఢిల్లీ ప్రభుత్వ మంత్రులు, సంఘ్ అనుబంధ సంస్థల కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు కూడా హాజరయ్యారు.

More Stories
ఏఐఎంఐఎం ఒక ఉగ్రవాద సంస్థ.. నిషేధించాలి
ప్రతిపక్షాల ఐక్యతకై మమతా పిలుపును తిరస్కరించిన కాంగ్రెస్, లెఫ్ట్
తెలంగాణలో ఈసారి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే