అమెరికాలో ఈత కొలనులో మునిగి హైదరాబాద్ యువతి మృతి

అమెరికాలో ఈత కొలనులో మునిగి హైదరాబాద్ యువతి మృతి
* పాట్నా ఐఐటీ క్యాంపస్‌లో క్రికెట్ ఆడుతూ హైదరాబాద్ విద్యార్థి మృతి 
 
అమెరికాలో ప్రమాదవశాత్తూ స్విమ్మింగ్ పూల్‌‍లో మునిగి తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయింది. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని లింగోజిగూడలో నివసించే దేవేందర్ రెడ్డి, సునీతల కుమార్తె వీణ వర్జీనియాలో నివాసం ఉంటున్నారు. ఓ ఫంక్షన్ కోసం వీణ రెండు రోజుల కిందట ఫ్లోరిడాకు వెళ్లారు. అక్కడే ప్రమాదవశాత్తూ స్వి్మ్మింగ్ పూల్‌లో పడి చనిపోయారు. ఈ విషయం తెలిసి వీణ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
 
వీణ బీటెక్ పూర్తి చేసింది. చంపాపేట డివిజన్‌కు చెందిన ప్రశాంత్‌రెడ్డి అనే వ్యక్తితో 2023 జూన్‌ 1వ తేదీన పెళ్లి జరిగింది. అమెరికాలోని వర్జీనియా ప్రాంతంలో ప్రశాంత్‌రెడ్డి నివాసముంటున్నాడు. వివాహమైన రెండు నెలలకే ఆగస్టులో భార్యను తీసుకొని అమెరికాకు వెళ్లారు. వీణ ఇన్యూరెన్స్​ కంపెనీలో వర్క్‌ఫ్రం హోం విధానంలో పనిచేస్తోంది.  ఇటీవల అక్కడే నూతన గృహాన్ని కొనుగోలు చేశారు.
పాలు పొంగించి నివాసముంటున్నప్పటికీ వచ్చేనెల 5న నూతన గృహప్రవేశ కార్యక్రమం చేయాలనుకున్నారు. అదే విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో కుమార్తె, అల్లుడికి నూతన వస్త్రాలను కొనుగోలు చేశారు. పలు రకాల పిండి వంటలు సిద్ధం చేసుకున్నారు. గృహ ప్రవేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు.  ఇంతలోనే అంతులేని విషాదం నెలకొంది.   తన కుమార్తెకు స్విమ్మింగ్ వచ్చని అయినా మృతి చెందడం అనుమానస్పదంగా ఉందని మృతురాలి తండ్రి దేవేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. 
 
మరోవంక, బిహార్‌లోని పట్నా ఐఐటీ క్యాంపస్‌లో క్రికెట్ ఆడుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ పోల్ తాకి, కరెంట్ షాక్ కొట్టటంతో హైదరాబాద్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. పట్నా ఐఐటీ క్యాంపస్‌లో కొంతమంది క్రికెట్ ఆడుతున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.  హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన హర్షిత్ రాజ్ అనే విద్యార్థి పట్నా ఐఐటీలో ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్నారు. క్యాంపస్‌లో క్రికెట్ ఆడుతున్న సమయంలో అనుకోకుండా ప్రమాదవశాత్తూ స్తంభాన్ని తాకారు. దీంతో కరెంట్ షాక్ కొట్టి చనిపోయినట్లు క్యాంపస్ వర్గాలు వెల్లడించాయి.