తెలంగాణలో సుమారు రూ. 8 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను కానుకగా ఇచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మే 10వ తేదీన తెలంగాణకు విచ్చేస్తున్నారని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు తెలిపారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో మే 10 సాయంత్రం 4:30 గంటలకు జరగనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను బిజెపి తెలంగాణ రాష్ట్ర ఆయన శుక్రవారం క్షేత్రస్థాయిలో సమీక్షించారు.
ఈ సందర్భంగా సభా వేదిక నిర్మాణం, బారికేడ్ల ఏర్పాటు, జనసమీకరణ, వసతి సౌకర్యాలపై పార్టీ శ్రేణులు, అధికారులతో చర్చించారు. ఎండలు -వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సభా వేదికతో పాటు గ్రౌండ్ మొత్తాన్ని కవర్ చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా గురువారం ఈ ఏర్పాట్లను పర్యవేక్షించి, పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు.
దేశంలో మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ తొలిసారిగా తెలంగాణకు రావడం, అదేవిధంగా తాను రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని రాక ఇదే మొదటిసారి కావడం విశేషమని రావు తెలిపారు. ఇప్పటికే కేంద్రం తెలంగాణకు సుమారు రూ. 13 లక్షల కోట్ల నిధులను కేటాయించిందని గుర్తు చేస్తూ, రాష్ట్ర ప్రజలు ప్రధానికి ఘనస్వాగతం పలకాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాం, పుదుచ్చేరితో పాటు జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామాప్రసాద్ ముఖర్జీ స్వస్థలమైన పశ్చిమ బెంగాల్లో బిజెపి సాధించిన విజయం చారిత్రాత్మకమని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ లో గతంలో ఒక్క సీటు కూడా లేని పరిస్థితి నుంచి గత ఎన్నికల్లో బిజెపి 78 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచి కమ్యూనిస్టులను, కాంగ్రెస్ పార్టీల అరాచకాలను ధీటుగా ఎదుర్కొందని గుర్తు చేశారు.
కాగా మొన్నటి ఎన్నికల్లో బిజెపి అద్భుత విజయం సాధించి అధికారంలోకి వచ్చిందని, ఆ గెలుపు ఉత్సాహం తెలంగాణ ప్రజల్లోనూ, కార్యకర్తల్లోనూ కనిపిస్తోందని వెల్లడించారు.
మరోవైపు మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ‘నారీశక్తి వందన్ అధినియం’ చట్టాన్ని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చేలా ప్రయత్నిస్తే, కాంగ్రెస్, ఇండీ కూటమి పార్టీలు అడ్డుకోవడంపై ఆయన మండిపడ్డారు.
ఈ చారిత్రాత్మక సభను విజయవంతం చేసేందుకు బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ పదాధికారులు అహోరాత్రులు శ్రమిస్తున్నారని, సుమారు 2 లక్షల మందితో భారీ జనసమీకరణ చేస్తున్నామని రాంచందర్ రావు తెలిపారు. బిజెపి ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్, పార్టీ సీనియర్ నాయకులు చింతల రామచంద్రారెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.

More Stories
జూబ్లీహిల్స్‌లో విశ్రాంత ఐపీఎస్ భార్య దారుణ హత్య
కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
మంచిర్యాల రైతుల దుర్మరణం పట్ల బీజేపీ దిగ్బ్రాంతి