బీహార్ రాజకీయాల్లో శుక్రవారం ఒక ఆకస్మిక పరిణామం చోటుచేసుకుంది. ‘బంటీ’గా సుపరిచితులైన భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు అభిషేక్ కుమార్ సిన్హా, బంకీపూర్ ఉప ఎన్నికల బరి నుంచి తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. ఆ వెంటనే, ఆ పార్టీ నీరజ్ కుమార్ సిన్హాను ఉప ఎన్నికకు తమ కొత్త అభ్యర్థిగా ప్రకటించింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఊహించని పరిణామాలు బీహార్‌లో అందరినీ అయోమయానికి గురిచేశాయి. అధికారికంగా, ‘కుటుంబ కారణాల’ వల్లే ఉప ఎన్నికల నుంచి తప్పుకున్నట్లు సిన్హా తెలిపారు. కేవలం ఒక రోజు ముందే నామినేషన్ దాఖలు చేసిన సిన్హా, ఇకపై పార్టీ కార్యకర్తగా బీజేపీ కోసం పనిచేస్తానని చెప్పారు.
“కుటుంబ కారణాల వల్ల నేను ఉప ఎన్నికలో పోటీ చేయలేకపోతున్నాను. కానీ, అంకితభావం కలిగిన కార్యకర్తగా పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటాను. ఈ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సరౌగీకి తెలియజేశాను,” అని సిన్హా విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అయితే, సిన్హా తప్పుకోవడానికి కేవలం ‘కుటుంబ కారణాలు’ మాత్రమే కాకుండా ఇతర కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తున్నది.
సిన్హా కుటుంబానికి ‘పశుగ్రాస కుంభకోణం’తో ఉన్న సంబంధం కారణంగానే బీజేపీ చివరి నిమిషంలో ఈ మార్పులు చేసింది. మగధ్ కెమికల్స్ కార్పొరేషన్‌లో మేనేజర్‌గా పనిచేసిన సిన్హా తండ్రి రవీంద్ర ప్రసాద్, పశుగ్రాస కుంభకోణంలో దోషిగా తేలారని ఆ వర్గాలు తెలిపాయి. నకిలీ బిల్లుల ద్వారా ప్రభుత్వ నిధులను కాజేయడానికి ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
పశుగ్రాస కుంభకోణంలో 2022లో సీబీఐ కోర్టు దోషిగా నిర్ధారించిన 75 మందిలో ప్రసాద్ ఒకరు. 2001 నుండి 2003 మధ్య సీబీఐ దాఖలు చేసిన మూడు ఛార్జ్‌షీట్లలో కూడా ప్రసాద్‌ను నిందితుడిగా పేర్కొన్నారు. దీనికి గాను ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష పడింది.
ఇది కాకుండా, ఉప ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు సిన్హా తన విద్యా అర్హతకు సంబంధించిన సమాచారాన్ని కూడా దాచిపెట్టారు. తన నామినేషన్ పత్రాల్లో తాను 10వ తరగతి ఉత్తీర్ణుడినని పేర్కొన్నప్పటికీ, అందులో కొన్ని వ్యత్యాసాలు కనిపించాయి. దీంతో ఉప ఎన్నికలకు ముందు ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని భావించిన బీజేపీ చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చాల్సి వచ్చిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
‘జన్ సురాజ్’ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ పోటీ చేయాలన్న నిర్ణయం ఈ ఉప ఎన్నికను ఆసక్తికరంగా మార్చింది. మరోవైపు, ఆర్జేడీ రేఖా కుమారి గుప్తాను బరిలోకి దింపింది. ఆమె గతంలో బాంకీపూర్ నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినవారే.

More Stories
జాతీయ గీతం ఆలాపనలో సరైన సాహిత్యం, ఉచ్ఛారణ తప్పనిసరి
సుప్రీంకోర్టు సీజేఐపై పేపర్లు విసిరేసి దూషించిన పిటిషనర్!
కాబోయే ట్రస్టీలు రామ్‌టెక్ శ్రీరాముని భక్తులమని ప్రకటించుకోవాలి