మంచిర్యాల జిల్లా లక్ష్మెట్టిపేట మండలంలో గాలివాన బీభత్సంతో ధాన్యం కల్లాల వద్ద ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోవడం పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన గుండారపు వెంకటేష్, తనుగుల అభిరాం, లచ్చన్న కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఈ మరణాలకు ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కారు అసమర్థతే కారణం అని స్పష్టం చేశారు.
పంట పండించిన రైతు ధాన్యం అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలకు వస్తే, వారాల తరబడి అక్కడే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అని ఆయన ప్రశ్నించారు. సకాలంలో కొనుగోళ్లు జరపాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. వానొస్తే తడవకుండా టార్పాలిన్లు కప్పే క్రమంలో గోడలు కూలి, షెడ్లు పడి రైతన్నలు ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్వింటాలు ధాన్యానికి కనీస మద్దతు ధర, మండీ హమాలీ చార్జెస్, ట్రాన్స్ పోర్టేషన్ ఛార్జీలు, ఐకేపీ సెంటర్లు, రైతు సంఘాలు, మార్కెట్ యార్డులకు కమీషన్, గోడౌన్లకు ఛార్జీలు, ప్రభుత్వ అధికారులకు ఛార్జీలు, వడ్ల బస్తాలకు, గన్నీ బ్యాగులకు.. ఇలా ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని బీజేపీ నేత స్పష్టం చేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేందుకు నొప్పేంటి? అంటూ విస్మయం వ్యక్తం చేశారు.
రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండించి కల్లాలకు తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా బాధ్యతారహితంగా వ్యవహరించడం దుర్మార్గం అంటూ రామచందర్ రావు మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ సర్కారు కళ్లు తెరిచి యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు వెంటనే భారీ పరిహారం అందించి ఆదుకోవాలని స్పష్టం చేశారు. అన్నదాతల ప్రాణాలతో చెలగాటం ఆడితే ప్రజలు ఈ సర్కారును క్షమించరని హెచ్చరించారు. రైతు బతికితేనే దేశం బతుకుతుందని పేర్కొంటూ ఈ సత్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు.
More Stories
కాంగ్రెస్ ది దగా ప్రభుత్వం.. రైతుల ఆక్రందనలు వినబడట్లేదా?
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యంపై నిరసన
కాజీపేట రైల్వే యూనిట్లో 200 ఇంటర్సిటీ రైళ్ల తయారీ