టివికె అధినేత విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వామపక్షాలు మద్దతు చెప్పినప్పటికీ ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఇంకా ప్రభుత్వం ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో శనివారం జరుగుతుందన్న విజయ్ ప్రమాణ స్వీకార కార్య్రకమం సందిగ్దంలో పడింది. అంతకుముందు వామపక్షాల మద్దతు ప్రకటనతో విజయ్ ప్రమాణ స్వీకారానికి అంతా సానుకూలంగా కనిపించింది.
వామపక్షాల ప్రకటన అనంతరం లోక్‌భవన్‌కు వెళ్లిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను మూడో సారి కోరారు. సంఖ్యాబలానికి రుజువుగా టివికె సభ్యులతో పాటు, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, విసికె పార్టీల సభ్యుల పేర్లను అందజేశారు. మెజార్టీ మార్కును అందుకున్నందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీనికి గవర్నర్ నుండి సానుకూల స్పందన కూడా వ్యక్తమైంది.
దీంతో శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయడానికి సన్నాహాలను కూడా ప్రారంబించారు. వివిధ పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానించారు. వీసీకే, ఐయూఎంఎల్ టీవీకేకు మద్దతు తెలిపాయని, దీంతో టీవీకే బలం 120కు చేరుకుందని, శనివారం ఉదయం 11 గంటలకు విజయ్ సీఎంగా ప్రమాణం చేస్తారని అంతకుముందు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
లోక్‌భవన్ వర్గాల కథనం ప్రకారం శుక్రవారం సాయంత్రం గవర్నర్‌ను కలసిన విజయ్ 116 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన మద్దతు సంతకాలను సమర్పించారు. అయితే వీసీకే, ఐయూఎంఎల్‌కు చెందిన అధికారిక లేఖలను సమర్పించలేదు. ఆ లేఖలను కొద్ది సేపట్లో సమర్పిస్తానని విజయ్ చెప్పినట్లు సమాచారం. మిగిలిన మద్దతు లేఖలు అందిన వెంటనే ప్రమాణ స్వీకారం గురించి గవర్నర్ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని ఆ వర్గాలు చెప్పాయి.
అయితే టీవీకేకు తాము మద్దతు ఇవ్వడం లేదంటూ ఐయూఎంఎల్ రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. డీఎంకే సారథ్యంలోని కూటమితోనే కొనసాగుతామని ఐయూఎంఎల్ ప్రకటించింది. మరోవైపు టివికెకు మద్దతు ఇవ్వడానికి విసికె డిప్యూటీ ముఖ్యమంత్రి పదవితో పాటు, మంత్రి పదవిని కూడా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. టీవీకేకు మద్దతుపై శనివారం తమ నిర్ణయం ప్రకటిస్తామని వీసీకే శుక్రవారం రాత్రి ప్రకటించింది. ఒక వైపు టివికెతో చర్చలు జరుపుతూ మరోవైపు డిఎంకె అధినేత స్టాలిన్‌తో కూడా టచ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో విజయ్ ప్రమాణ స్వీకారం మరోసారి సందిగ్ధంలో పడింది.
మరోవంక, రాష్ట్రంలో ప్రభుత్వఏర్పాటుకు అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన టివికెను ఆహ్వానించాలని కోరుతూ ఆ పార్టీ సభ్యుడు ఎజిలరశి కె శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విజయ్‌ను ఆహ్వానించడంలో గవర్నర్ విఫలమవడం రాజ్యాంగంలోని 12 మరియు 32 అధికరణలను ఉల్లంఘించిందని వాదిస్తూ, ఆయన సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
More Stories
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి
కాంగ్రెస్‌తో పొత్తు ముగిసినట్లు ప్రకటించిన డిఎంకె
టిసిఎస్ నాశిక్ కేసులో నిదా ఖాన్ పరారీకి ఏఐఎంఐఎం సహాయం!