తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దశాబ్ద కాలంగా కొనసాగుతున్న డిఎంకె – కాంగ్రెస్ బంధానికి తెరపడింది. కాంగ్రెస్‌తో పొత్తు ముగిసినట్లు డిఎంకె అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా, ‘ఇండియా’ కూటమి నుంచి కూడా తాము వైదొలుగుతున్నట్లు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లాకు డిఎంకె ఎంపి కనిమొళి తాజాగా లేఖ రాశారు.
పొత్తు ముగిసిందని అందువల్ల ఇప్పటి వరకు పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపిలతో కలిసి కూర్చుంటున్న డిఎంకె సభ్యులు ఇకపై వారి పక్కన కూర్చోవడం సముచితం కాదని లేఖలో ఆమె పేర్కొన్నారు. తమకు లోక్‌సభలో ప్రత్యేక సీట్లు కేటాయించాలని, తద్వారా సభలో తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలు కల్పించాలని ఆమె కోరారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత టివికెకు కాంగ్రెస్ మద్దతు తెలపడంతో డిఎంకె ఈ నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్, డిఎంకె మధ్య బంధం ముగిసిపోవడంతో క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. మయిలడుతురై లో కాంగ్రెస్ మద్దతుదారులపై డిఎంకె మద్దతుదారులు భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సినీనటుడు విజయ్ నేతృత్వంలోని టివికె పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోయింది.
డిఎంకె కూటమిలో ఉండి 5 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, అనూహ్యంగా టివికె ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం డిఎంకె అధినాయకత్వానికి తీవ్ర ఆగ్రహం కలిగించింది. వెన్నుపోటు పొడిచారంటూ మండిపడింది. తమ కూటమి అండతో ఎన్నికల్లో గెలిచి, ఫలితాలు రాగానే టివికె కు మద్దతు ఇవ్వడంపై డిఎంకె నేతలు నిప్పులు చెరుగుతున్నారు. “మా అండతో గెలిచి, మాకే వెన్నుపోటు పొడిచారు” అంటూ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ నమ్మకద్రోహం వల్లే పొత్తును రద్దు చేసుకుంటున్నామని, ఇకపై కాంగ్రెస్‌తో తమకు ఎలాంటి సంబంధం ఉండబోదని డిఎంకె స్పష్టం చేసింది. తమతో బంధానికి గుడ్‌బై చెప్పిన కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. డీఎంకే కూటమి వల్లే కాంగ్రెస్‌కు రాజ్యసభ ఎంపీ, అసెంబ్లీ సీట్లు వచ్చాయని ఎద్దేవా చేసింది.

More Stories
తమిళనాడులో వామపక్షాలు మద్దతు ఇస్తున్నా ఉత్కంఠ!
టిసిఎస్ నాశిక్ కేసులో నిదా ఖాన్ పరారీకి ఏఐఎంఐఎం సహాయం!
ఆపరేషన్ సింధూర్ తర్వాత 457 మంది పాక్ గూఢచారులు అరెస్ట్