9న బెంగాల్ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం

9న బెంగాల్ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 15 ఏళ్ల టీఎంసీ పాలనకు ముగింపు పలుకుతూ ఘన విజయం సాధించిన బిజెపి రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం మే 9వ తేదీన జరుగుతోందని బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య అధికారికంగా ప్రకటించారు.  

పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర పరిశీలకుడిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను నియమించింది బీజేపీ అధిష్టానం. అలాగే, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని సహ పరిశీలకుడిగా నియమించింది.  బెంగాల్ బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నేత ఎంపికను కేంద్ర పరిశీలకులు పర్యవేక్షిస్తారు. దీంతో ముఖ్యమంత్రి ఎన్నికకు, ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమవుతుంది. 

అమిత్ షా, మోహన్ చరణ్ ఆధ్వర్యంలో బెంగాల్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు, అగ్రనేతలు సమావేశమై  బెంగాల్ బీజేపీ లెజిస్లేటివ్ నేతను ఎన్నుకుంటారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోవడం, కొత్త ప్రభుత్వ ఏర్పాటును షా, మోహన్ పర్యవేక్షిస్తారు. బెంగాల్‌లో ఈ నెల 9న కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ 207 సీట్లు గెలుచుకుంది. 

మరోవైపు అసోంకు సంబంధించి ప్రభుత్వ ఏర్పాటుకోసం కేంద్ర పరిశీలకుడిగా కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను బీజేపీ నియమించింది. నద్దాతోపాటు సహపరిశీలకుడిగా హరియాణా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని వ్యవహరిస్తారు. వీరు ఇద్దరూ అసోంలో బీజేపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటు, లెజిస్లేటివ్ పార్టీ లీడర్‌‌ ఎన్నికను పర్యవేక్షిస్తారు. అసోంలో బీజేపీ కూటమి 102 సీట్లు గెల్చుకుంది.